గద్ద తన్నుకొని పోయిన సుమిత్ర యొక్క పాయసపు కప్పు ఎక్కడికి పోయింది? గద్ద ఆ కప్పును ఒక పర్వతంపై వదలి పెట్టింది. ఆది ఆంజని దేవికి చిక్కగా ఆమె ఆ పాయసాన్ని త్రాగింది. తత్ఫలితంగా ఆమె గర్భంలో హమమంతుడు జన్మించాడు. హమమంతునికి, రామలలక్ష్మణభరత శతృఘ్నులకు గల ఇట్టి సన్నిహిత సంబంధం ఎవ్వరికీ తెలియదు. హమమంతుడు కూడా దశరథునికి యజ్ఞము నుండి లభించిన పాయసముయొక్క భాగమే.
పట్టాభిషేక సమయంలో రాముడు విభీషనునికి, సుగ్రీవునికి, ఇంకా అనేకమంది వానర వీరులకు బహుమతుల సందజేశాడు. కాని, హనుమంతునికి మాత్రం ఏమీ ఇవ్వలేదు. సీత ఈ విషయాన్ని గమనించి "స్వామీ! హనుమంతునికి కూడా ఏదైనా బహుమతి ఇస్తే బాగుంటుంది కదా!" అన్నది. అప్పుడు రాముడు "సీతా! హనుమంతుడు బహుమతులను ఆశించడు. అవి అతనికి అక్కర్లేదు. అలాంటి గొప్ప భక్తునకు ఇవ్వదగిన బహుమతి నావద్ద ఏమీ లేదు" అన్నాడు. అప్పుడు సీత తన మెడలోని ముత్యాల హారాన్ని తీసి హనుమంతునికి అందించింది. హనుమంతుడు దానిని అందుకొని ఒక్కొక్క ముత్యమును కొరికి, చెవి దగ్గర పెట్టుకొని నిరుత్సాహంతో పారవేయసాగాడు. ఈ దృశ్యాన్ని చూసి సీత “హనుమంతా! ఇంకా నీ కోతి బుద్ధిని పోనిచ్చుకున్నావు కాదు. అది నా తండ్రి నాకిచ్చన విలువైన ముత్యాల హారము. కాని, నీవు దాని విలువ తెలుసుకోకుండా కొరికి పారవేస్తున్నావు" అన్నది. హనుమంతుడు "తల్లీ! క్షమించు. రామ నామం లేనిది రత్నమైనా, ముత్యమైనా నాకు రాయితో సమానం.నా రోమరోమమూ రామనామంతో నిండియున్నది. కావాలంటే చూడు" అని పలుకుతూ తన చేతి నుండి ఒక రోమమును తీసి సీత చెవి దగ్గర పెట్టాడు. ఆ రోమము నుండి కూడా రామనామం వినబడుతూ ఉండినది!
రామాయణం జరగడానవకి మూలకారణం హనుమంతుడే. హనుమంతుడే లేకపోతే రామాయణమే లేదు. అతడు పరమ పవిత్రమైన భక్తిస్వరూపుడు. ఎక్కడ రామనామం ఉంటుందో అక్కడ హనుమంతుడుంటాడు. - నామరూపముల ఏకత్వాన్ని దర్శించాడు హనుమంతుడు. ఇదే నిజమైన అద్వైతము. ఇట్టి పవిత్రమైన హనుమంతుని ఆదర్శాన్ని భక్తులెవరైనా అనుసరిస్తున్నారా? ఎన్ని -పర్యాయములు రామాయణాన్ని పారాయణం చేసినాబుద్ధులు మారకపోతే ప్రయోజన మేమిటి? ఈనాడు అనేకమంది రామభక్తులమని చెప్పుకొంటున్నారుగాని, నిజమైనరామభక్తులు ఎక్కడా కనిపించడం లేదు. ఈ నాటి భక్తులలో ఆడంబరం పెరిగిపోయింది. ఆచరణ శూన్యమైపోయింది. ఆడంబరం భక్తికి విరుద్ధమైనది. రాముడు అహంకారమును, ఆడంబరమును ఏనాడూ అంగీకరించడు; ఆచరణకే ప్రాధాన్యత నిస్తాడు. రాముని జన్మదినమును పండుగగా జరుపుకున్నంత మాత్రాన చాలదు, రామచరిత్ర హృదయంలో చిత్రించుకోవాలి. రాముని ఆదర్శాలను ఆచరణలో నింపుకోవాలి.రాముడు సత్యవాక్పరపాలకుడు, ధర్మపరాయణుడు.
(స.పా.మే2000పు 147/148)
హనుమంతుడు తన జీవితపర్యంతము దాసో..హం కోసలేంద్రస్య .నేను యెప్పుడు రాముని యొక్క దాసుడనే అని భావిస్తూ ఆచరిస్తూ ఆనందాన్ని అనుభవిస్తూ వచ్చాడు. ఆయితే యిది యెంత వరకు? ప్రభువు యొక్క దాసుడుగా వుండినంతవరకు దాసోహం అన్నాడు. కొంతకాలమునకు ప్రభువు యొక్క వియోగం ప్రాప్తించింది. ప్రభువు వియోగము లోపల తామ బాధలకు గురి కావలసి వస్తుంది. సోహంలో అట్టిది లేదు. దైవముతోనే యేకము కావటంవల్ల దైవము యొక్క యెడబాటు అనేబాధ అతనికి తెలియదు.దాసోహంలో ప్రభువుకును, భక్తునకును యెడబాటు వుంటుండాది. సోహంలో ప్రభువుకు దాసునకు యెట్టియెడబాటు వుండదు. ఎడబాటు లేని స్థితిలో ఆనందమునకు కూడను యే విధమైన అభ్యంతరముండదు. ముఖ్యముగా దివ్యత్వాన్ని పొందగోరే సాధకుడు వాంఛలను క్రోధమును మొట్టమొదట అరికట్టుకోవాలి.
(శ్రీ.. గీ. పు. 70)
హనుమంతునిలో కామము అనేది లేదు. కామమునకు గురికాక, శ్రీరాముని అనుగ్రహమును సంపాదించినాడు. హృదయమును చల్లార్చుటకు ఆయనకు రామచింతన జాలును. సీతాన్వేషణ సందర్భమున, స్త్రీల విహార స్థానమైన రావణుని అంతఃపురమును ప్రవేశింపవలసి వచ్చినది.
సీతను వెతకాలి అంటే, స్త్రీల మధ్య కదా వెతుకుట? హనుమంతుడు ఒక్కొక్క స్త్రీనూ చూచుచూ ముందుసాగినాడు. రాముడు చెప్పిన లక్షణములుగల ముక్కు చెవులు అందచందాలున్నవా అని ప్రతి స్త్రీనూ గమనిస్తూ వచ్చాడు. తరువాత నిరాశుడై సముద్రపు ఒడ్డున కూర్చున్నాడు. "ఛ, ఛ, ఎంత పాపిని నేను! ఇన్నిస్త్రీలను చూచినాను గదా? ఇంకా నేనెట్లు రామచంద్రుని దర్శించేది. ఆత్మహత్యయే నాకు కఠినశిక్ష" అని దుఃఖించాడు. అయితే, రామ నామ సంకీర్తనము వలన మనసుకు కొంత ఉప శాంతి లభించినది. ఆత్మహత్య, ఆత్మస్వరూపుడైన రామునికి అపచారమే అని తలంచి, రామాజ్ఞ కదా. అని సమాధానము తెచ్చికొని, తన అన్వేషణలో స్త్రీలను చూడటము వలన ఎట్టి దోషము తన కంటదని ధైర్యము తెచ్చుకొని, తదుపరి వెతుకుటకు ప్రారంభించినాడు.
ఈ విషయమును ఈనాటి యువకులు బాగా గుర్తించాలి. ప్రతి స్త్రీని మాతృ భావముతోనే చూడవలెను. హనుమంతుడు కూడ తల్లినే వెతకినాడు. కేవలము ఒక స్త్రీనికాదు.
(స.సా,.ఆ.77పు.134/135)
శాంతుడు గుణవుంతుడు, బలవంతుడు హనుమంతుడు. అతడు నవ వ్యాకరణ వేత్తయైనప్పటికీ, మహాభక్తుడైనప్పటికీ రావణుని దర్బారులో నీవెవరవే ప్రశ్నకు సమాధానంగా "దాసోహం కోసలేంద్రస్య" అన్నాడు. అనగా "నేను శ్రీరామదాసుడను" అని సగర్వంగా చెప్పుకున్న వినయ సంపన్నుడు. సీతాన్వేషణకు పూర్వం సముద్ర తీరమున రాముడు వానర వీరులను వరుసగా, "సాగరోల్లంఘన ఎవరు చేయగలరు?" అని ప్రశ్నించాడు. కొందరు 10 యోజనములు దాటగలవమనీ, కొందరు 30 యోజనములు దాటగలమని తలొక రీతిగా సమాధానాలు చెప్పారు.కానీ హనుమంతుడు మాత్రం, "స్వామీ! శతయోజన విస్తీర్ణ సముద్రమును అవలీలగ దాటి, లంకకు చేరి, సీతా మహాసాధ్వి అన్వేషణలో తప్పక కృతకృత్యుడనై తిరిగి రాగలను" అన్నాడు. "నాయనా! అంత దూరం ఎలా ప్రయాణించగలవు? మున్నెన్నడూ చూడని సీతామాతను ఎట్లా గుర్తించగలవు?" అని రాముడు అడిగినప్పుడు హనుమంతుడు "స్వామీ! ఈ మహత్కార్యాన్ని నెరవేర్చమని మీరు నన్ను ఆజ్ఞాపించినప్పుడు దీనికి కావలసిన ధైర్యాన్ని బలాన్ని, శక్తిని, యుక్తిని కూడా మీరే ప్రసాదిస్తారు కదా! వాటితో నేను విజయాన్ని సాధించగలను" అన్నాడు. ఇది అతడి భక్తి, యువకులు గ్రహించవలసింది. ఇదే! భగవదాజ్ఞను తు.చ తప్పక ఆచరించాలి. ఏ సందర్భంలోను సందేహించకూడదు, విమర్శించడదు. దీనినే శరణాగతి అని కూడా చెప్పవచ్చును. దీనివల్ల తప్పక విజయాన్ని అందుకోగలరు. హనుమంతుడు సముద్రాన్ని దాటే సమయంలో ఎంతో ధైర్యసాహసాలను, కార్యదీక్షను కనబర్చాడు. కొద్దిసేపు తనపై వ్రాలి విశ్రాంతి తీసుకోవలసినదిగా మైనాకుడు కోరగా రామకార్యం పూర్తయ్యేవరకు తాను విశ్రాంతి తీసుకోనని అతని ఆహ్వానాన్ని తిరస్కరించాడు.
రామ కార్యమే ప్రధానమని భావించాడు. భక్తి భావంచేత ఉదయించిన ఆత్మవిశ్వాసంతో రావణునికి బుద్ధి చెప్పాడు. రామాజ్ఞను నిర్వర్తించి రామానుగ్రహానికి పాత్రుడైనాడు.చంచలత్వానికి పుట్టినిల్లు, పెట్టింది పేరు అయిన కోతి రామాజ్ఞను పాటించుటచేత ఆంజనేయస్వామిగా ఆరాధింపబడుతున్నాడు.
పట్టాభిషేక సమయంలో సీత హనుమంతునికి ముత్యాలహారం బహూకరించింది. అతడు ఆ హారాన్ని త్రుంచి, ముత్యాలను కొరికి నేలపై కొట్టి చిన్నాభిన్నం చేయడం గమనించిన సీత "ఆంజనేయా! నీ పూర్వబుద్ధులను ఇంకా పొగొట్టుకున్నట్లు లేదే!" అన్నది. అది విని ఆంజనేయుడు "అమ్మా! ఏ ముత్యంలోనుండైనా రామనామం వినబడుతోందా అని పరీక్షిస్తున్నాను. రామనామం వినిపించని ముత్యాలు నాకెందుకు తల్లీ!" అన్నాడు. అనగా భగవన్నామమే అన్నింటికంటే విలువైనదని చాటినాడు. ఆనాడు సభ పూర్తయింది. సీతారాములు శయనా గారమునకు వెళుతున్నారు. ముందుగా రాముడు, వెనుక సీత సాగిపోతున్నారు. సీత బంగారు పాత్రలో పాలను తీసుకు వెళుతున్నది. ఆంజనేయుడు కూడా వారివెంట వెళ్లడానికి సిద్ధపడ్డాడు. ఇది రాముడు గమనించి "ఆంజనేయా! నేటి కార్యకలాపములు సమాప్తమైనవి. నిద్రించే సమయ మాసన్నమైనది. ఇక నీవు వెళ్ళి రావచ్చును" అన్నాడు. అప్పుడు హనుమంతుడు "స్వామీ!మీ వెంట సీతమ్మవారు వస్తున్నారు కదా! నేను కూడా వస్తాను" అన్నాడు. దానికి సమాధానంగా, సూచన ప్రాయంగా, అర్థం తెలిసేటట్లుగా రాముడు చెప్పాడు: " స్త్రీ లకు నొసట తిలకమున్నది కదా! అందువల్ల ఆమె రావచ్చును" ఇది విన్న హనుమంతుడు వెంటనే అయోధ్యలో ఉన్న అంగళ్ళలో దూరి తిలకాన్ని ప్రోగుచేసుకున్నాడు. శరీరమంతా పూసుకున్నాడు. తిరిగి అంతఃపురం చేరి రామునితో "రామా! కేవలం నొసట తిలకమును ధరించినంత మాత్రమున సీతమ్మవారు నీవెంట వచ్చుటకు హక్కు కలిగియున్నప్పుడు శరీరమంతా తిలకం పూసుకున్న నేను మాత్రం నీ వెంట ఎందుకు రాకూడదు!" అని ప్రశ్నించాడు.
పట్టాభిషేకానంతరం రాముని సోదరులు చేరి రామసేవను తామే పూర్తిగా చేయాలని సంకల్పించుకున్నారు.సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు రామునికి చేయవలసిన సేవలన్నింటిని తమలో తాము చక్కగా పంచుకున్నారు. అక్కడే ఉన్న ఆంజనేయునితో నీవు రామకార్యమును నెరవేర్చిన భాగ్యశాలివి. రామసేవను పూర్తిగా చేసుకున్నవాడవు. ఇక నీవు విశ్రాంతి తీసుకొని మాకీ అవకాశాన్ని అందించు" అన్నారు ఆంజనేయుడు వినమ్రతతో వారివద్ద ఉన్న లిస్ట్ చూశాడు. "అయ్యా! అన్నీ వ్రాసుకున్నారు. మీ ప్రకారమే కానీయండి. కానీ ఒకటి మీరు మరిచారు.రాముడు మహారాజు ఆయన ఆవలించినప్పుడు చేతి వేళ్ళతో చిటికె వేయాలి కదా! ఆసేవ నాకివ్వండి చాలు" అన్నారు. దానికి వీరు అంగీకరించారు. వెంటనే హమమంతుడు రాముని వెంట బయలుదేరివాడు వాళ్ళు ఆశ్యర్యపడి కారణమడుగగా *రామచంద్రుడు ఎప్పుడు ఆవలిస్తాడో ఏమో ఎవరు చెప్పగలరు? చిటికె వేయడానికి నేనెప్పుడూ రాముని వెంట సిద్ధంగా ఉండాలి కదా!" అన్నాడు. ఇట్టి అసమానమైన భక్తి హనుమంతునిది. పట్టుదలకు, దీక్షకు, భక్తికి, వినయమునకు ఆంజనేయుడు పెట్టింది పేరు. మాట, సంకల్పం, క్రీయ ఈ మూడింటి ఏకత్వం అతనిలో కనిపిస్తుంది. తలచింది చెప్పాడు. చెప్పింది చేశాడు. "మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం మహాత్మనాం: మన స్సన్య త్ వచ స్సన్య త్ కర్మణ్యవ్యత్ దురాత్మనాం " అన్నారు. కనుక మనస్సు, మాట క్రియ ఒక్కటిగా ఉండాలి. ఈ మూడింటి ఏకత్వమే శీలము (character).
ఒకానొక సమయంలో హమమంతుడు రాముని తో అన్నాడు: "స్వామీ! దేహభావంలో నీవు ప్రభువు. నేను దాసుడను. జీవభావంలో నీవు దేవుడవు. నేను నీ అంశమును. ఇంక ఆత్మభావంలో నీవు నేను ఒక్కటే" అన్నాడు. ఈ ప్రకారం ప్రభువు - సేవకుడు అన్న
భావనలో ద్వైతమును, జీవుడు - దేవుడు అన్న భావనలో విశిష్టాద్వైతమును, నీవు నేను ఒక్కటే అన్న ప్రకటనలో అద్వైతమును అనుభవ జ్ఞానంతో ప్రపంచానికి చాటినాడు. సీతాన్వేషణ సమయంలో హమమంతుడు రావణునిఅంతఃపురంలో ప్రవేశించినప్పుడు అనేకమంది స్త్రీలను పరిశీలించి చూడవలసి వచ్చింది. తాను బ్రహ్మచారి. కానీ తల్లిని గుర్తించడానికి చూశాడు. అనగా మాతృ భావంతో వర్తించిన జితేంద్రియుడు హనుమంతుడు. రామాజ్ఞ పాలనలో పట్టుదలలో, జ్ఞానంలో, ధైర్యంలో, ఇంద్రియ నిగ్రహంలో, వినయ విధేయతలతో, భక్తి ప్రపత్తులతో అగ్రగణ్యుడైన హమమంతుడు యువతకు ఆదర్శప్రాయుడు.
(స.సా,.జులై98పు.194/196)
దృష్టి ప్రభావము
మతిని గెలిచిన శాంతికి మార్గమరయు
శాంతి కలిగిన అన్నిట సమత తోచు
మంచి చెడ్డలు మానాభిమానములును
అహిత హితులును ఒక్క బ్రహ్మంబు కాదె!
తులసీదాసు మహాకవి హిందీలో “రామచరితమానస్” అనే మహాకావ్యాన్ని రాశాడు. అతడు గొప్ప రామభక్తుడు. అతని కావ్యంలో లంకా పట్టణ శోభ వర్ణిస్తూ అక్కడ ఉద్యానవనంలో పుష్పాలన్నీ తెల్లగా వున్నాయని రాశాడు. తులసీదాసు తన కావ్యాన్ని నిత్యం పారాయణ చేసేవాడు. రామనామం ఎక్కడ వినబడుతుందో అక్కడ ప్రత్యక్షంగా కాని అదృశ్యంగా కాని హనుమంతుడు వుండి వింటూనే వుంటాడు.
ఒకనాడు తులసీదాసు వచ్చే సమయానికి హనుమంతుడక్కడ కూర్చుని వుండి “తులసీదాసూ! నువ్వు రాసిన కావ్యంలో లంకలో పుష్పాలు తెల్లగా వున్నాయని వర్ణించేవు. అది తప్పు. నేను ప్రత్యక్షంగా చూసినవాణ్ణి, అవి ఎర్రగా వున్నాయి, అందుచేత తెల్లగా అనే పదం కొట్టేసి ఎర్రగా అనే పదం రాసి వినిపించు” అని పట్టు పట్టాడు. తులసీదాసు శాంతమూర్తి "హనుమంతా! శ్రీరాముని యడల వుండే భక్తి పారవశ్యంతో రాసి పారాయణ చేస్తున్నాను. ఈ కావ్య రచనకు శ్రీరాముడే స్ఫూర్తిదాయకుడు, కర్త భర్త” అన్నాడు.
హనుమంతుడు, “నేను చూసి వచ్చినవాడిని, నువ్వు ఊహించి రాసిన వాడివి. రామ కథలో అసత్యం వుండటానికి వీల్లేదు” అని వాదించేడు. తులసీదాసు తొణకక బెణకక శ్రీరామునిపై భారం వేసి మిన్నకున్నాడు. హనుమంతుడు అశాంతితో రెచ్చిపోతున్నాడు. అప్పుడు శ్రీరామచంద్రుడే ప్రత్యక్షమై "హనుమంతా! తులసీదాసు వర్ణన సత్యం. నీకు రావణునిపై కోపం వలన నీ కన్నులు రక్త వర్ణమై నీకు లంకలో తెల్లని పుష్పములు సహితం ఎర్రగా కనబడ్డాయి. ఇది నీ దృష్టి ప్రభావమే కాని వస్తు స్వభావం కాదు” అని యిద్దరినీ సమాధాన పరిచి ఆశీర్వదించేడు.
దృష్టి ఎట్టిదో సృష్టి అట్టిదిగా కనబడుతుంది. సర్వం మనోభావాల మీద ఆధారపడి వుంటుంది. (భగవాన్ శ్రీ సత్యసాయివాణి ద్వితీయ భాగం పు 56/57)
హనుమంతునికి వివాహమైంది. సువర్చల ఆయన భార్య. అయినా ఆయన శుద్ధ బ్రహ్మచారియే. అనగా, నిరంతరమూ రామచింతనయందే ఉండేవాడు. ఎప్పుడూ భగవంతుని గురించే ఆలోచన. అంటే నిరంతరమూ బ్రహ్మచర్యమే చేస్తూ ఉండేవాడు. రామపట్టాభిషేక సమయంలో రాముడు అందరికి రకరకములైన బహుమతులు యిచ్చాడు. అప్పుడు సర్వకాలసర్వావస్థలలోనూ తమకు సేవ చేసే హనుమంతునికి ఒక్క బహుమతి కూడా యీయలేదే అని సీత బాధపడింది. అతనికి యివ్వదగ్గ బహుమానం నా దగ్గర ఒక్కటి కూడా లేదు. నన్ను నేనే యిచ్చుకుంటాను అన్నాడు రాముడు. వెళ్ళి హనుమంతుని గాఢముగా కౌగలించుకున్నాడు. అప్పుడు సీత, కేవలం భౌతికంగా స్పర్శ అందిస్తే అది బహుమానం ఎలా అవుతుంది?” అని తన తండ్రి జనకమహారాజు తనకిచ్చిన ముత్యాల హారము తీసి హనుమంతు నికి యిచ్చింది.
రఘుపతి కార్యము యీడేర్చిన కపిరాజశిఖామణి నీవయ్యా
అదనున పురిగొని జగముల వెలసిన హనుమద్గురుడవు నీవయ్యా
పరిపరి లంకాపురమును జొచ్చిన పురహర శౌర్యము నీదయ్యా
పరిపరి విధముల జానకి వెదకిన అమిత పరాక్రముడవీవయ్యా!
రామ కార్యమును నెరవేర్చిన కపిరాజశిఖామణి నీవు. నీవే లేకపోతే రామకార్యము నెరవేర్చేవారెవరు?” అని ఆమె ఆ మాల అందించింది. అందరూ చూస్తున్నారు. ఆ ముత్యాల హారాన్ని తుంచేస్తున్నాడు హనుమంతుడు. ఒక్కొక్క ముత్యాన్ని కొరికి పారవేస్తున్నాడు. సీతకు అంతరార్థము తెలుసు. కానీ, మిగిలిన వారిది బాహ్యమైన క్రియయే కనిపిస్తున్నాది. కోతిజాతి బుద్ధులు పోతాయా? విలువైన ముత్యాలను కొరికి పారవేస్తున్నాడే అనుకున్నారు. వీరందరికి సరైన పాఠము నేర్పాలని సీత హనుమంతుని అడిగింది, హనుమంతా! విలువైన ముత్యాలను ఎందుకు కొరుకుతున్నావు? కొరకటం చెవిదగ్గర పెట్టుకోటం, పారవేయటం, ఏమిటిది? అమ్మా! ఏ ముత్యములోనైనా రామనామము ఉన్నదేమోనని చూస్తున్నాను అన్నాడు. పిచ్చివాడా! ముత్యములో రామనామము ఉంటుందా?” అన్నది సీత. రామనామము లేని ముత్యములు నాకు రాళ్లతో సమానము. వజ్రములైనా, మణులైనా, మాణిక్యములైనా, మరకతములైనా సరే - రామనామము లేకపోతే నాకు మట్టితో సమానమే. సర్వత్రా రామనామమే కావాలి. రామనామము లేనిది నా దేహములో అణుమాత్రము లేదు అని తన చేతి పైనగల ఒక వెంట్రుకను తీసి రాముని చెవి దగ్గర పెట్టాడు. ఆ వెంట్రుక కూడా రామ్ రామ్ రామ్ అని శబ్దము చేయసాగింది. అతని దేహమంతా రామనామముతో నిండిపోయింది. సర్వకాలములందు రామచింతన చేయటం వలన హనుమంతుని బ్రహ్మచారి అన్నారు. రామా! దేహభావంతో నీవు ప్రభువు, నేను సేవకుడను. మనోభావముతో నీవు బింబము, నేను ప్రతిబింబమును. ఆత్మభావంతో నీవే నేను, నేనే నీవు అన్నాడు. (దివ్యఙ్ఞాన దీపికలు ప్రథమ భాగము పు 69-70)