సముద్ర కెరటాలవలె సుఖదు:ఖాలు వస్తూపోతూ ఉంటాయి. అవి ఉచ్చ్వాస నిశ్వాసముల వింటివి. వాటిలో ఉంటూ ప్రశాంతిని మీరు పొందగలిగితే మీరున్నచోటే కాశి అవుతుంది. మీరు చేసే ప్రతిపని శివపూజు అవుతుంది. మీరు మీ మనస్సుతో పాటే సంచరించండి. దాని భావాలు, రహస్యాలు మీకు అర్థమవుతాయి. మీ సామ్రాజ్యాలకు మీరు అధికారులు కాకుండగా ఇతర దేశాలలో సంచరిద్దామని భావించకండి. ముందు మీ సంగతి, తరువాత ఇతరుల సంగతి. మిమ్మల్ని మీరు తెలుసుకోండి. ఈ పాఠం ఒక్కసారి నేర్చుకుంటే మీరు ఇతరులను వేగంగా స్పష్టంగా తెలుసుకోవచ్చు.
ఈ జీవితాన్ని ఇతరుల సేవకై అంకితం చేయండి. ఇతరులు అంటే మీ లోపల ఉన్న భగవంతుని ప్రతిరూపాలే. మానవుడు భగవంతుణ్ణి చేరే పురాతనమైన రాజమార్గం పాడయిపోయింది. ఆ మార్గాన్ని మరమ్మత్తులుచేయటానికే నేమ వచ్చింది. నిజాయితీగల ఆలోచనా - పరులుగా, ఇంజనీర్లుగా, పనివాళ్ళుగా తయారై నన్నుచేరండి. వేదములు, ఉపనిషత్తులు, శాస్త్రములే నేను చెప్పిన మార్గము. దానిని అందరికీ ప్రకటించి సంస్కరించటానికే నేను వచ్చింది.
(వ.61-62 పు.182)
“ముఖము సుఖము, కాళ్లు దుఃఖము. ఇంటికి వచ్చిన అతిధికి స్వాగత మీయదలచినచో, ముఖమును మాత్రం లోపలికి రానిచ్చి కాళ్ళను గడప వెలుపల నుంచోమనుట కుదరదు. స్వాగత మీయదలచుకొన్నచో, సుఖదుఃఖములను రెండిటిని సమానముగా స్వీకరించవలెను. వలదనుకున్నచో, రెంటిని నిరాకరించ వలెను.” -బాబా (సాలీత పు110)
జీవితంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా తొణకక, బెణకక వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలి. –
తలచినట్టి పనులు తారుమారైనచో
తొణక వలదు ఎవరు బెణక వలదు
చీకు చింత వీడి చిరునవ్వు నవ్విన
అతడె గుండె పండినట్టివాడు.
జీవితమొక సవాలు, ధైర్యంగా ఎదుర్కోవాలి. -ఎట్టి పరిస్థితులందైనా బలహీనతకు చోటివ్వకూడదు. బలహీనులు ఏ చిన్న కార్యమునైనా సాధించలేరు. కనుక, మీరు మానసిక బలమును సంపాదించుకోవాలి, మీ మనస్సు దైవవిశ్వాసంతో కూడినదిగా ఉండాలి. మంచి పైన విశ్వాసమును, చెడు పైన అవిశ్వాసమును పెంచుకోవాలి. కష్టాలు కదలిపోయే మేఘాలవలె వసూంటాయి, పోతూంటాయి. వాటికి వెఱువకూడదు. పట్టాభిషేకానికి సంసిద్ధమైన రాముడు అదే క్షణంలో ఆనందంగా అడవికి వెళ్ళాడు. “సుఖ దుఃఖే సమేకృత్వా లాభా లాభౌ జయా జయ్", సుఖ దుఃఖాలయందు సమత్వాన్ని వహించాడు. ఇట్టి సమత్వం మానవునియందు కనిపించటం లేదు. తనకు అర్హత ఉండినప్పటికీ రాముడు అధికారమును ఆశించలేదు. కానీ, మానవుడు తనకు అర్హత లేనప్పటికీ అధికారాలకోసం ప్రాకులాడుతున్నాడు. రామునికి అన్నింటియందు ధీరత్వమే కానీ, ఏనాడూ దీనత్వం లేదు. రామనామాన్ని స్మరించేవానికి కూడా ధీరత్వమే వస్తుందిగానీ, దీనత్వం రాదు. నిరంతరం రామనామాన్ని స్మరించిన హనుమంతుడు రాముని ఎదుట దీనుడై నిలిచాడు, రావణునివద్దకు పోయినప్పడు ధీరుడై నిలిచాడు. అనగా, దివ్యత్వము ఎదుట దీనుడైనాడు. అహంకారము ఎదుట ధీరుడైనాడు. (శ్రీ వాణి ఏ ప్రియల్ 2022 పు 6)