"సతతం యోగినం" సర్వమూదైవమే నని, సర్వత్ర దైవము నిండివున్నాడని భావించేది దైవ మానవత్వము. అయితే దీనియందు ఒక్కొక్కదానికి ఒక్కొక్క అవాంతరం పట్టి పీడిస్తున్నది. దీనినే ఆధిదైవికము, ఆధిభౌతికము, ఆధ్యాత్మికము అని మూడు తెఱగులుగా విభజించారు.
1. ఆధిభౌతికము: పంచభూతములతో కూడిన మానవత్వము వల్ల అతనికి బాధలు కలుగవచ్చు. మృగములవల్ల. క్రిమి కీటకాదుల వల్ల బాధలు సంభవించవచ్చును.
2. ఆధ్యాత్మికము:వాతపిత్తశ్లేష్మాదులచే, రోగములచే, దుర్గుణములచే, దురాలోచనలచే కలుగుబాధలకు ఆధ్యాత్మికము అని పేరు.
3. ఆధిదైవికము: ఇది కేవలం దైవికంగా సంభవించేది. అనగా అతివృష్టి, అనావృష్టి, పిడుగు ఇత్యాదులచే మానవునికి కలుగు కష్టములు దైవికములు.
ఇట్టి మూడు బాధలనుండి విముక్తి పొంది ఆనందం అనుభవించటానికి ప్రేమ అవసరము. మానవునియందున్న ప్రేమను దివ్య ప్రేమగా మార్చటానికి కొన్ని సాధనములు సలపాలి. వ్యక్తి అనే స్థానమునుండి సమిష్టికి చేసే ప్రయాణము మానవత్వము. "స్వం" స్థానమునుండి "సోహం" స్థానమునకు చేసే ప్రయాణమే మానవత్వము. కనుక మన స్వార్థమును పదార్ధముగా మార్చుటయే త్యాగము అని పిలిచింది వేదాంతము. ప్రతి కర్మ పదార్థభావంచేత ఆనుభవించిననే ప్రేమ తత్త్వము అభివృద్ధి అవుతుంది. అట్టిదే ప్రేమ. ఇచ్చేదే ప్రేమ. కాని తిరిగి యివ్వమని కోరేది ప్రేమకాదు. మనము యిచ్చినప్పుడే ప్రేమను అందుకుంటాము. తైలము జ్యోతిని వెలిగిస్తుంది. ప్రేమ జీవితాన్నే వెలిగిస్తుంది.
ప్రేమ ఆల్ జిబ్రా లెక్కలవంటిది. ఎన్ని వరుసలు వేసినా అటుఇటు రెండు ఒక్కటిగా ఉంటుంది. ప్రేమ మహా శక్తివంతము. ప్రేమ త్యాగాన్ని కోరితో, Self ప్రేమను కోరుతుంది. కనుక నిజముగా స్వార్థరహితమైనది ప్రేమయే. అనగా మొదట నే నేవరు? అని గుర్తించిన ఆత్మతత్త్వము అర్థమవుతుంది. సంస్కృత అక్షరములన్ని తెలుస్తాయి. అట్లే "అహం "స్వరూపాన్ని తెలుసుకున్నపుడు చిత్త శుద్ధి కలుగుతుంది. "నేను" అనగా ఎవరు? అది గుర్తించిన అహంకార నిర్మూలన, ఆత్మశాంతి కలుగుతుంది. ఈ రెండు ప్రేమవల్లనే సాధ్యము.
.( సా.సా.పు.26/27)