ఆత్మభావమును లక్ష్యమునందుంచుకొని ఏ కార్యమైనా చేయి. నీవు తప్పక స్వాతంత్ర్యముగా వుంటావు. Individual freedom అనిగాని Spiritual freedom అనిగాని రెండు వేరు వేరుగా లేవు. ఆధ్యాత్మికమే స్వాతంత్ర్యము, స్వాతంత్ర్యమే ఆధ్యాత్మికము. ఇవి రెండు వేరు వేరుగా ఉండటానికి వీలుకాదు. ఒక పదార్థము భిన్న స్వరూపాలను ధరించింది. పాలున్నాయి. పాలు పెరుగు చేసుకున్నాము. పెరుగు చిలికినాము వెన్న వచ్చింది. మజ్జిగ వచ్చింది. పాలుగా వున్నది పెరుగుగా కావటము వెన్నగా కావటము మజ్జిగగా కావటము ఇన్ని రూపాలు చెందింది. ఐతే యిన్ని రూపములోనున్న పాలు ఒక్కటే. అదే విధముగనే సాలోక్యము, సారూప్యం, సామీప్యం, సాయుజ్యం ఈ నాలుగు భిన్న భిన్న రూపనామములు గాని, నాలుగు చేరి ఒక్కటే. ఐతే ఒకదాని కొకటి సోపానములు. సాలోక్యం - భగవత్ చింతన చేస్తున్నాం. భగవత్ లోకం, భగవంతుని చింతన చేస్తూ చేస్తూ ఏమైపోతుంది? సామీప్యం స్వామి చింతన చేస్తూ స్వామికి దగ్గరగా పోవాలి అని ఒక ఆశ పుడుతుంది. సామీప్యం పోయిన తరువాత స్వామిలో ఐక్యము కావాలి స్వామివలె వుండాలని ఆశిస్తావు. సారూప్యం పొందాలని ఆశించిన తరువాత సాయుజ్యం కావాలని ఆశిస్తావు. ఇవన్ని ఒకదాని యొక్క భిన్న స్వరూపములే కాని వేరు వేరు కాదు. (బృత్ర. పు. ౧౪౯/౧౫౦ )
ఆధ్యాత్మికమనగా సంకుచితమైన స్థాయిలో విచారించ రాదు. పూజలు చేయటము, భజనలు చేయటము, ధ్యానము చేయటము యివన్ని ఆధ్యాత్మికమునకు చిహ్నములుగా మనము భావిస్తున్నాము. ఇవన్నీ మానసిక వికారములే. మనస్సు తృప్తి నిమిత్తము ఆచరించే చర్యలే. మానసిక వికారములే. భగవంతుడే మాకు మాత, భగవంతుడే మాకు పిత, భగవంతుడే మా స్నేహితుడు - యీ విధముగా అనేక రకములుగా భగవంతుని వర్ణిస్తుంటాము. దేవుడే దైవము. తల్లి, తండ్రి స్నేహితుడు యీ విధమైన భావాలు ఎందుకు? నీవే నేను నేనే నీవు. అనుకుంటే పోతుంది కదా. You and l are one. అంటే యిక్కడ సరిగా సరిపోదు. ఆధ్యాత్మికము ఖండిస్తుంది. You and I are We. అవుతుంది. గాని one కాదిక్కడ. We and we are one. నీలోన నేనువున్నాను. నాలోన నీవు వున్నావు. ఇరువురు చేరినప్పుడు ఒకటైపోతాము. అక్కడ రెండు వుంది. ఏమంటే భౌతికమైన దేహమును ధరించిన శరీరము ఒకటి వుంది. అందులో ఆధారమైన ఆత్తత్వము ఒకటి వంటున్నాది. అదే వుయ్. ఇక్కడ కూడను భౌతిక సంబంధమైన దేహమును ధరించటం చేత యిది ఒకటి వుంటున్నాది. ఇందులో ఆత్మతత్వము వుంటున్నది. ఇది కూడా వుయ్. కనుకనే యీ రెండింటి యొక్క తత్వాన్ని గుర్తించుకుంటే, తల్లి, తండ్రి స్నేహితుడు యీ రకమైన సంబంధములే అక్కరలేదు. ఇరువురు ఒక్కరే. ఇరువురు అనే లేదు. రెండుగా కనుపించినప్పటికి అందులో ఒక్కటే. ఇక్కడే నీకు ప్రత్యక్షం. ఇవి (మైకులు) రెండుగా కనుపిస్తున్నాయి. కాని యీ రెండు చేరి ఒకటిగానే వినిపిస్తున్నాయి. కనుపించటం రెండు, వినిపించటం ఒక్కటే. కనుక దేహాత్మ భావము ఈ హృదయ తత్వము రెండింటిని ఒక్కటిగా చేర్చాలి. ఆదే మనము చేయవలసిన సాధన. ఆధ్యాత్మికమనగా దైవముతో ఏకము కావటమే. దైవము నీవు వేరు కాదు. నీవే దైవము దైవమే నీవు. ఈ విశ్వాసమును యీ స్థాయినుండి అభివృద్ధి గావించుకున్నప్పుడు యింక యేవిధమైన సాధనలు చేయనక్కర లేదు. (బృత్ర -౧౫౩)
లౌకిక విద్యలతోపాటు ప్రాచీన సంస్కృతిని మనము సరియైన మార్గములో అనుభవించాలి. Culture and spirituality అంటున్నారు కానీ నా ఉద్దేశ్యంSpiritualityయొక్కసారమేCulture. అంతేకాని కల్చర్ వేరు spirituality వేరు అని రెండు వేరుగా విభాగము చేయరాదు. ఆధ్యాత్మికము ఆనందముల యొక్క రసస్వరూపమే మన సంస్కృతి. సంస్కృతి సంస్కృతము నుండి వచ్చినది. సంస్కృతము సంస్కారముతో ఏర్పడినదే. ఈ సంస్కారమే ఆధ్యాత్మికము. ఈ ఆధ్యాత్మిక మార్గము చేతనే అన్ని సంస్కృతులు ఆవిర్భవించినాయి. అన్నింటియందూ ఉన్నది ఒక్కటే. అదే "ఏకం సత్", అన్ని దేశముల సంస్కృతి ఈ ఆధ్యాత్మిక మార్గములోనే అణిగి ఉంటున్నది. మనము ఎన్నిరకములైన తీపులు (Sweets) చేసుకొన్నప్పటికీ - గోధుమ హల్యా, బాదంఘీరు, గులాబ్జామ్, జిలేబి, లడ్డు అన్నింటిలో ఉన్నది చక్కెర ఒక్కటే అని ఏవిధముగా గుర్తించగలమో అదే విధముగా ఏ దేశము సంస్కృతి యైననూ ఆధ్యాత్మికము నుండి ఆవిర్భవించినదే. Culture అని Spirituality రెండూ వేరు చేయుట మంచిది కాదు. Spirituality లోనే culture ఉంటుంది. (బ్బత్ర, పు. ౯౯)
ఆధ్యాత్మికము అనేది ఒక "రిలిజెన్" కాదు. అన్ని దేశాలకు ఆధ్యాత్మికము అవసరము. అసలు "రిలిజన్" అంటే ఏమిటి? To Realise is religion. అనగా తనను తాను తెలుసుకోవాలి. "నేను" ఎవరో గుర్తించాలి. రిలిజన్ పేరుతో మానవులను విడదీస్తున్నారు. మానవులందరూ ఒక్కటే! ఇట్టి ఏకాత్మభావాన్ని మీరు పెంచుకోవాలి. ప్రేమ నుండే ఏకాత్మ భావం కలుగుతుంది. (దే.యు.పు.9)
1. ఆత్మ విచారణ చేసి దేహము, మనస్సు, బుద్ధి, ఆత్మల గురించి తెలుసుకోవడమే ఆధ్యాత్మికము.
2. ఆత్మ విచారణ చేయుట ఉత్తమ లక్షణము, తనను తాను తెలిసికోవడమే ఆధ్యాత్మికము.
3. ఆత్మ దివ్యాత్మ అని, సర్వవ్యాపకమైన విశ్వాంతరాత్మ అని తెలిసికొనుటే సరియైన తత్మ విచారణ, ఆత్మవిచారణ.
4. అన్ని రూపాల్లోనూ, అన్ని ఖనిజాల్లోనూ, అన్ని వృక్షాలలోనూ సర్వత్రా ఆత్మను దర్శించుటే సరిఅయిన ఆధ్యాత్మికము.
5. నేను, నాది అనుభవాలను విడనాడి, నామరూపాల నుండి దూరముగా ఉండడమే ఆధ్యాత్మికము. (ఇక్కడ సంకుచిత బుద్ధిని కలిగించే నేను, నాది అనే మనోభావాలకు దూరంగా ఉండి, నామరూపాలకు అతీతమైన ఆధ్యాత్మిక భావన కలిగియుండడమే ఆధ్యాత్మికత.)
6. ఆత్మానందాన్ని అనుభవించడమే అత్యుత్తమమైన ఆధ్యాత్మికము. (ఇచ్చట ఆత్మ, దానినుండి లభించే ఆనందము ఇంద్రియాతీతము అని అర్థమవుతుంది.)
7. దేహములోని ప్రతి అణువు దివ్యత్వముతో పని చేయుచున్నదని తెలిసికోవడమే సరైన ఆధ్యాత్మికము. (దేహము మృణ్మయము. ఆత్మే చైతన్యమై దేహాన్ని నడిపించేదని స్పష్టమవుతుంది. దృశ్యము, దృష్టి ద్రష్ట మూడు ఒకటేననియు, మనసు, యోచన, యోచించేవారు, ఒకటేనని తెలుసుకోవడమే నిజమైన ఆధ్యాత్మికము.)
8. ఏకత్వమే దివ్యత్వమనే భావన కలిగియుండడమే నిజమైన ఆధ్యాత్మికము. ఏకత్వములో అనేకత్వాన్ని అనేకత్వములో ఏకత్వాన్ని గుర్తించుటే ఆధ్యాత్మికము.
మీరు జన్మించినది మరల మరల జన్మించడానికి కాదు. జన్మించిన తరువాత ఆధ్యాత్మిక మార్గములో గడిపినట్లయితే మీకు తిరిగి జన్మించే అవకాశము కలుగదు. పుట్టుక పుట్టుకను కలుగచేయకూడదు. మృత్యువు తిరిగి మృత్యువును కలిగించకూడదు. (ప్ర. సా.పు.132/133)
భగవంతుని లో జీవించడమే ఆధ్యాత్మికము. భగవంతుని కొరకు జీవించడమే సేవ. భగవంతుని లో జీవించడమే విద్య. (స. సా. జ 2013 పు 3)