బాల్యకాలమున చంటిపిల్లలకు పాలరుచి తెలియ కుండిననూ, నిరంతర అభ్యాసముచే యెప్పుడైననూ పాలను వదలి అన్నము నందించిన దానిని ఆరగించరు, పాలను విడువరు. అయితే తల్లి వారికి మెల్ల మెల్లగ అన్నమును కలిపి కొంతకొంత సేవనము చేయు చుండును. నిత్య సేవనముచే అన్నమునందలి రుచిమరిగి పాలను వదలుదురు. పాలే యెంత సహజమని భావించిఆరగించిరో వారికి నేడు అభ్యాసముల ద్వారా అన్నము అంత సహజముగా మారెను: అన్నమునే సహజముగా ఆరగించుటకు మరిగిన మానవుడు ఒక దినము అన్నములేక నిలువజాలడు.
ఆటులనే, ప్రప్రథమమున, విషయభోగము సహజ మయిననూ అభ్యాసము ద్వారా, శిక్షణచే జిజ్ఞాసువులు కథాకీర్తనమునే అనురక్తిగా భావించి మెల్ల మెల్లగ దానియందురుచిని బలపరుచుకొనిన, కొంతకాలమునకు భగవత్కథా శ్రవణమె కీర్తనమె తనకు ఆహారముగా కలిగి, ఒక నిమిషమైననూ దానిని వదలని వాడై అందులోనే రసమును ఆస్వాదనచేయుచూ ఆనందములో కాలమును గడుపును. అట్టివారలు, సామాన్యులు నలుగురు చేరిన స్థానమున చేరక, విషయ సంబంధమైన సంభాషణలలో నిలువక, భగవత్ కీర్తనలు కధలు జరుగు స్థలములకు పోయి ఆనందముగా కాలమును గడుపుదురు.
సజ్జనులనుటకు ఇట్టి ప్రవర్తనలే సరియైన గుర్తులు. అట్లుకాక, మేము సాధకులమని చెప్పుకొనుచు, భగవత్ భక్తులమని బాహ్యాండంబరములు చేయుచు యెక్కడ వెళ్ళిననూ విషయ సంబంధమైన, ఆటలు మాటలు ఆడిన అది సాధకత్వమునకు స్థానము కాదు. భగవత్ సంబంధమైన విషయములు జరుగు స్థానమునే కాలమున గడుపవలెను. కానీ, వాటికి విరుద్దమయిన ప్రదేశములందు యెట్టి విచిత్రములు జరిగిననూ తాను చేరరాదు; చూడరాదు; వినరాదు; అట్టివే భాగవతుని లక్షణములు,
(భా.వా.పు.4/5)