Saint కు Scientist కు వ్యత్యాసమేమిటి? Saint మంత్రోపాసకుడు Scientist యంత్రోపాసకుడు. Saint సృష్టికర్తను గురించి విచారణ సలుపుతాడు. Scientist సృష్టిని గురించి విచారణ సలుపుతాడు.
(భ.ప్ర.పు.2)
జీవుడు, దేవుడు రెండూ ఒక్కటే. వడ్లు, బియ్యము రెండూ ఒక్కటే. అయినప్పటికీ వడ్లకు బియ్యమునకు ఉన్న తేడా ఏమిటి? ఈ వడ్లు పొట్టు (హస్క్)చే కప్పబడి ఉంటుంది. ఈ పొట్టు ఉండినంత వరకు అవి వద్దు. ఈ వడ్లుగా ఉండినంతవరకు ఎక్కడైనా భూమిలో పెట్టి నీరు పోయండి - తిరిగి మొక్కలు, తిరిగి వడ్లు - ఈ విధంగా జీవితం గడుస్తుంది. తన పైపొట్టు తీసిన తరువాత బియ్యముగా తయారౌతుంది. ఈ బియ్యమును భూమిలో పెట్టి ఎన్ని విధముల మంచి ఎరువులు వేసి పోషించినప్పటికీ, పునర్జన్మ నవిద్యతే , దీనికి యింక జన్మ ఉండదు, పుట్టుక లేదు. వడ్లకు, బియ్యమునకు ఏవిధమైన వ్యత్యాసమున్నదో, జీవునకు దేవునకు ఇదే వ్యత్యాసము. బంగారులో వెండి, రాగి, ఇత్తడి మొదలైన లోహములు చేరటంచేత అది కేవలం తెల్లబంగారమని చెప్ప బడుతుంది. దీని విలువ కూడా తగ్గుతుంది. అయితే దీనిని ఆగ్నిలో వేసి, పుటము పెట్టి పరిశుద్ధము గావించిన తరువాత దీనిలో చేరిన వెండి, రాగి, ఇత్తడి దూరమై స్వతస్సిద్ధమైన అపరంజిగా తయారై దానికి గొప్ప విలువ వస్తుంది. అదేవిధముగా దివ్యత్వములో సత్త్వ, రజో, తమోగుణములు చేరిపోవటం చేత ఇది జీవుడుగా తయారౌతుంది. ధ్యాన తపస్సులనే సాధనల ద్వారా గుణములు వేరై పోయి శుద్ధ సాత్వికమైన దివ్యత్వము తేలుతుంది.ఏతావాతా ప్రాకృత గుణముల సంపర్కమే జీవుడు, ఈ ప్రాకృతగుణములకు వేరైన వాడే దేవుడని మనకు స్పష్టమవుతూ వచ్చింది. ఇది ఇంకా అర్థము కావాలనుకొంటే
life + Desires = Man
Life - Desires = God
పొట్టుతో కూడినవి వడ్లు. పొట్టులేనివి బియ్యము. అదే విధముగా నిత్యజీవితములో నుండిన దైవత్వమును ప్రతి మానవుడు సంస్కారము చేత సందర్శించటానికి అవకాశము ఉంది. కనుక మానవత్వానికి దివ్యత్వముతో ఒక సంబంధము ఏర్పరచాలి. నిత్యజీవితంలో మనము అనేకం చూస్తుంటాము. తియ్యని మామిడి చెట్టునకు పుల్లని మామిడి కొమ్మను తెచ్చి అంటు కట్టినప్పుడు ఈ పుల్లని మామిడి కొమ్మ తియ్యని మామిడి పండ్లు యిచ్చే స్వభావము కలిగినదిగా రూపొందుతుంది. ప్రాకృత సంబంధ గుణములు గల్గిన మానవత్వాన్ని దివ్యత్వంతో, పవిత్ర దైవస్వభావముతో చేర్చినప్పుడు ఈ మానవత్వము దైవత్వముగా రూపొందుతుంది. దీనినే వేదాంత పరిభాషలో ‘బ్రహ్మత్ బ్రహ్మైవ భవతి అన్నారు.
(షిపు.2/3)