పాంచ భౌతికము దుర్భల కాయము
ఎప్పుడు విడిచేది ఎఱుకలేదు.
శత వర్షముల దాక మితము చెప్పిరిగాని
నమ్మరాదా మాట నెమ్మనమున
బాల్యమందో మంచి ప్రాయమందో లేక
ముదిమియందో లేక ముసలియందో
ఊరనో అడవినో ఉదక మధ్యంబునో
ఎక్కడో విడిచేది ఎఱుక లేదు"
(స. సా. ఏ. 99 పు. 98)
రాముడు, "ఓ తారా! ఎందులకు విలపింతువు? వీరపత్ని ఆయిన నీకు ఈ విలాపము కీర్తినందించదు. శాంతిని చేకూర్చదు. శరీరములనిత్యములు. ఇది నికృష్టము. వాలియే ఈ కాయమును తుచ్చముగా భావించెను. ఏనాటికైనమా కాయములు పడక తప్పదు, రాలక తప్పదు. పరమలక్ష్యము నిమిత్తము కాయము కాని లక్ష్యమును వీడిన కాయము, బొగ్గుతో సమానము, పోనీ ఆత్మ నిమిత్తమని దుఃఖించుచున్నావా? ఆత్మ నిత్యమైనది దానికెట్టి పరిణామములు వుండవు. యెట్టివారికైననూ ఆత్మతత్వము తెలియనంతవరకే కాయము పై భ్రాంతి. దేహ భ్రాంతి అజ్ఞానము, ఆత్మభ్రాంతి జ్ఞానము. మట్టిలో మాణిక్యము లభించినటుల, మాంసపు దేహములో దేహి నిమిత్తము దేహి రాడు. క్షణభంగురమైన, మలినమైన, దుర్గంధములలో, మలమూత్రాదులతో నిండిన ఈ దేహము యెట్టివాడైననూ ఒకానొక దినము వీడక తప్పదు. ఆ కాయముతో సాధించునట్టి కార్యమే మానవత్వమునకు శోభనందించును. మీ రతి మహాఘనకార్యములు చేసినను. పరిపాలనలో తాను. అనుచరులను, నమ్మినవారలను ప్రాణ సమముగా చూచుకొనెను. రాక్షసులను హత మార్చెను. దైవభక్తి మెండు. యెటు తిరిగి తన సోదరునకు అపకారము చేసెను. అదొక్క పాపము తప్ప మరే పాపమును చేయలేదు. ఆ పాపమునకు తగినఫలముగా నా చేతులలో ప్రాణములు వీడెను. కనుక, ఆ పాపము కూడా పరిహారమయినది. ఇక నీవు చింతించకూడదు" అని అనేక విధముల తారకు జ్ఞానోదయమగునట్లు బోధించెను.
(రా. ర. వా రెం. భా.పు 81/83)
కాయంబుచే జేయు కార్యంబు లెల్లను
నోటితో పల్కెడు మాటలెల్ల –
తలమనస్సుల గల్గు తలపులనన్నిటి
పది యింద్రియంబుల పనులనెల్ల
బుద్దిలో గలిగెడు పూనిక లెల్లను
చిత్తంబు నందలి చింతలెల్ల
అనుదినంబును సల్పు ఆచారముల నెల్ల
నీమంబుతో చేయు నిష్ఠ లెల్ల
వైదికంబులు లౌకిక వర్తనములు
ఏమిచేసిన నవియన్ని యీశ్వరునకు
తాను చేసెడి సేవగా తలచియున్న
సార్థకంబౌను శ్రీసాయి సంస్థలన్ని
(శ్రీవాణి సె2022 పు29)
“కాయము సంసార కర్తవ్య కర్మలకు,
భావము బాబా ప్రేమమకరందము గ్రోలుటకు.
బుద్ది దైవముపై, సంసారము భుజములపై ఉంచుకొని
నీ డ్యూటీ నీవు చేయవలెను”
(సనాతన సారథి, జనవరి 2019 పు21)