కర్మా కర్మల యొక్క యదార్థ దర్శనము కలిగినవాడే నిజమైన పండితుడు. పుస్తకమందున్న విషయములను కంఠస్థము చేసి మస్తకమున చేర్చినంత మాత్రమున పండితుడని తలంచరాదు. పండితుడు కాదు. సమ్యగ్జర్శనమునకు యోగ్యుమగు బుద్ధికలవాడే పండితుడనబడును. అట్టి జ్ఞానసంపదను ఆర్జించినవాని సర్వ కర్మలూ పటాపంచలము కాగలవు. జ్ఞానాగ్ని యందు మాత్రము మిగిలినది.ట్టి దహనశక్తి కలదు. అయితే ప్రారబ్ధ కర్మను జ్ఞానులయిననూ అనుభవించి తీరవలెనని కొందరి అభిప్రాయము. ఇది పరదృష్టి నాశ్రయించి, జ్ఞానికి ప్రారబ్ధముండినట్లు తోచునే కాని స్వదృష్టికి అది లేదు. ఎవడు లౌకిక వస్తువులపై ఆధారపడివుండడో ఇంద్రియ సుఖమును యెవడానించడో సర్వవిధము లైన వాసనా కామము లెవ్వని వదలియుండునో అట్టివాని యందు శబ్దాదులు వాటి ప్రభావములు కూడనూ చూపలేవు. ఇట్టి స్థితిని సాధించినవాడే సన్యాసి అనిపించుకొనును. అతడే సర్వపరిగ్రహవివర్జితుడు. ఇతడే జ్ఞాని, అనగా నిరంతరమూ బాహ్య వస్తువులపై విషయములపై ఆధారపడక తనయందె తానుసంతృప్తి పొందువాడు. ఇతను కర్మయందు అకర్మనూ, అకర్మయందు కర్మనూ దర్శించిన మహానుభావుడు, పండితుడు. ఇట్టి వ్యక్తి కర్మలయందు ప్రవర్తించు చుండినప్పటికి అట్టి కర్మల కేమాత్రమూ బాధ్యుడు కానివాడే అగును. జ్ఞానికి ఫలాపేక్ష వుండదు. కారణమేమందువేమో, విను! అతను నిత్య తృప్తుడు. అతడు నిరాశ్రితుడు. అతనికి కర్తృత్వభావము లేకుండును. అనిచ్ఛా ప్రారబ్ధముననూ పరేచ్ఛా ప్రారబ్ధముననూప్రాప్తించిన అనుకూల ప్రతికూల పదార్థములయందు రాగద్వేషములు లేక సదాతృప్తిగా వుండును. ఇతని యదృచ్ఛాలాభ సంతుష్టుడని కూడనూ అందురు. ఏది జరిగిననూ భగవ దిచ్చామపారము జరుగునని నిరంతర ప్రశాంతి ప్రసన్నుడై విశ్చలచిత్తుడై సదానందమున తాండవమాడును. తృప్తిగలవాడే జ్ఞాని అసంతృప్పుడేఅజ్ఞాని.
(గీ పు.83/84)
.
అర్జునా! నీ వెవరో, నీవు చేసే పని యెమో కొంత యోచించుకో, అన్నియూ నాకు తెలుసునని అంటావు. గోడున ఆడువారివలె యేడుస్తావు. మాటలు పండిత మాటలు, ఆటలు పామర ఆటలు. మాటలలో జ్ఞానివని తలంచిన, ఆటలతో అజ్ఞానివని చింతించవలసి వచ్చుచున్నది. నీ స్థితిని చూచిన మాత్రము మిగిలినది.గమ్యగోచరముగా నున్నది. పోనీ పండితుడవేనని అందుమా, చావు బ్రతుకులకు పండితులు దు:ఖించరు, దు:ఖించకూడదు. అట్లు దుఃఖింతురా వారు పండితులు కారు."
దేహము యొక్క మర్మమును ఆత్మ యొక్క మర్మమును వున్నదున్నట్లు తెలిసి కొనువారే పండితులు కాదా! అట్టి పండితులు కాయములతో వున్నవారికి కానీ, వూడిన వారికి కాని దుఃఖించరు. యెట్టి ద్వంద్వ పరిస్థితులలోను చిత్త సమాధానాన్ని కోల్పోరు. యేమియూ రెండూ తెలియని అజ్ఞానులే మరణించిన వారికై విలపించేది. తెలిసి తెలియని వారు బ్రతికి వున్న వారి బాగోగుల కొరకు దుఃఖించుదురు. అన్నియూ తెలిసిన పండితులు దేనికి దుఃఖించరు.
(గీ.పు.24/25)
శాస్త్రజ్ఞానము కలవాడు పండితుడు కాడు. వేదశాస్త్ర ఇతిహాస పురాణ ప్రమాణములు గుర్తించినవాడు పండితుడు కాడు. పాండిత్యమును ఆర్జించిన వాడు పండితుడు కాడు. భాషాప్రవీణుడైన పండితుడు కాడు. "పండితా: సమ దర్శినః" సమాన దృష్టి కలిగిన వాడే నిజమైన పండితుడు. పండితులైన వారి దృష్టిలో గో, బ్రాహ్మణ, ఛండాలాదిగా గల వారందరూ సమానులే.
(శ్రీ భ.ఉ.పు. 19)
ఒక పర్యాయం బుద్ధుని వద్దకు ఒక పండితుడు వచ్చి "బుద్ధా! నీవు నన్ను జయించావంటే నేను, నా మూడు - వేలమంది శిష్యులు నీకు పాదాక్రాంతులమై నీ సేవ చేస్తాము, బౌద్ధమతమును స్వీకరిస్తాము. ఒక వేళ నీవు ఓడిపోయినట్లయితే నీవు నాకు పాదాక్రాంతుడవు కావాలి" అన్నాడు. అప్పుడు బుద్ధుడు చిరునవ్వు నవ్వుతూ - "పండితా: సమ దర్శినః" - "సమత్వాన్ని పూనినవాడే పండితుడు. పండితునకు సుఖదుఃఖములనేవి తెలియపు; ఎక్కువ తక్కువలనేవి ఉండవు. కానీ నీయందు అహంకారమున్నది. క్రోధమున్నది. అలాంటప్పుడు నీవు - పండితుడ వెట్లవుతావు? ఆత్మజ్ఞానం గ్రంథపరిచయంలో వచ్చేది కాదు. లౌకికమైన పాండిత్యంలో వచ్చేది కాదు, గురువులు అందించేది కాదు. ఈ లోకంలో కట్టలు కట్టలు పుస్తకాలు చదివేవారున్నారు. కానీ వాటిలోని పవిత్రమైన విషయాలను ఆచరణలో పెట్టేవారు ఒక్కరైనా ఉన్నారా? జీవితమంతా చదువుతూనే ఉంటే ఇంక ఆచరణలో పెట్టేదెప్పుడు? ఆచరణలో లేని పాండిత్యము పాండిత్యమే కాదు".
కవిం పురాణ మనుశాసితారం
అణోరణీయాంస మనుస్మరేద్యః
సర్వస్య ధాతార మచి న్త్య రూపం
ఆదిత్యవర్గం తమ సః పరస్తాత్
కవి అనగా ఎవరు? ఏవో కొన్ని పదములను కూర్చి పద్యములల్లే వాడు కాదు కవి. భూత భవిష్యత్ వర్తమానములను చక్కగా గుర్తించినవాడే కవి. అతడుభగవంతుడొక్కడే.‘పురాణమ్ అవగా ఏమిటి? ఈ దేహమనే పురంలో నఖశిఖ పర్యంతము సంచరించే దివ్యత్వమునే పురాణమ్ అన్నారు. ఇంక అనుశాసితు డనగా ఎవరు? లోకంలో పరుల సొత్తు అపహరించినవారిని, పరులకు అపకారం చేసినవారిని చెఱసాలలో పెట్టి బీగం వేస్తారు. కానీ మనస్సును ఎవరైనా చెఱసాలలో పెట్టగలరా? మనస్సు తన ఇంటికి పోవచ్చు. తనవారిని చూడవచ్చు. ఇంకెక్కడికైనా సంచరించవచ్చు. ఈ జగత్తులో దేహాన్ని శాసించే జడ్జీలు కావలసినంతమంది ఉన్నారుగాని, మనస్సును శాసించే జడ్డి ఒక్క భగవంతుడు తప్ప మరొకడు లేడు. అతడే అనుశాసితుడు.
బుద్ధుడు ఈ విధంగా సుమాధానం చెప్పి ఆ పండితుని నోరు మూయించాడు. "నాయనా! ఇకపైన నీవు ఆడంబరములకు పూనుకోవద్దు, అహంకారమునకు అవకాశ మివ్వవద్దు. అహంకారము అధఃపతనం గావిస్తుంది. నీవు సంపాదించవలసింది. లౌకికమైన, భౌతికమైన, ప్రాకృతమైన పాండిత్యము కాదు; భగవంతునికి అర్పితమయ్యే దివ్యమైన, నవ్యమైన, భవ్యమైన జ్ఞానమును సంపాదించుకో. నేను సత్యాన్ని గుర్తించాలని నిద్రాహారములను త్యజించి, ఆకలి దప్పులను మరచి ఎంతో కాలం సాధన చేశాను. నీవు చదివిన గ్రంథములకంటే ఎక్కువ గ్రంథములనే చదివాను. ఎంతోమంది పండితులను దర్శించాను, అనేకమంది గురువులను సేవించాను. కానీ నాకు తృప్తి కలుగ లేదు. చివరికి, పంచేంద్రియములమ సద్వినియోగ పరచకుండా ఎన్ని సాధనలు చేసినా ప్రయోజనం లేదని గుర్తించాను. కనక ముందు వాటిని పవిత్రం గావించుకో. అప్పుడే నీవు నిజమైన పండితుడవవుతావు. భగవంతుడు ప్రసాదించిన పంచేంద్రియాలను సద్వినియోగ పరచినప్పుడే ఆనందం ప్రాప్తిస్తుంది. నేను నా పంచేంద్రియాలను సన్మార్గంలో ప్రవేశ పెట్టాను, సద్వినియోగ పర్చాను. తద్వారా అవి నా స్వాధీనమైపోయాయి. అందుచేతనే నేనిప్పుడు ఆనందస్వరూపునిగా ఉన్నాను" అన్నాడు. ఆనందములో లీనం కావడమే నిర్వాణము.
నీటియందె పుట్టి, నీటియందె పెరిగి
నీ టియందడంగు నీటి బుడగ
నరుడు బుద్బుదంబు, నారాయణుడు నీరు
ఉన్న మాట తెలుపుచున్న మాట.
ఈ బుడగలన్నీ నీటి యందె పుడుతున్నాయి. నీటి యందె నిలుస్తున్నాయి. నీటి యందె సంచరిస్తున్నాయి, నీటి యందె అణగిపోతున్నాయి. ఇదియే మానవ జీవితము. మనం ఆనందము నుండియే పుట్టాము. ఆనందమునందే సంచరిస్తున్నాము. ఆనందమునందే లీనం కావాలి. ఇంతకంటే మరొక మార్గం లేదు.
(స.సా. మా.99 పు.69/70)
(చూ|| స్మరింతురు)