వేదము బ్రహ్మమే జగత్కారణమని చెప్పుచున్నది కాని, అచేతనమును గురించి చెప్పుట లేదు. అది యెట్లనిన, సద్ వస్తువు జగత్కారణమగు సంకల్పము చేసెనని ఆ వేదము చెప్పుచున్నది.సంకల్పములు చేయుట చేతనముల పనికాని, అచేతనముల పనికాదు. కాన జ్ఞాన స్వరూపుడైన బ్రహ్మమే జగత్కారణముకాని, అచేతనము కాదు. వేదము అప్రధానము గురించి చెప్పుటలేదని ఈ సూత్రము స్పష్టపరచుచున్నది.
సంకల్పము సృష్టికి కారణమని శ్రుతులు తెలిపెను. కనుక సంకల్పమే సృష్టికి పూర్వకము. ఈసంకల్పము ప్రధాన గుణమగు సత్వము యొక్క ధర్మము అని సాంఖ్యము తెలుపుచున్నది.
గుణములు సౌమ్యస్థితి యందున్నపుడు సర్వ దర్శమనియు, దీనికి జ్ఞానము సంభవము కాదనియు తలంచిరి. సాక్షి యగు చేతన తత్వము లేకున్న జ్ఞాన ముండ జాలదు. కనుక సాక్షియైన ఈశ్వరుని వలననే ప్రధాన జ్ఞానగుణమును పొందుచున్నది. ఏతావాతా బ్రహ్మమే జగత్తుకు ముఖ్యకారణమని తలంచుట సరియైనది. పరమ సత్యము నిర్గుణ బ్రహ్మమే కాదు; సగుణ బ్రహ్మమూ అగుచున్నాడు. చేతనాచేతనాత్మకమగు ఈ విశ్వము భగవంతుని శరీరముగా ఉన్నది.
సంకల్పించుట చేతన లక్షణమని జడముల లక్షణములు కాదని తేలింది. సంకల్ప కారణముచేత జగత్తు సృష్టింపబడుటకు ఈశ్వరుడే కారణము. ఈశ్వర సంకల్పమే ఈ జగత్తు. స్థూలదృష్టితో చూచిన రెండునూ వేరువేరుగా కన్పించునను సూక్ష్మంగా పరిశీలించిన, పదార్థానికి పరమార్థానికి ప్రాణికి ప్రాణానికి తాత్వికంగా భేదం లేదు. ప్రాణమే ప్రాణిగా మారుతుంది. ప్రాణిలోనుండి ప్రాణం ఉదయిస్తుంది.
ప్రపంచములో బ్రహ్మకాని పదార్థము లేదు. ఈ ప్రపంచమంతా బ్రహ్మతత్వం నుండే ఉదయించింది. అందులోనే లయ మొందుతుంది. అందులోనే సంచరించుతుంది. అవి తజ్జలాత్ అన్న సూత్రం వర్ణిస్తుంది. తత్= దానినుండి, జ= -జన్మించి, ల=లయించి, అత్-వృద్ధి పొందుట - ఈ నాలుగు పాదాలతో కూర్చబడి చేర్చబడినది. ఈ సూత్రము. ఆసలు పురుషుడే ఒక యజ్ఞ స్వరూపుడు. మానవ జీవితమే ఒక యజ్ఞము.
ప్రపంచమంతా పరమాత్మ తత్వంలో నుండి ఆవిర్భవిస్తుంది. పరమేశ్వరుడు లేని చోటు ఈ ప్రపంచములో ఎక్కడా లేదు. కదిలేది జగత్తు. కదిలించేవాడు జగదీశ్వరుడే.
ప్రాపంచికమైన అనురాగాలు నిజమైన అనురాగాలు కావని ఇతరుల మీద అనురాగాలకు మూలము ఆత్మానురాగమేనని యాజ్ఞవల్క్యుడు మైత్రేయికి బోధించుట ఉపనిషత్ తెలుపుచున్నది. ఒకరిమీద ఒకరికి ప్రేమ ఉండి ప్రేమించుట లేదు. ఎవరి ఆనందమును వారు ఆశించి ప్రేమవల్ల కలిగే ఆనందాన్ని పురస్కరించుకొని నడచుచున్నారు. అనురాగము ఆత్మోన్ముఖంగా ఉంటుంది. కాబట్టి ఆత్మతత్వాన్ని అవగాహన చేసుకొని పరిశీలించితే సమస్తం బ్రహ్మ చైతన్యము నుండే జరుగుతున్నదని స్పష్టమవుతుంది..
చరాచరములన్నియు దైవ సంకల్పములే. సంకల్పము చేతనమే కాని అచేతనము కాదని ఈ సూత్రము స్పష్టపరచుచున్నది. ఎవరెన్ని వాదోపవాదములు చేసినా దైవసంకల్పము సమస్తమునకు మూలము.
భ్రాంతి చేత వారి వారి భావాలను ధృడపరచుకొనుటకై ప్రయత్నింతురు. మర్త్య శరీరం ఆత్మకు ఆలంబనం. శరీరముతో పనిలేని పర్జన్యం – వాయువు – ప్రాణం – శరీరానికి కట్టుబడి వుంటుంది. అందువలన అది ఆత్మతత్వము, బ్రహ్మతత్వమును అందుకోలేక పొవుచున్నది. అర్థము చేసుకోలేక పోవుచున్నది. శరీర తత్వమే బ్రహ్మం. అదే ఆత్మ. కన్నులకు చూచే శక్తి చెవులకు వినే శక్తి నిచ్చేదే ఆత్మ. అట్టి ఆత్మను కన్నులు ఏ రీతిగా చూడగలవు? చెవులు ఏ రీతిగా వినగలవు? కన్నులు చెవులు ఆధేయములు. సర్వచైతన్యమైన బ్రహ్మనే వీటికి ఆధారము. అదే ఆత్మ అదే తత్వం, అదే నీవు, అంతా చైతన్యమే, సంకల్పమే.
ఈ ప్రపంచములో పంచభూతములు ప్రజ్ఞానం వలననే సంచరించుచున్నాయి. దేవతలు ప్రజ్ఞాన బలముతోనే రాణించుచున్నారు. సమస్త ప్రాణికోటికి ప్రజ్ఞనే ఆధారము.
స్థావరం జగమంతా ప్రజ్ఞానంలోనే ప్రతిష్ఠితమై యున్నది. ప్రజ్ఞానమే ఆత్మ, ప్రజ్ఞానమే బ్రహ్మ, ప్రజ్ఞానమే లోకం. ప్రపంచమంతా ప్రజ్ఞయొక్క చైతన్యమే. సత్ అను శబ్దముచేత వేదములు జగత్తుకు కారణము బ్రహ్మనే అని చెప్పుచున్నవి. అచేతనమైన పదార్థమును గురించి వేదము ఎక్కడా చెప్పుట లేదు.
(సూ.వా. పు.31/34)