బుద్దుడు కూడ వేదభావములను, వేదము యొక్క ఆశయములను ఆచరించి నిరూపించాడు. మొట్టమొదట "బుద్ధం శరణం గచ్ఛామి" అన్నాడు. ఇది వ్యక్తి గతమైనది. క్రమక్రమేణ "సంఘం శరణం గచ్ఛామి" అన్నాడు.వ్యక్తిగతమైన భావములు సంకుచితములుగా వుంటాయి. దీనినే సర్వస్వముగా నీవు భావించవద్దు. సముద్రములో బిందువు వంటిది యిది. కనుక “సంఘం శరణం గచ్ఛామి"నీ సంఘములోపల సంఘస్వరూపుడుగా విశాలహృదయాన్ని యేర్పరచుకోమన్నాడు. సంఘమునకు రూపము లేదు. వ్యక్తుల సమూహమే సంఘము. వ్యక్తిత్వము అనేక విధములుగా చేరినపుడే సంఘస్వరూపము ధరిస్తుంది. Life into infinity is Divinity. విశాలమైన ఆత్మతత్వాన్ని చేరుకున్నప్పుడే యెంతో విశాలమైన తత్వముగా రూపొందుతుంది. Lite into infinity. ఇదే దైవత్వము. విశాలమైన హృదయులుగా కమ్మన్నాడు. ఈ సంఘముయేదో కొంత గుంపుతో మాత్రమే కూడి వుంటాది. ఒక దేశపు సంఘమునకు మరో దేశపు సంఘమునకు సంబంధముండదు. ఒక పేరుతో వుండిన సంఘము మరొక పేరుతో వుండిన సంఘమునకు సంబంధముండదు. కనుక సంఘమునకు కూడ హద్దులుంటాయి. హద్దులతో కూడిన సంఘములు గొప్పవి కావు. కనుకనే సర్వాత్మక భావమును ధరించి "ధర్మం శరణం గచ్చామి" అన్నాడు. "ధారయతాతి ధర్మః" జగత్తును ధరించినది ధర్మము. ధర్మమంటే యేమిటి అని విచారిస్తే ఆపదార్థము యొక్క గుణమే పదార్థముయొక్క ధర్మము. గుణమే దాని యదార్థము. పదార్థమే వస్తువు, అదే పరబ్రహ్మతత్వము. పరబ్రహ్మతత్వమును ఆధారము చేసుకున్నదే ధర్మము.
(శ్రీ.గీపు.302)