బ్రహ్మనిష్ఠగలవాడే బ్రాహ్మణుడు. అసత్య పక్షమును ధిక్కరించువాడే క్షత్రియుడు: సదా సద్విచారము చేయజాలెడి వ్యవసాయాత్మిక బుద్ధిగలవాడే వైశ్యుడు: కర్మనిష్ణా త్యాచరణను సల్పువాడే శూద్రుడు; మానవత్వము పొందుటకు ఈ నాలుగు వృత్తులు ఆత్యావశ్యకము.
(గీ. వా.79)
బ్రాహ్మణులు ద్వేష బుద్ధితో మిగిలిన కులములవారిని వేదములు చదవనీయకుండా చేశారని కొందరు భావిస్తున్నారు. అది సరికాదు. మీరు ఒక చేపను పట్టుకొనటానికి వెళ్ళేటప్పుడు ఒక పొడుగాటి ఇనుపచువ్వ, దానికొక కొక్కెము. ఆ చేపను ఆకర్షించే ఆహారముఇవన్నీ కూడా తీసికొని వెళ్ళాలి. మీరు వేదములను వశం చేసుకోవాలంటే మీకు ధార్మిక జీవనం అనే ఇనుపచువ్వ ఉండాలి, వైదిక సంస్కృతం అనే కొక్కొము ఉంచాలి. వేదములచేత గౌరవింపబడే బ్రాహ్మణుడు తిరిగి ఆ వేదములను గౌరవిస్తాడు. అటువంటి ఆకర్షణీయమైన ఆహారం కూడా ఉండాలి. బ్రాహ్మణుడు తనను తాను పరిశుద్ధమొనర్చుకొనే అనేక ఆచారాలు, సంస్కారాలు పాటించటానికి సిద్ధంగా ఉంటాడు. ఇది అతడు మంత్రాలను ఉచ్చరించటానికి, ఎదుటివారికి చెప్పటానికి అర్హత కలిగిస్తుంది.
ప్రతివారికి ఉదాత్తమైన భావాలు ఉండవు. మీరందరూ నామాటలు వింటున్నారు కదా! మీకందరికి నేను చెప్పినవి చెప్పినట్లు అర్థమవుతున్నాయా? లేక నేను చెప్పినవి చెప్పినట్లు మీరేమైనా ఆచరిస్తున్నారా? లేదు.
ప్రతివారు వారి వారి స్వభావములను బట్టి, వారి మానసిక ప్రవృత్తిని బట్టి అర్థం చేసికొనటం కాని, ఆచరించటం కాని ఉంటుంది. మానవులందరూ ఒకే విధంగా ఉండరు. ఒక వ్యక్తి మరొక వ్యక్తి వలె ఉండడు. మానవులంతా యాత్రికుల బృందమే.
బ్రాహ్మణుడు పుట్టుకతో శూద్రుడే. బ్రాహ్మణ కులములో పుట్టినంత మాత్రముచేత అతడు వేదపండితుని కుమారుడైనప్పటికీ వేదపఠనకు అర్హుడు కాడు. అతనికి సంప్రదాయానుసారంగా శాస్త్రోక్తంగా ఉపనయనం జరిగిన తరువాతనే అతడు బ్రాహ్మణుడు అవుతాడు. అతడు అప్పుడు అధ్యయన ప్రపంచంలో తిరిగి జన్మించినట్లు. చాలా మంది బ్రాహ్మణులు ఆస్తికతతో కూడిన నిరాడంబరత్వాన్ని, పాండిత్యస్థాయిని కోల్పోతున్నారు. స్వచ్ఛమైన లోహము కలుషితమైనప్పుడు దానిని మరల మూసలో పోయాలి. ఇటువంటి స్వచ్ఛమైన పాత్రల వంటి వేదపండితులు కనిపించినప్పుడు మనం వారిని రక్షించాలి. కొందరు ద్వేషపూరితమైన తెలివిమాలినవారు రాళ్ళు విసిరితే ఈ పాత్రలు పగిలిపోతాయి. వేదములు కూడా దూరమైపోతాయి.
బ్రాహ్మణులు వేద సంరక్షకులు కాబట్టి బ్రాహ్మణుల్ని అడవిలోకి తరిమివేస్తే, వేదాలు కూడా అడవిలోకి వెళ్ళి పోతాయి. వేదములను స్పష్టంగా ఉచ్చరిస్తూ, అద్భుతమైన జ్ఞాపకశక్తితో వాటిని ఎన్నో యుగాల నుంచి కాపాడుతూ, భారతదేశం ఎన్ని ఉత్పాతాలు ఎదుర్కొన్నప్పటికి వాటిని నిలిపి ఉంచినవారు బ్రాహ్మణులు. ఒక బాలుడు ఇంటి దగ్గర ఇంగ్లీషు పాఠం చదువుతున్నాడు. అతడు చదివే విధానం తల్లిదండ్రులకు ఎంతో అందోళను కలిగించింది. "మిల్క్ " అనే పదాన్ని ఎమ్.ఐ.ఎల్.కె మిల్క్: ఎమ్.ఐ.ఎల్.కె మిల్క్ అని వేగంగా చదువసాగాడు. తల్లిదండ్రులు అది విని అమ్మా ఎలుక, అమ్మా ఎలుక అని భయపడిపోతూ పిలుస్తున్నాడని భావించారు. ఉచ్ఛారణ స్పష్టంగా ఉండాలి.
బ్రాహ్మణులు వేదం చక్కగా చదవటానికి వారిని ప్రోత్సహించండి. వారి వేదపఠనం వల్ల మీకు ఇన్ని రోజాలూ ప్రయోజనం కలిగినట్లుగానే ఎంతో ప్రయోజనం కలుగుతుంది.
(వ. 61-62పు.220/221)
బ్రహ్మజ్ఞానంబు నెరుగక బ్రాహ్మణుండ !
సమతభావము లేకున్న సజ్జనుండ?
మంచితనమును లేకున్న మానవుండ?
చెప్పరండయ్య మీరలే ఒప్పుకొందు.. -
(శ్రీసత్యసాయి విద్యార్థి వాహిని పు 141)