రూపనామములు వేరు వేరుగా ఉన్నాయి. గాని, అందరియందున్నది పంచ భూతములే. దేహం అస్థిరమైనది కనుక, ఇది ఉన్నంతలోనే దివ్వత్వాన్ని అనుభవించడానికి తగిన సాధన చేయాలి. దేహంద్వారానే దైవాన్ని పొందగలుతారు. దేహమే లేక మీరు ఏ కర్మలూ ఆచరించలేరు. దేహము కర్మక్షేత్రము, హృదయం ధర్మక్షేత్రము. హృదయంలో నివసించే దైవాన్ని తెలుసుకోవాలంటే హృదయాన్ని పవిత్రం చేసుకోవాలి. దైవాన్ని పొందటం కంటే సులభమైనది జగత్తులో మరొకటి లేదు. ఎందుకు మీరింత కష్టపడుతున్నారు? ఎందుకింత నిరాశ, నిస్ఫృహలకు గురౌతున్నారు? క్రిందటి రాత్రి విద్యార్థులు ప్రదర్శించిన డ్రామాలో మీరు చూశారు - బిజినెస్ లైసెన్స్ దొరకనందుకు ఆ వ్యాపారస్థుడు ఎంతగా ఏడ్చాడో! ఈనాటి మానవుడు ఇట్టి లౌకికమైన విషయాల కోసం ఏడుస్తున్నాడుగాని, దైవంకోసం ఏడ్చటం లేదు. ఒక పర్యాయం నరేంద్రుడు రామకృష్ణునివద్దకు వెళ్ళి "స్వామీ! మీరు దైవాన్ని చూశారా?" అని అడిగాడు. "ఆ చూశాను" అన్నాడు రామ కృష్ణుడు "ఎట్లా చూశారు?" అని మళ్ళీ ప్రశ్నించాడు నరేంద్రుడు “నిన్ను నేను, నన్ను నీవు చూస్తున్నట్లుగా దైవాన్ని కూడా చూశాను" అని రామకృష్ణుడు బదులు చెప్పాడు. "మరి అందరికీ ఎందుకు కనిపించటం లేదు?" అని ప్రశ్నించాడు నరేంద్రుడు. అప్పుడు రామకృష్ణుడు చక్కని జవాబు చెప్పాడు. "అయ్యా! లోకులు ధనం కోసం ఏడుస్తున్నారు. భార్యాపిల్లలకోసం, ఏడుస్తున్నారు. ఇండ్లకోసం ఏడుస్తున్నారు. కాని, దైవం కోసం ఏడుస్తున్నారా? దైవంకోసం ఏడ్చినప్పుడు తప్పక దైవం కనిపిస్తాడు".
మీరు దైవాన్ని పొందాలంటే దైవం కోసం మీ సర్వస్వాన్ని త్యాగం చేయాలి. త్యాగము ద్వారానే అమృతత్వము ప్రాప్తిస్తుందని చెప్పింది. వేదము. మీరు గాలిని పీల్చుకుంటున్నారు. దానిని తిరిగి వదలకపోతే మీ ఊపిరితిత్తులు పాడైపోతాయి. ఆట్లే, మీరు భుజించిన ఆహారాన్ని విసర్జించకపోతే మీ కడుపు చెడిపోతుంది. అంతవరకూ పోనక్కరలేదు. మీ శరీరంలో రక్తము ప్రసరిస్తున్నది. అది రోజుకు 12 కోట్ల మైళ్ళ దూరం ప్రయాణం చేస్తుంది. అటువంటి రక్తం ఒకచోట నిలుస్తే అక్కడొక పుండు ఏర్పడుతుంది. కనుక, త్యాగంలోనే క్షేమం ఉన్నది. కాని, నేటి మానవుడు త్యాగానికి పూనుకోవటం లేదు. ఆకలితో అలమటించే భిక్షగానికి పిడికెడు అన్నం పెట్టడానికి కూడా వానికి మనసొప్పటం లేదు. ఆకలితో బాధపడేవానికి పిడికెడు అన్నం పెడితే వాడు ఎంత ఆనందిస్తాడో కదా! కాని, మానవునిలో ఇట్టి విశాలమైన భావములు క్షీణించిపోయాయి.
(స.సా.డి.99 పు.350/351)
దైవముకోసము యేరీతిగా ఆరాటపడాలి?
మందలో మరిగిన మాతకై లేదూడ అంబ అంబాయని అరచినట్లు
విభుని బాసిన కాంత విరహవేదన సొక్కి మూలమూలల దాగి మూల్గినట్లు
ఆకలిచేతను నల్లాడుచున్నట్టి నిరుపేద తా భిక్షమడిగినట్లు
బిడ్డలు లేక అల్లాడుచూ ఆవేదన పడుచున్నవాడు, ఒక్క సుపుత్రుడు కావాలని ఏవిధంగా ప్రార్థించుతూ వుంటాడో ఆవిధంగా ప్రార్థించాలి. ఆర్తుడై తాదాత్మ్వతత్వాన్ని అనుభవిస్తూ దైవత్వములో ఏకము కావటానికి తగిన పరితాపమును పొందాలి.
(శ్రీ.గీ.పు.39)
100దైవకర్మ