"రామో విగ్రహవాన్ ధర్మః" ధర్మమే రామస్వరూపమును ధరించి ఈ జగత్తులో ఆవిర్భవించినది. ధర్మమువేరు, రాముడు వేరు కాదు. "రాముడు - ధర్మం" అవినాభావ సంబంధములు, అన్యోన్యాశ్రయములు కలిగి యున్నవి.
(స.సా.జ. 1989 పు. 142)
భారతీయులకు ప్రధాన గ్రంథము వేదము. ఈ వేదము మొట్టమొదట బోధించినది సత్యం వద, ధర్మం చర సత్యమును పలుకు, ధర్మమును ఆచరించు. దురదుష్టవశాత్తు సత్యమును పలుకటమే లేదు. ధర్మమును పలుకుతున్నారే గాని ఆచరించటం లేదు. ధర్మమును ఆచరించాలి. ధర్మోరక్షతి రక్షితః ధర్మమే మనలను రక్షించేది. ధర్మమంటే ఏమిటి? మన ఆచారాలు మన సాంప్రదాయములు మాత్రమే కాదు. “మనస్యేకం, వచస్యేకం, కర్మణ్యేకం" ఇదే మానవుని ధర్మము "The Proper study of mankind is man". ఈ మూడింటిని ఏకత్వము గావించాలి. అప్పుడే త్రికరణశుద్ధి ఏర్పడుతుంది. ఆ త్రికరణ శుద్ధియే మన ధర్మము. ఈనాడు మాటలయందు వేరు, తలంపుల యందు వేరు. క్రియలు మరొకటిగా మారుతూ రావటంచేతనే ధర్మము క్షీణించిపోయింది. ఉపనిషత్తులు చెప్పాయి "సత్యాన్న ప్రమదితవ్యం". ఎట్లాంటి పరిస్థితులయందైనా సత్యాన్ని వదలవద్దు. "ధర్మాన్న ప్రమది తవ్యం" ధర్మాన్ని వదలి పెట్టవద్దు. ఎలాంటి పరిస్థితులయందు ప్రాణాపాయము సంభవించినప్పుడైనా ధర్మమును మాత్రము మానరాదు. అదియే సత్యహరిశ్చంద్రుడు సాధించిన వ్రతము. సత్యమునకే విజయమని పవిత్రమైన ఉపనిషత్తులు మానవులకు పలుమారు బోధిస్తూ వచ్చాయి. ఇలాంటి విజయమును సాధించవలసిన వాడు ధర్మాన్ని అనుసరించాలి.
పురాణములు కూడను ఈ సత్య ధర్మములనే ప్రబోధిస్తూ వచ్చాయి. "సత్యా న్నాస్తి పరోధర్మః“ ధర్మమనేది సత్యము పైన ఆధారపడి ఉంటున్నది. దీనికంటే మించినది లేదు. భాగవతముకూడా "పలికి బొంకుట కన్న పాపమున్నె" అన్నది. మనము చెప్పిన దానిని తప్పి పోవుటకంటె పాపమున్నదా? సత్యమే ప్రధానమని నిరూపించినది. సత్యమే యీ జగత్తును కాపాడుతున్నది. ధర్మము యీసత్యమును ఆశ్రయించినది. సత్యధర్మములు రెండు అవినాభావ సంబంధము అన్యోన్యాశ్రయములు. భారత పుత్రులైన యువతి యువకులారా ప్రధానమైనది. సత్యమార్గము. దానినే దైవస్వరూపముగా విశ్వసించాలి. గౌరవించాలి.
(బృత్ర.పు, ౮/౯ )
ధర్మమనేది ఒక దేశమునకు ఒక కాలమునకు పరిమిలైనది కాదు.
(బృత్ర.పు. ౧౦ )
మానవుడు తన అహంకారమును తన స్వార్థమును, తన పాశవిక ప్రకృతిని తన దేహ దృష్టిని బలిచేసి, విశ్వాత్మయైన పరమాత్మతో సమైక్యమును పొందడమే ధర్మమందురు. సమస్త లౌకిక విషయాల యందు ఔచిత్య భంగము కాని మాటలు, హృదయ ద్రోహము కాని పనులు, సమయ స్ఫూర్తి మార్పులు, స్వార్థ రహితమైన నడకలు, భగవత్ రతిగల భావములు, సత్యానేషణములు - ఇవియే నిజ ధర్మము. బ్రహ్మ దృష్టితో చేసి బ్రహ్మైక్యానందస్థితికి దారితీసే ప్రతి నిస్వార్ధ కర్మకూడా ఒక ధర్మమే! ఇట్టి ప్రతి ధర్మకర్మనూ బ్రహ్మజ్ఞాన మహాధర్మ సముద్రమున సంగమించే ఒక పుణ్య వాహినియే..
(స.సూ. పు. 106)
ధర్మము ఒక దేశమునకు గాని, ఒక కాలమునకుగాని పరిమితమైనది కాదు. ఏ దేశమునైనను, ఏకాలమునైనను, ధర్మమొక్కటే. దేశము మారినను, కాలము మారినను, ధర్మము మారదు. అది సమయానుకూలముగా సవరింపబడునది కాదు. ధర్మము మానవజాతి యుత్తమ జీవితమునకు మార్గదర్శకములైన యనేక ముఖ్య సూత్రముల సముదాయము.
(స.వ.పు.1 )
వేదమే ధర్మమునకు మూలము. ధర్మమునకు గోవు, బ్రాహ్మణుడు, వేదములు, శాస్త్రములు, పరిశుద్ధత అనునవి య్యెదును అయిదు విధులు. ఆ యైదింటిని కాపాడుటకు మంచి వారెపుడును యత్నించుచుందురు. మీరును వాటి విషయమున శ్రద్ధ వహించుచుండవలెను. అవి నశించిన జీవితమే నశించును. జీవితమునకు విలువను కలిగించు ప్రతి యంశమును నశించును. ధర్మమెక్కడ నుండునో కృష్ణుడక్కడ నుండును. కాబట్టి మీరాయన యనుగ్రహము పొందుటకు ఏపాటి యర్ధత కలిగి యున్నారో - మీలో ప్రతి యొక్కరును పరిశీలించు కొనుడు. మీరాయనను చేరువకు తెచ్చుకొందురో, లేక దూరము చేసికొందురో - ఆది మీలోనే యున్నది. .
(స.వ.పు. 10)
అన్ని ధర్మములకు మేటి అయిన, విలువైన ధర్మము మరొకటున్నది. అదే "నేను", అనే ప్రజ్ఞాధర్మము. ప్రజ్ఞాధర్మమనగా మనసునందు, శరీరము నందు, చిత్తమునందు, అంతఃకరణమునందు, బుద్ధియందు, సర్వమానవులయందు సమత్వముగా ప్రవహించునది. దీనినే constant integrated awareness అంటారు . ఇది నేను అనే స్వశక్తితో ప్రవేశించి, ప్రకటించి, వికసించి ప్రవర్ధమానమై ప్రకాశిస్తున్నది. ఇందులో ప్రతి విషయము "నేను" "నేను" అని ప్రకాశవంతంగా దేహమును వికాసపరుస్తుంది.
(నే.నే.పు.82)
"ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగేయుగే " ధర్మ ఆచరణ స్థాపన చేశాడు. కృష్ణుడు. ధర్మంచెడేది, నాశనమయ్యేది కాదు. త్రికాల బాజ్యం. మనం దానిని ఆచరణలో అందుకోవటంలేదు.
కృతయుగంలోనాలుగుపాదములు, త్రేతాయుగంలో 3 పాదములు, ద్వాపరంలో 2 పాదములు, కలిలో ఒక్క పాదమే ధర్మం అని ఉపనిషత్తులు చెప్పి నాయి.
కృతయుగంలో నాలుగు పాదములున్న ధర్మమునకు రామావతారంలో ఒక పాదం పోవడానికి అర్థం ఏమిటి? ద్వాపరయుగంలో రెండు పాదములే వుంటే కృష్ణుడు వచ్చి కాపాడినదేమిటి? కృష్ణుని ధర్మస్థాపన కృష్ణుని తోనే పోయింది. ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క పాదం పో తూనే వుంది. పోయినపాదమేమిటి? స్థాపన చేసినదేమిటి? అని ప్రశ్న పురాణములు సత్యస్వరూపాన్నే అందించాయి. కాని సందిగ్గావస్థలో ముంచలేదు.
ఒక చిన్న ఉదాహరణ : చిన్న బిడ్డ నడకరానటువంటి స్థితిలో రెండుచేతులు, రెండు కాళ్ళు వుపయోగించి నడవటానికి ప్రయత్నిస్తుంది. అదే ఒకసంవత్సరం దాటిన బిడ్డయితే తల్లి చేతిని ఆధారంగా తీసుకుని రెండు కాళ్ళలో తేలికగా నడవగలుగుతుంది. అదేవిధంగా కృతయుగంలో ధర్మానికి నాలుగు పాదాలు అనే విషయంలో ఏదో ధర్మానికి ఒక స్వరూపాన్ని కల్పించి దానికి 4 పాదాలు అని తలచటం కాదు. ఈ నాలుగు పాదాలు భగవంతుని చేరే మార్గాలు. కృతయుగంలో యజ్ఞయాగాది క్రతువు లాచరించి దైవాన్ని చేరేవారు. అది నడకరాని పసిపాప వంటిది. ఇక త్రేతాయుగం వచ్చేటప్పటికి ధర్మానికి ఒకపాదం పోలేదు. యజ్ఞయాగాదులేకాక, జపతపాదుల నాధారంగా చేసుకుని నడక సాగించినాడు మానవుడు. ఇది తల్లి చేతిని పట్టుకుని నడిచే బిడ్డవంటిది.
ద్వాపరయుగంలో రెండుపాదాలేవున్నాయి. ఆధ్యాత్మిక మార్గంలో నడక యింకొంచెం తేలిక అయింది. యజ్ఞయాగాది కరువులు, జపతప ధ్యానాధుల ఆవశ్యకత లేకుండా ఏవో కొన్ని రకములైన అర్చనలద్వారా భగవత్ సాన్నిధ్యాన్ని పొందగలిగారు. ఇక కలిలో ధర్మానికి ఒక పాదమే మిగిలింది. అదేనామస్మరణ కలిలో ఏకొంచెం ఆచరించినా ఫలితం అతిసులువుగా, అతిత్వరితంగా అందుతుంది. కృత, త్రేత, ద్వాపరములకంటె ఈ కలియుగంలో నామస్మరణ ద్వారా సునాయాసంగా దైవాన్ని పొందవచ్చు. ఇది పరుగెత్తడం వంటిది. నడుస్తూవున్నపుడు రెండు పాదాలు భూమిమీద ఆనుతాయి. కాని పరిగెత్తినపుడు ఒక్కపాదమే భూమి మీద ఆనుతుంది. నడవటం కన్నా పరుగెత్తటం వల్ల గమ్యాన్ని త్వరగా చేరిపోతున్నాం.
(వే.ప్ర.పు. 95/97)
ధర్మము ధృ అను సంస్కృత ధాతువు నుండి వచ్చినది. ధరించునదని అర్థము. దేశమును, దేహమును కాపాడుటకై అందానందముల ననుగ్రహించుటకే ధర్మమను వస్త్రము భారత దేశమునకు భగవంతుడు కప్పిన పవిత్ర పీతాంబరము వంటిదే. వస్త్రము మాన మర్యాదలను కాపాడుటకే కాక శీతల బాధలనుండి రక్షించుటకేకాక అందమును కూడనూ అందించుచున్నది. మన దేహమునకు మర్యాద, మానమును కాపాడు నట్టిదే ధర్మము. దేశ గౌరవము కూడనూ భగవత్ సంకల్పమయిన ధర్మధారణతో నిలబెట్టుకొనవలెనను సంకల్పమే ఈ ధర్మము యొక్క స్థితి. దేశమునకేకాక ఈ లోకమున సృష్టించిన ఒక్కొక్క వస్తువు ఒ క్కొక్క ధర్మమును వస్రముతో కప్పబడినది . ధర్మమనునది సమిష్టి స్వరూపమే కాక వ్యష్టి స్వరూపమును కూడా కలిగియున్నది. సృష్టికి మూలాధారమయిన పంచభూతములను విచారించుడు; నీటికి చలనశక్తి చలువశక్తి సహజ ధర్మము, అగ్నికి దహనశక్తి, వేడి, ఇవి ధర్మములు. అట్లే ఒక్కొక్క దానిని ఒక్కొక్క ధర్మము. మానవులకు మానవత్త్వమూ, పశువులకు పశుత్త్వమూ, ఇవి వాటి వాటి శక్తులను కోల్పోకుండా రక్షించునట్టి ధర్మకవచములై యుండును. అగ్నికి దహన శక్తి, వేడిమి లేకుండిన దానిని అగ్ని అని ఎవరైనా చెప్పుదురా ! అగ్నికి తగిన స్వరూప స్వభావములు దాని ధర్మమును ప్రదర్శించును. అట్టి స్వరూప స్వభావములు నశించిన అగ్ని చచ్చినదనే అర్థము. అందువలననే. అగ్ని తన దహన శక్తిని కోల్పోవుటచే ప్రాణము శవస్వరూపమయిన బొగ్గుగా తయారయినది.
(గీత పు. 53/54)
భగవద్గీత ప్రథమాధ్యాయమున ప్రథమ శ్లోకమున "ధర్మ క్షేత్రే కురు క్షేత్రే..." అను వాక్యము కానవచ్చును. ఇందులో ధర్మ శబ్దము ప్రథమమున ప్రయోగింప బడినది. గీత యొక్క పదునెనిమిదవ అధ్యాయమున చిట్టచివర "యత్ర యోగీశ్వరః కృష్ణో.." అను శ్లోకమున ఇదే ధర్మ శబ్దము క్లుప్తముగా బోధింప బడినది. కావున గీతాభి ప్రాయము "ధర్మమును స్మరింపుడు, ధర్మమును ఆచరింపుడు" అనునదే యని స్పష్టమగుచున్నది. ధర్మ శబ్ద మెంత గంభీరమో చూడుడు.
(గీ.పు. 3)
ధర్మమునకు నాశములేదు. ధర్మమునకు క్షీణత్వము లేదు. అయితే ధర్మస్థాపన అనుటలో అంతరార్థమున్నది. ధర్మాచరణ క్షీణిస్తుంది. ధర్మము ఏవాటికి క్షీణించేది కాదు.
(వి.పు.18)
"రామో విగ్రహవాన్ ధర్మః" ధర్మము, రాముడు వేరువేరు కాదు. రాముడే ధర్మము. రావణుడే అధర్మము. ధర్మాధర్మముల చదరంగమే ఈ జీవితము. అయితే ధర్మము రెండు రకములు. 1. స్వధర్మము 2. పరధర్మము. స్వధర్మమంటే ఏమిటి? కత్రియ ధర్మము. బ్రాహ్మణ ధర్మము, శూద్రధర్మము మున్నగునవి కాదు. స్వ - అనగా ఆత్మ. కనుక ఆత్మధర్మమే స్వధర్మము. దేహధర్మమే పరధర్మము..
(స.పా.మే.97 పు.133/134)
జగత్తును ధరించునదే ధర్మము. యతో ధర్మస్తతో జయః" ఎక్కడ ధర్మమో అక్కడ విజయము. “ధర్మో రక్షతి రక్షితః" ధర్మమును రక్షించినప్పుడే ధర్మము మనలను రక్షిస్తుంది. ధర్మం చర’ధర్మమునే ఆచరించు. ‘సత్యాన్నాస్తి పరో ధర్మః ఇట్టి ధర్మమునకు సత్యమే ఆధారము. సూర్యుని రశ్మియందు ఏడు రంగులు లీనమైనట్లుగా సమాజ శ్రేయస్సునకై యేడు విధములైన ధర్మములు నియమించవలసి వచ్చింది. మొదటిది సత్యము, రెండవది శీలము, మూడవది ధర్మము, నాల్గవది దమము, ఐదవది తపస్సు, ఆరవది త్యాగము, ఏడవది అహింస. ఇవన్నియు సమాజ రక్షణకై సామాజిక శ్రేయస్సునకై నియమించినట్టివి.
(శ్రీపు.224)
మన కాలేజి చిహ్నంలో ధర్మోరక్షతి రక్షితః ఉంది. ధర్మాన్ని రక్షిస్తే అది నిన్ను రక్షిస్తుంది. ధర్మాన్ని హింసిస్తే ఆ ధర్మమే నిన్ను హింసిస్తుంది. అదే విధముగా ఆత్మ విశ్వాసమే పూర్ణముగా ఉన్నపుడు అదే నిన్ను రక్షిస్తుంది. ఆ self-confidence మనం develop చేసుకోవాలి. ఆ self-confidence కనిపించేది కాదు. ఇక్కడ యింత పెద్ద భవనము ఉంటున్నది పెద్ద భవనమునకు పునాది ఎంతో వేసినాము. పునాదిలేక యింత పెద్ద భవనం యిక్కడ నిలవటానికి వీలుకాదు. కానీ పునాది కనిపించటం లేదు. ఆ పునాదే self-confidence పైన కనిపించే భవనం self-confidence దీనికి పై roof self-sacrifice అప్పుడు self-realisation అనే సుఖాన్ని పొందుతున్నాం . కాబట్టి self-realisation కు self-sacrifice కావాలి. self-sacrifice కు self-satisfaction పొందాలి. self-satisfaction ఉండటానికి self-confidence ఉండాలి. కనుక self-confidence develop చేసుకోవాలి.
ఈనాటి మానవుడు మనస్సును balance లేకుండా చేసుకుంటున్నాడు. ప్రతిదానికి నాలుగు స్థాయిలుంటున్నాయి. పైన knowledge ఉంటున్నది. క్రింద skill ఉంటున్నది.
మూడవది balance నాల్గవది insight. ఇవన్ని సరియైన స్థితిలో ఉండాలి. knowledge కావలసినంత ఉంటున్నది. knowledge ని skill చేసే balance సక్రమంగా ఉంటుంది. ఇక్కడే మానవుని పొరపాటు. knowledge, skill చేయటం లేదు. kill చేస్తున్నాడు. దానివల్ల balance తప్పిపోతున్నది. Balance తప్పిపోవటం చేత insight పోయి out-sight అవుతున్నది. మన దృష్టి బహిర్ముఖమవుతున్నది.
మొట్టమొదట తెలివి తేటలను సక్రమమైన మార్గములో పెట్టుకోవాలి. మన తెలివి తేటలను misuse చేస్తున్నాము. తప్పుడు మార్గములో అనుభవిస్తున్నాము. ఇది సరియైనది కాదు. గొప్ప తెలివితేటలున్నాయని అహంకారం చేత, దేహాత్మ భావంచేత చెడగొట్టుకుంటున్నాం. ఆ knowledge లో కూడా ఉంటున్నది. ఆత్మతత్త్యము. ఆ knowledge లో కూడా energy ఉంటున్నది. ఆ energy నే ఆత్మ. ఈ విధంగా విచారణ చేస్తే ఆత్మ ఇట్టిది అట్టిదనికాదు. సైంటిస్టులు matter and energy అన్నారు. నా ఉద్దేశ్యములో matter అనేదే లేదు. అంతా energy యే! matter, energy గా energy matter గా మారుతున్నది. నీ దృష్టిలో రెండుగా కనిపిస్తున్నాయి. గానీ ఆత్మ దృష్టిలో ఒక్కటే. ఇదే "ఏకం సత్ విప్రాః బహుధా: వదంతి,
(ద.య.స.స.97 పు.94/96)
నీ శక్తికి మించకుండా బీదవారికి కావలసినవి సమకూర్చటానికి ప్రయత్నించు. అది నీ ధర్మము. .
(సా|| పు. 625)
ప్రపంచములోని ప్రతి పదార్ధమునకును, సహజమైన ధర్మమొకటి యున్నది. జలమునకు ప్రవహించుట, అగ్నికి దహించుట, సూదంటు రాయికి ఆకర్షించుట సహజధర్మములు. అవి యన్నియు తమ ధర్మములను నిలుపుకొనియే యున్నవి. అంతరిక్షమున సూర్య చంద్రాది గ్రహములు, నక్షత్రములును, తమధర్మమును తప్పకయే సంచరించుచున్నవి. మరియు చైతన్యముగలవానిలో, చెట్టుచేమలు, క్రిమికీటకములు, పశుపక్ష్యాదులు కూడా, తమతమ ధర్మములలోనే వర్తించుచున్నవి. పరమాణువు మొదలు పరమాత్మ వరకును ప్రసరింపజాలిన బుద్ధివిశేష ముగల మానవుడొక్కడే తన ధర్మము తప్పి, క్రిందికి దిగజారిపోవుచున్నాడు. తృప్తికిని, ఆనందమునకును మార్గము లన్వేషించి కనుగొన్న మహాపురుషుల జీవతాను భవములే శాస్త్రములు. ఇప్పటివారు, శాస్త్రము ను పేక్షించి, విపరీతపు యుక్తులతో, తృప్తిని, ఆనందమును సాధించుటకు ప్రబల ప్రయత్నములు చేయుచున్నారు. కాని, అవి మరింత దూర దూరమగుచున్నవి. అందు వింత యేమున్నది; తృప్తి యానందమూ యుక్తి సాధ్యములు కావు. ((శ్రీ సత్య సాయి వచనా మృ తము 1964 పు 260-261)