కోటీశ్వరునికైనా కూడుగుడ్డయెగాని - బంగారమును
తిని బ్రతుకలేడు
కాలమే గాకున్న కట్టయే పామగు - కలసి వచ్చిన మట్టి కనకమగును
పండితు డొకచోట పశువుగా మారును - మూర్ఖుండొకతరిని మునిగ మారు
ధనవంతు నొకపరి దారిద్ర్య దేవత - వరియించి వానిలో వరుసలాడు
ప్రాకులాడుటయేగాని ప్రాప్తి లేకున్న
దమ్మిడయిన నీకు దరికి రాదు
వద్దురా బాబు నీఆశ హద్దు మీరి
బుద్ధి కలిగి జీవించుమో పెద్దమనిషి
(స.సా.ఏ.99పు, 102)
ప్రేమస్వరూపులారా! మీకు తినడానికి ఇంత తిండి కావాలి: ధరించడానికి వస్త్రం కావాలి: ఉండటానికి కొంప కావాలి: రోగం వస్తే మందు త్రాగడానికి అంతో ఇంతో డబ్బు కావాలి. ఇంతేగాని, మితిమీరిన ఆశకు లోనుకావద్దు. అందుచేతనే "వద్దురా వరుడ ఏ ఆశ హద్దు మీరి, బుద్ధి కలిగి జీవించుమో పెద్ద మనిషి" అన్నాను. ఎంత అవసరమో అంతటితో తృప్తి పడాలి. తృప్తియే సుఖము. కనుక, కోరికలను తగ్గించుకుంటూ రావాలి. దీనినే వైరాగ్య మన్నారు. వైరాగ్యమునకు నిన్న మార్గం చూపించాను. ఈ భౌతిక జగత్తంతా జడమని భావించండి, అతి సూక్ష్మమైన జగత్తంతా ప్రతిబింబమని భావించండి. అప్పుడు మీకింక కోరికలే ఉండవు. లౌకికమైన ఆశలు తగ్గే కొద్దీ దైవాశ పెరుగుతూ పోతుంది. కామము, క్రోధము ఇత్యాది దుర్గుణాలను త్యజించినప్పుడే మీకు అమృతత్వం ప్రాప్తిస్తుంది. అది చేయకుండా అమృతత్వం కావాలంటే ఎట్లా చిక్కుతుంది? "
ఏమీ లేని బుఱ్ఱలోన ఏమైనా నింపవచ్చు
ఏమేమో నిండియున్న తలబుఱ్ఱ ఖాళీ అగునా?
తలబుఱ్ఱ ఖాళీ కాక ఇల సుకృతము నింపనగునా?"
ఈ నాటి మానవుడు తన హృదయాన్ని అనేక చింతలలో నింపుకున్నాడు.
"పుట్టుట ఒక చింత, భూమి నుండుట చింత,
బాల్యమంతయు చింత, వార్థక్య మొక చింత
జీవించు టొక చింత, చెడుపు చింత,
కర్మలన్నియు చింత, కష్టములొక చింత,
మానవుడు ప్రతి చిన్న విషయానికి చింత పడుతున్నాడు.
పెండ్లి చేయాలంటేచింత, ఆదాయం రావాలంటే చింత.
జీవితమంతా ఇన్ని చింతలతో నిండినప్పుడు ఇంక సంతోషం ఎలా చిక్కుతుంది?
(స.సా.ఏ.99పు.105)