జీవితమునకు పరమార్ధము ఆత్మ. ఇది సర్వత్రావున్నదన్న విషయము భారతీయులకు విదితమే. కొందరు వేదములు ఆధారముగాము. మరికొందరు శాస్త్రములను ఆధారముగాను. ఇంకా కొందరు యతిశ్వరుల అనుభవములను ఆధారముగానూ తీసికొని వారి వారి బుద్ధి కుశలతతో ఈ విషయమును ఋజువు పరచిరి. అనేకమంది. మహనీయులు సర్వవ్యాపకమైన ఆత్మాన్వేషణలో తమ శక్తి సామర్థ్యములను ఉపయోగించి ఆదివ్యత్వాన్ని కనుగొనిరి. ప్రవక్తలు, శాస్త్రజ్ఞులు ఎవరెవరు యేయే సంకల్పములు చేసి దేని కొరకు ప్రయత్నించిరో వారు వారి సంకల్పమును సిద్ది చేసికొని నట్లు భారతదేశమున యెన్నియో ప్రమాణములు కలవు. కోట్లమంది మానవులలో ఇట్టి ఆత్మ సందర్శనము యే కొంత మందికో లభించెను. అట్టి పవిత్ర ప్రాప్తి మానవునిలోని బుద్ధి వివేకము పరాకాష్ట చెందినట్లు మిగిలినజీవరాసులలో చెందలేదు. అందువలన సృష్టిలో మానవుడు ఉత్తముడనియూ మానవ జన్మ దుర్లభమైనదనియూ శాస్త్రములు చాటెను. మానవుడు సృష్టి హేతువును వెదుకుటలో అధికారి. మానవుని శాంతిభద్రల కొరకు ఈ సృష్టిని వినియోగించుకొనుచున్నాడు. ఇది వేద ప్రమాణము.
వైదిక మతమునకు ఆధార భూతములగు వేదముల ఈశ్వరవాణి రూపములైనవి. వేదముల ఆద్యంత రహితములని హిందువుల సిద్ధాంతము. వేదములనగా గ్రంధములుకావు. అవి వివిధ జిజ్ఞాసువులచే వివిధ కాలములందు కని పెట్టబడిన పరమార్థ ధర్మ సూత్రములు. ఇవి మానవులు ఎరుగక పూర్వము యెట్లు ప్రవర్తిల్లు చుండెనో మానవులు వాటిని మరచిన తరువాత కూడాను ఆట్లే ప్రవర్తించు చుండును.
అట్లే పరమార్థ లోక ధర్మములు కూడా శాశ్వతములు. ఈ రహస్యమును కనుగొన్నవారు ఋషులు. ఈ ఋషులు కనుగొన్న ధర్మములకు అంతము లేక పోయిననూ అది ఉండి తీరవలయునుకదా అని కొందరు తలంచవచ్చును. సృష్టి ఆద్యంత రహితమని వేద సిద్ధాంతము. విశ్వశక్తి యొక్క సమిష్టి పరిణామము యెప్పుడును సుస్థిరమై హెచ్చు తగ్గులు లేక నిలిచి యుండును. సృష్టియూ, సృష్టికర్తయూ రెండు సమానరేఖలు. అవి ఆద్యంత రహితములై సుస్థిరమగు సమదూరమునే సాగుచున్నవి. భగవంతుడు నిత్య కార్యశీలుడు, అతని శక్తి అవ్యక్తము.
(స.వా.పు.1/2)
తన్ను తాను తెలిసి కొనడమే పరమార్థము. పురుషార్థము. దేహభ్రాంతి కలవారు బాలుడా? వృద్ధుడా? పురుషుడా? స్త్రీయా? అని విచారణ చేయుదురు. ఇట్టి దేహభ్రాంతిని వదలి బ్రహ్మ భావము రావాలి. ఇదికాదు. చివరకు బ్రహ్మమే తాను అని తెలిసికోవాలి. దానికే "నేతి, నేతి ఇది ఆత్మ" అని శ్రుతులు చెప్పుచున్నవి. జీవ స్వరూపము ఆత్మ యొక్క ప్రతి బింబమే. జీవి నిజముగా అమృత స్వరూపుడు. ఈ సత్యము శ్రీ శంకరాచార్యులు ముచ్చటగా మూడు పదాలతో లోకానికి ఉపదేశించారు. "బ్రహ్మసత్యం, జగన్మిథ్య జీవో బ్రహ్మైవ నాపరా" అని అదే ముఖ్యమైన ఆధ్యాత్మిక ప్రభోధ. జీవుడు బ్రహ్మ గనే యున్నాడు. రెండింటికిని అవినాభావ సంబంధము. బ్రహ్మతత్త్వముతో కూడిన మానవత్వము హీనము కాదు. అల్పముకాదు. అపవిత్రము కాదు.
(సా ॥పు.313)