"భగవంతుడే మొదట జడ ప్రపంచమును సృష్టించి తానే జీవరూపమున అందులో ప్రవేశించి జగత్తును చైతన్య వంతముగా చేసెనని వేదముల స్పష్టముగా తెలుపుచునేయున్నవికదా! అపరా ప్రకృతి పరమేశ్వరుని స్వభావమనియు పరా ప్రకృతి పరమేశ్వరుని స్వరూప మనియు ఈ స్వరూప స్వభావములు భిన్నము కాదనియు విశ్వసించవలెను. చైతన్యమునకు జడము స్వాధీనమయి వుండును. చైతన్యము సర్వస్వతంత్రముతో నుండును. జడము ఆట్లుగాక పరతంత్రమై యుండును. జీవుడనగా
ప్రాణధారము చేసేవాడు. జీవుడు తన శక్తి సామర్థ్యములచే ప్రాణాన్ని పట్టి యున్నాడు. జీవుడు అంతర్యామియైఅన్నింటియందు ప్రవేశించియున్నాడు. కనుక పరా ప్రకృతి అనునది కూడనూ పరమాత్ముడే. జడ చైతన్యములతో గోచరించునది, ఒకే వస్తువు అని తెలిసికొనవలెను. సమస్త ప్రపంచమునకూ జగ చైతన్యములే ప్రధానములు. ఆ రెండింటి సమ్మేళన ఈ ప్రకృతి స్వరూపము లోనన్ను చైతన్యశక్తి భోక్తగా స్వకర్మముచే వాటిని ధరించును. జగ ప్రకృతి దేహరూపమును ధరించును. బావా! ఈ రెండూ నా ప్రకృతులే కాన వీటి మూలమున సమస్త జగత్తు యొక్క సృష్టి స్థితి లయమునకు కారణమైన ఈశ్వరుడను నేనేనని తెలుసుకో. నాకంటే ఈ లోకమున వేరు పదార్థముకానీ, పరమార్థముకాని లేనేలేదు.అన్నింటికీ మూలకారణమునేనే .మూలవస్తువునేను."యేకోహం బహూసాం " అన్ని నేనే సృష్టి సంకల్పము చేసితిని. ఆ సంకల్పము ద్వారా మాయశక్తిలో చలనం కలిగింది. అదే మహత్తర్యంగా మారింది. అదే ప్రకృతి మొదటి పరిణామం. ఒకవిత్తనము భూమిలో పాతినా మనుకో, పాతిన తరువాత నీరుపోస్తే, ఒకటి రెండు దినములకు ఆ విత్తనము మెత్తగా నాని ఉబ్బిపోవును. అది విత్తనమునకు మొదటి మార్పు.కానీ మొలకరాదు. అదే మహత్తత్త్యం యొక్క స్వరూపం. ఆ తరువాత భగవంతుని సంకల్పముచే అందులోనుండి ఒక మొలక పైకి కనిపించును. అదే మహదహంకారం. దానినుండి పంచశాఖలు పుట్టును. అవే సూక్ష్మ పంచభూతములు, ప్రకృతిశక్తి ఒకటి మహతత్త్వం ఒకటి, అహంకారమొకటి. ఈ పంచభూతములు అన్నియూ చేరి యెనిమిది. ఈ యెనిమిదింటితోనే జడజగత్తు యేర్పడినది.”
(గీ. పు.100/101)
ప్రతి మానవునియందు పంచభూతములున్నాయి. భగవంతుడు అంతా మంచినే సృష్టించాడు. కాని, మీరే దానిని చెడ్డగా మార్చుకుంటున్నారు. ఒకానొక సమయంలో నారదుడు విష్ణువును దర్శించడానికి వెళ్ళాడు. అప్పుడు విష్ణువు చిరునవ్వుతో "నారదా! ఎక్కడి నుండి వస్తున్నావు ?" అని అడిగాడు. "స్వామీ! నాకేమి? ఇల్లూ వాకిళ్ళా? భార్యాబిడ్డలా? అన్ని చోట్ల తిరుగుతుంటాను. ప్రపంచమంతా సంచరిస్తుంటాను." అన్నాడు నారదుడు. "అయితే, నా సృష్టి రహస్యాన్ని ఏమైనా గుర్తించావా?" అని అడిగాడు విష్ణువు, "నేను గుర్తించలేనా! గుర్తించాను స్వామీ! అన్నాడు. "అన్నీ నేను మంచివే సృష్టిస్తున్నాను. నా సృష్టిలో నీకేదైనా చెడ్డది కనిపించిందా?" అని అడిగాడు. నారదుడు కొద్దిసేపు యోచించి "క్షమించండి స్వామీ! ఒకటి చూశాను." అన్నాడు. "నా సృష్టిలో చెడ్డది ఉండటానికి వీల్లేదు." అన్నాడు విష్ణువు. "ఉంది స్వామీ!" అన్నాడు నారదుడు. ఏమిటది? అని ప్రశ్నించగా మలము " అన్నాడు నారదుడు. "దాని దగ్గరకు కూడా పోవడానికి వీలుకాదు. ఎందుకు మీరింత చెడ్డపదార్ధమును సృష్టించారు?" అని అడిగాడు. విష్ణువు "నారదా! అది చెడ్డది కానే కాదు. కావాలంటే నీవోకతూరి వెళ్ళి దానినే అడుగు." అన్నాడు. నారదుడు "దాని దగ్గరకు కూడా పోలేను స్వామీ!" అన్నాడు. "నా ఆజ్ఞ ప్రకారం నడుచుకో." అన్నాడు విష్ణువు. సరే, నారదుడు వెళ్ళాడు. దగ్గరకు పోతూనే మలము “ఛీ", నారదా! దూరంగా ఉండు." అంది. "అదేమిటి! ఎందుకు నేను నీ దగ్గరకు రాకుడదు?" అని అడిగాడు. “నిన్నటి దినము నేను పవిత్రమైన ఫలముగా ఉన్నాను. భగవంతునికి నైవేద్యం పెట్టిన పదార్థంగా ఉన్నాను. కాని, ఒక్కతూరి మానవునిలో చేరేటప్పటికి నాకీ గతి పట్టింది. రెండవతూరి చేరితే ఇంకేగతి పడుతుందో! కాబట్టి, నాదగ్గరకు రావద్దు." అంది కనుక, లోకంలో చెడ్డది ఏదీ లేదు. అన్ని మంచివే. కాని, సంగదోషంచేత కొన్ని చెడ్డవిగా మారిపోతున్నాయి.
(స.సా.జ..2000 పు.198)
దైవత్వం యొక్క స్వరూపం ఎట్టిది? అది నిర్గుణం, నిరంజనం, సనాతనం. దానికి ఎవ్వరూ పేరు పెట్టలేరు. భగవంతునికి పేరు పెట్టాలంటే భగవంతుని కంటే ముందు ఎవరైనా ఉండి ఉండాలి కదా! కాని, సృష్టియే లేదు. కొన్ని కోట్ల సంవత్సరములు అంతా ఆంధకారంగానే ఉండినది. సూర్య చంద్రాదులు కూడా కనిపించలేదు. జీవరాసులు లేవు. ఏ రూపమూ కనిపించలేదు. తరువాత కొన్నిసంవత్సరములు వర్షములు కురిసి కురిసి సముద్రాలు తయారైనాయి. ఈ తరువాత నదులు తయారైనాయి. అప్పుడే జగత్తు నందు కొంచెం వెలుగు ప్రారంభమైంది. వెలుగు ప్రారంభమైన తరువాత సూర్యచంద్రాదులు కనిపించారు. ఇది జరిగిన అనేక కోట్ల సంవత్సరముల తరువాత మానవత్వం ప్రారంభమైనది. .
(స.సా.జ.99 పు.160)
సృష్టి అనాది కాలమునుండి జరుగుచున్నది. సృష్ట్యాది యందు నారాయణుని నాభినుండి వక కమల ముద్భవించెను. ఆ కమలమందే నారాయణుడు బ్రహ్మరూపమున పుట్టెను బ్రహ్మనలుదిక్కులా వక పరి చూడవలెనని సంకల్పించెను. అంత నలుదిక్కులా నాలుగు ముఖములుగా రూపొందెను. అంతటి తో సంకల్పము ఆగక యెనిమిది దిక్కులా చూడవలెనని సంకల్పించిన చతురాననుడాయెను. దిశలు పది అగుటచే అయిదు ముఖము లుండెను. ఆ అయిదవ ముఖము శివరూపుడై ఉత్తరించెను. తపము లేక యే పనియూ సాగదని పద్మాసనాసీనులై, హృత్పద్మమందు సమస్త సృష్టిని స్మరించి తలంచెను.
(భా.వాపు 184/185)
బ్రహ్మ సృష్టిని గావిస్తాడు. అయితే సృష్టిని గావించే విధానమును ఎవ్వరూ గుర్తించుకోలేరు. ఇది కంటికి కానరాదు; హృదయానికి అర్థం కాదు. ఇలాంటి ఆతీతమైన దివ్యతత్వాన్ని తల్లి భోదిస్తున్నది. ఎందుకనగా తల్లికూడా సృష్టిస్తున్నది. కనుకనే మొట్టమొదట "మాతృదేవో భవ”అన్నారు. తల్లియే బ్రహ్మ స్వరూపము. బ్రహ్మ యొక్క స్థానంలో తల్లిని ఉంచుకోవాలి. తల్లిని గౌరవించాలి: తల్లిని సేవించాలి; తల్లిని విశ్వసించాలి. ఇదియే బ్రహ్మ విశ్వాసమునకు సంకేతము.
ఇంక తల్లి సృష్టించిన బిడ్డను పోషించి ఉన్నత స్థాయికి గొని పోతుంటాడు. తండ్రి, రక్షణ కర్త ను విష్ణువుగా భావిస్తున్నారు. అట్టి విష్ణువు యొక్క ప్రతి రూపమే తండ్రి. కనుకనే, పితృ దేవోభవ" అన్నారు. తల్లిదండ్రులు ఇరువురూ బ్రహ్మ విష్ణువుల యొక్క ప్రతి రూపాలే.
ఇంక మూడవ ఈశ్వరుడు. ఇతడు అడిగిన వారందరికీ వరములిస్తుంటాడు. కాబట్టి ఇతనికి భోళా శంకరుడు అని పేరు. ఎవ్వరిని కాదనలేడు. ఇట్టి శివ స్వరూపాన్ని ధరించినవాడు గురువు. కనుకనే, "ఆచార్య దేవో భవ" అన్నారు. బ్రహ్మచేత సృష్టింబడి, విష్ణువు చేత కాపాడబడే ఈ జగత్తును సక్రమమైన మార్గంలో ప్రవేశపెట్టి దివ్యత్వానికి దారి చూపే వాడే శివుడు. సత్వ, రజస్తమ గుణ స్వరూపులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ప్రతి మానవునియందు ఉంటున్నారు. కనుకనే "ఈశ్వరఃసర్వ భూతానాం" – “ఈశా వాస్య మిదం జగత్” అన్నారు. సర్వత్ర ఉన్న దివ్యత్వము ఈ గుణముల యొక్క స్వరూపమే.
(శ్రీభ.ఉపు.186/187)
“బ్రహ్మ సృష్టి చేయు బ్రహ్మాండముల నెల్ల
విష్ణువెంతొ పెంచి వృద్ధిచేయు
పరమ శివుడు ద్రుంచు పాపిష్టి జీవుల
గురుడు మూడు క్రియల కూర్చునొకడె!”
జీవమున్న వస్తువును జీవము లేని వస్తువుగా, జీవము లేని వస్తువును జీవమున్న వస్తువుగా మార్చటం భగవంతునికి మాత్రమే సాధ్యము. ఆయనకు అది ఒక క్రీడ. (తపోవనము పు 113)