విద్య

సత్య నిత్య సుకృతులన్ని వికృత రూపు పొందుచుండె

పవిత్ర ప్రకృతి ప్రతిదినము ప్రజలవీడి పోవుచుండె

ఆర్యవేద విద్యలణగె దుర్విద్యలు పెరుగుచుండె.

(శ్రీ.వా.ఆ,2015పు2)

 

మన చేతికి ఏమిటి అందము? పెద్ద పెద్ద కంకణాలు వేసుకోవడం కాదు. "హస్తస్య భూషణం దానం",దానంచేయడమే చేతికి అందము."సత్యం కంఠస్య భూషణం",సత్యమే కంఠమునకు భూషణం "శ్రోత్రస్య భూషణం శాస్త్రం", దైవమును గురించి వినడమే చెవులకుఅందము. ఇలాంటి భూషణములను వదలి పెట్టి పిచ్చిపిచ్చి భూషణములకై ప్రాకులాడట మెందుకు? మీ పంచేంద్రియాలను పరమాత్మునికై వినియోగించాలి. జీవితము నిచ్చినది దేనికోసం? లౌకికమైన సుఖములనుఅనుభవించుటకు కాదు. అందుకోసమనే త్యాగరాజు కూడా, "నిధి చాల సుఖమా, ఈశ్వర సన్నిధి చాల సుఖమా, నిజముగ తెలుపుము మనసా!" అన్నాడు. లౌకికమైన సుఖాలన్నీ కదలిపోయే మేఘములవలె వస్తాయి, పోతాయి. కాని, దైవ ప్రేమ మాత్రం వస్తుంది. పెరుగుతుంది. దైవ ప్రేమను మీరెంత అభివృద్ధి పరచుకుంటారో ఆనందం అంత అభివృద్ధి అవుతుంది. ఈ ప్రేమ ఎంత తగ్గిపోతుందో ఆనందం కూడా అంత తగ్గిపోతుంది. మీరు అమితమైన ఆనందాన్ని పొందాలని ఆశిస్తే దైవాన్ని అమితంగాప్రేమించాలి. అందరిని ప్రేమించాలి. అయితే, ఆత్మభావంతో ప్రేమించాలి. దేహభావంతో కాదు.

దేహము పాంచభౌతికము, దేహము కూలక తప్ప దెప్పుడున్

దేహి నిరామయుండు, గణుతింపగ దేహికి చావు పుట్టుకల్

మోహ నిబంధ బంధనల ముద్రలు లేవు, నిజంబు జూడ నా

దేహియె దేవదేవుడు, మదిన్ గణుతింపగ ఆత్మరూపుడౌ

 

కనుక, దేహిని మీరు ప్రేమించాలి. ఈ పాంచ భౌతికమైన దేహమును అందించినది దేనికోసమని? దేహియైన భగవంతుని యొక్క రహస్యమును గుర్తించే నిమిత్తమే. భగవంతుని యొక్క రహస్యాన్ని గుర్తించ లేకపోతే, స్వస్వరూపాన్ని సందర్శించలేకపోతే ఇంక ఈ జీవితం ఎందుకోసం?

 

నిద్దుర నుండి లేచి మరి నిద్దుర పోయెడు దాక

పొట్టకై హద్దును పద్దు లేక వ్యయమందగ జేయుచు జీవితంబు నీ

విద్దెల ధారవోసి అరవింద దళాక్టుని విస్మరించి ఏ

పెద్ద సుఖంబు నొందితివొ ప్రీతిగ యోచన చేయు మానవా!

 

పుస్తకముల్ పఠించితి, పూర్తిగజూచితి సర్వ శాస్త్రముల్

నిస్తులమైన విద్యలు నేర్చితినంచును గర్వమేల నీ

హస్తయుగంబు మోడ్చి పరమాత్మను భక్తితో కొల్వలేని యీ

ప్రస్తుత విద్యలన్నియును ధాత్రి నిరర్ధకంబు కాదే మానవా!

 

ఈ లౌకిక విద్యలన్నీ అంత్యంలో మీకు సహాయపడవు,

అందువల్లనే శంకరులవారు చెప్పారు.

 

భజ గోవిందం భజ గోవిందం

గోవిందం భజ మూఢమతే

సంప్రా ప్తే సన్నిహితే కాలే

నహి నహి రక్షతి డుకృఞె కరణే

 

విద్య విజ్ఞానంకోసం, కృషి కూటికోసం. విద్య కూటి కోసం కాదు. మీరు నేర్చుకున్న విద్యను సమాజానికి ఉపకరించే రీతిగా వినియోగించాలి. సమాజ సేవయే సర్వేశ్వర సేవ. కనుక, మీ సమస్త శక్తులనూ సమాజానికి అర్పితం గావించాలి. అంతేగాని, ఏదో ఒక పెద్ద పట్టము కట్టుకుని పరదేశానికి ప్రయాణమై పోవడం గొప్పతనం కాదు. ఎంత మంది పోలేదు! ఎంతమంది సంపాదించలేదు! కానీ, కట్టకడపటికి ఏమైనా వెంట తీసుకు పోయారా? పోయే సమయంలో ఇంత మట్టెనా తీసుకు పోవడానికి వీలుకాదు. లేకపోతే భారతదేశంలో మట్టికి కూడా రేషన్ వచ్చేది! అయితే, లౌకికమైన విద్యలను నేర్వవలసిందే. దానికోసమే మేము విద్యాసంస్థలను ప్రారంభించాము. కానీ, మీరు నేర్చిన విద్యను సమాజంలో సద్వినియోగ పర్చుకోవాలి. విద్యా గర్వంచేత భగవంతుని సన్నిధికి దూరం కాకూడదు. భగవంతునికి సన్నిహితం చేసేది విద్య. “సా విద్యా యా విముక్తయే" ముక్తి కోసమే విద్య నేర్పాలి. అదియే జీవిత గమ్యము. అదియే నిర్వాణము ఆట్టి నిర్వాణ సంబంధమైన విద్యను ఈనాడు మీరు నిర్మూలం గావించుకొంటున్నారు.

(స. సా.ఆ.99పు 269/270)

 

"విద్య నేడింతయు విశాలత్వమొంది విస్తృతి పొందుచున్నది కాని దానికి మూలకందమును ఆత్మోన్నతిని విస్మరించుచున్నది. మానవులకెల్లెడల జీవనము భారమగుచున్నది. కారణము విద్యార్థి, తళుకుల మెరిసే డంబ దర్పాలకు వశుడగుచున్నాడు"

(శ్రీవా. జూ.97 పు.72)

 

"నేటి విద్య తెలివి తేటలనేపెంచు

కొంచమైన గుణము పెంచబోదు

కోటి విద్యలుండి గుణము లేకున్నచో

అట్టి విద్య కన్న మట్టి మిన్న."

(శ్రీ., జూ. పు.103)

 

బాధలలో, కష్టాలలో ఉన్నవారిని చూసినప్పుడు మీ మనస్సు కరిగి వారికి సహాయం చేయాలని, వారి దుఃఖమును నివారణ గావించాలని మీకు బుద్ధి పుట్టాలి. అట్టి దయతో నిండిన హృదయం మీయందుండాలి. అప్పుడే మీరు నిజమైన మానవులనిపించుకుంటారు. మానవుణ్ణి దయామయునిగా మార్చునదే నిజమైన విద్య. కాని, ఆధునిక విద్య మానవుణ్ణి శిలాహృదయునిగా మార్చివేస్తున్నది. ఒకానొక సమయంలో గాంధీ చాల విచారంగా ఉండటం చూసి ఒక బ్రిటిష్ వ్యక్తి కారణ మడిగాడు. గాంధీ "The hard heartedness of the educated makes me feel sad." (విద్యావంతుల కఠినత్వమే నన్ను విచారానికి గురి చేస్తున్నది) అన్నాడు. ఈనాటి విద్యార్థి హృదయం చదివేకొలది. కఠినంగా మారిపోతున్నది. ఇలాంటిది సరియైన విద్యయే కాదు. విద్య హృదయాన్ని కరిగించాలి. ప్రేమను పెంచాలి, దివ్యత్వాన్ని పోషించాలి. డిగ్రీలను పుచ్చుకోవటం కాదు ముఖ్యం. "చదివి వ్రాయ నేర్చినవారంతా విద్యావంతులేనా? కాలేజీ డిగ్రీలు పొంద విద్యావంతులగునా? సుజ్ఞానము, సుకృతము లేని విద్యలు సద్విద్యలగునా? బ్రతుకుటకే విద్యయన్న బ్రతుక లేవే పశు పక్షులు !" మీరు విద్య కేవలం జీవనోపాధికని భావిస్తున్నారు. ఇది చాల పొరపాటు. Education is for life, not for a living (విద్య జీవిత పరమావధికేగాని, జీవనోపాధికి కాదు)

(స. సా. జూ .2000పు.171)

 

జాతి భేదము లేక జనులకాశ్రయమిచ్చి

సర్వసమత్వంబు చాటు తరులు –

తనువుపై మనకింత తమకంబు వలదంచు

చలి ఎండల వానల సైచు గిరులు

రేపుమాపటికంచు వాపోవ వలదంచు

విహగముల్ సంతృప్తి విద్య గరపు

జగతి నిత్యముకాదు సంసారమది భ్రాంతి

అనుచు బోధించు ఆకసంబు

ప్రాణముల్ వీడి చనునాడు మృగములైన

నేను నాదని అనవు రవంత యైన

ప్రకృతి బోధించు సత్యమీ మర్మమెల్ల

తెలియజేయు నదె విద్య తెలిసి కొనుడు.

(యు.సా.పు.95/96)

 

ఆదిలేనిది అనాది, అదే అన్నిటికీ ఆది;దానికి ఆది కాగలిగి నది మరొకటి లేదు. కాబట్టి దానికి అంతము కూడా లేదు. పెరిగినంత వరకూ పెరిగి వికసించినంతవరకూ వికసించి, పరిపూర్ణమైన తన ప్రభావముతో ప్రపంచానికి కూడా సంపూర్ణతను అందించే ఈ పరమ తత్వాన్నే "విద్య" అందురు.

ఎందరో మహానుభావులు, విశ్వసౌందర్యములోని పరమ రహస్యాలను హృదయాకారములో అవగాహన చేసుకొని, లోక కల్యాణార్థమై తమ అనుభూతిని వాగ్విభూతిగా లోకానికి చాటింపజేసినది విద్య. వేదములో ప్రధానమైనది నాదము. ఈ నాదము విని ఆనందించవలసినదే కాని దానిని విమర్శించవలసినది కాదు. అందువలననే దానికి శృతి అనే పేరు వచ్చినది. శ్రవణ మాత్రము చేత లోపలి ఆత్మానుభూతిని బయటికి ఆవిర్భవించి అపార రమణీయంగా ఆనందాన్ని అందించేది విద్య..

(వి.వా.పు.1)

 

ఆధ్యాత్మిక గుణమును, స్వభావమును లేక పరమాత్మ యొక్క తత్వమును నిర్ణయించునది విద్యాతత్వము, నీతి సూత్రాలశాస్త్రము. ఇది ప్రత్యక్ష ప్రమాణముగల విద్య, మతము యొక్క సమ్మతమే విద్యాతత్వము, జన ప్రియముగా వేసి ఆ ప్రకారముగా జీవించుటే తత్వము. దీనినే ఫిలాసఫీ అన్నాము, ఫిలాసఫీ అంటే జ్ఞానము పై విలువ అని, జ్ఞానము మితిలేని విలువ గల నిధి. జ్ఞానముపై ప్రేమకలిగి జ్ఞాన సంపాదకై కష్టపడి పాటుపడునటే విద్య.

(వి.ఎ.పు.20)

 

విద్యానామ నరస్వరూప మధికం ప్రచ్ఛన్న గుప్తం ధనం

విద్యాభోగకరీ యశశ్శుభకరీ విద్యాగురూనాం గురు:

విద్యా బన్దుజనో విదేశగమనే విద్యాపరాలోచనం

విద్యా రాజ్యసుపూజ్యతే నహిధనం విద్యావిహీనః పశుః

 

ఈ ప్రాకృత ప్రపంచములో ప్రతి మానవునకు విద్యయే అలంకారము. ఈ విద్యయే యోగ్యమైన ధనము. ఈ విద్యయే కీర్తి, సుఖము; భోగమునకు ఆధారము. విద్యయే గురువులకు గురువు. విదేశములకు వెళ్లినప్పుడు విద్య బంధువుగా తోడ్పడుతుంది. విద్య మూడవ నేత్రము వంటిది. ఇట్టి పవిత్రమైన విద్య రాజాస్థానమునందు గౌరవము నందుకునేందుకు మహాపాత్ర ధరించినది. విద్యకు యిచ్చిన ఘనత ధనమునకు లేదు. ఇట్టి పవిత్రమైన విద్యలేని మానవుడు కేవలము పశు సమానుడు.

(భ.మ.పు.1)

 

సుఖార్థీ త్యజతే విద్యా విదార్థీ త్యజతే సుఖం

సుఖార్థిన: కుతో విద్యా కుతో విద్యార్థినః సుఖం.

సుఖము కోరువాడు విద్యను పొందలేదు. నిజముగా విద్యార్థి సుఖమును ఆశించడు. విద్యను పొందినవానికి సుఖము అక్కరలేదు. సుఖము నాశించువారు విద్యను పొందలేరు.

(భ.మ.పు.89)

 

సద్గుణంబులు సద్భుద్ధి సత్యనిరతి

భక్తి క్రమశిక్షణ కర్తవ్య పాలనములు

నేర్పునదే విద్య విద్యార్థి నేర్వవలయు.

(బృత్ర. పు.179)

 

శిక్ష అనగా విద్య. విద్య కేవలం పుస్తకాలు చదవటం కాదు. విద్య గురువు ఆజ్ఞను శిరసావహించి, గురువు ఆజ్ఞాపించిన శిక్షలన్నిటిని మనసారా స్వేకరించటమే నిజమైన విద్య.

(బృత్ర.పు.174)

 

ఎన్ని విద్యలైన ఏ పార చదివినా పొట్టకూటికే గాని, గిట్టబోపు, మట్టి బొమ్మలోని మర్మంబు నెరుగని చదువెలెల్ల పరము చేర్చగలవా?

(సా. పు.47)

 

ఆధునిక విద్య పెరిగెను అంతులేక

ఆత్మవిద్య క్షీణించె అంతులేక

సత్య ధర్మములన్నియు సమసిపోయె

ప్రేమ శాంతి ఆహింసలు పేద పడియె

 

ఆధునిక విద్య (Materialism) అణువు (Atom) తో ఆగిపోయింది. అంతులేకుండా పెరిగింది.దానితోబాటు కోరికలు పెరిగిపోయినాయి. Where materialism ends, Spiritualism begins. దృశ్య ప్రపంచము అంతంనుంచే ఆధ్యాత్మికతత్వం మొదలు పెట్టును. ఆత్మ విద్య అనగా బ్రహ్మవిద్య.ఇది సత్యము, ధర్మము, ప్రేమ, శాంతి అహింసలు మీద ఆధారపడి యుంటుంది. ఇవి కంటికి అగపడేవి కావు. ఆచరణకే అందుతాయి. (1) బ్రాహ్మణః పరమాత్మనః విద్యా బ్రహ్మవిద్యా = బ్రహ్మము అనగా పరమాత్మ యొక్క సంబంధమైన విద్య బ్రహ్మవిద్య. (2) “ఏకాక్షరం పురుషం వేదసత్యం" ఇది శ్రుతేః పరమాత్మను బోధించుటయే విషయముగా గల విద్య. 3. బ్రహ్మణానా అగ్రజేన ఉక్తా (విద్యా) ఇది బ్రహ్మవిద్యా = ఆది యందు -స్వయంభువగు బ్రహ్మచేత చెప్పబడిన విద్య కనుక బ్రహ్మవిద్య,

(సా.పు.66)

 

మానవుడు సృష్టికి బంధితుగాక, సృష్టికి అధికారి అయిన ఈశ్వరత్వాన్ని తనలో ఆవిర్భవింపచేసేది విద్య, నైతిక పరివర్తన కంటే ఆధ్యాత్మిక పరివర్తనమే అత్యంతఉత్తమమైనదన్న సూత్రాన్ని నిరూపించేది విద్య. యావత్తు - సృష్టిలో మానవులను కట్టి వుంచే సమత్వమే విద్య లక్ష్యం. సామాజిక తత్వంలో ఈశ్వరతత్వాన్ని ఆవిర్భవింపచేసే సమత్వాన్ని గుర్తింప చేసేది విద్య. ఇట్టి పవిత్ర విద్యలను -గరపి విద్యార్థులను గృహస్థ ఆశ్రమమునకు, పంపించేముందు మున్ముందు నడుచుకోవలసిన పవిత్ర మార్గములను సూచించేది. స్నాతకోత్సవము. "జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపీ గరీయసీ" దేశమంటే మానవులన్న సత్యాన్ని గుర్తించాలి. మాతృభూమి దుఃఖాన్ని నివారింపచేసేవారెవరు? విద్యార్థులేకదా! క్రమశిక్షణ లేకపోతే, మానవుడు పశువుగా మారిపోతాడు. పశుపతిగా వుండాలి కాని పశువుగా వుండకూడదు. విద్యతో వినయ విధేయతలు, మానవత్వము. వివేక విచక్షణలు వుండాలి. అటువంటి విద్యార్థులు కావాలని మావుద్దేశము. అర్థంచేసుకున్న దానిని ఆచరణలో పెట్టాలి. ఆచరణలో పెట్టిన దానిని హృదయానికి హత్తుకునేటట్లు అనుభవించాలి, మితిమీరిన కోర్కెలు వుండకూడదు. తల్లితండ్రులకు దుఃఖం కలిగించరాదు. మీ తల్లితండ్రులకు మీరు ఎంత ఆనందము కలిగిస్తే మీ బిడ్డలు మీకు అంత ఆనందము అందిస్తారు. "మాతృదేవోభవ! పితృదేవోభవ ఆచార్య దేవోభవ! అధితిదేవోభవ" ఈ నాలుగింటిని మీరు శ్రద్ధగా ఆచరించి, దేశానికి ఆదర్శాన్ని అందించగలరని ఆశిస్తున్నాను.

(సా.పు.120)

 

దుర్భుద్ధులు తలనున్న

దూరులు విను చెవులున్న

పొంచి చూచు కనులున్న

వంచించే మనసున్న

ఈ వికృతులను చూడగానె

విద్య ఇక బ్రతుక దన్నా!

(స.సా.డి.96 పు.321)

 

విద్యార్థులారా! మీ విద్య పొట్టకూటికోసం నేర్చే విద్యకాదు. జీవిత పరమావధి నిమిత్తము ఏర్పడినదే విద్య. జీవనోపాధి నిమిత్తమై ఏర్పడినది కాదనే సత్యాన్ని మీరు గుర్తించాలి. జీవించటానికి మనిషిగా పుట్టనక్కరలేదు. పశుపక్షి మృగాదులు జీవిస్తునే వుంటున్నాయి. జీవించటానికి ఉపయోగపడే విద్య లభ్యసించటంచేత మనము పశువుతో సమానమవుతాము. విద్యార్థులది ఆదర్శవంతమైన జీవితముగా రూపొందాలి.....

 

మనము artificial విద్య అందుకుంటున్నాము. అది Heart వరకు పోవటం లేదు. Heart is inside, art is outside. బాహ్యదృష్టియందే జీవితమును ప్రసరింప చేస్తున్నాము. అంతరృషిని అభివృద్ధి పరుచుకోవటం లేదు.

(బృత్ర.పు.87)

 

నేటి విద్య తెలివి తేటలనే పెంచు

కొంచమైన గుణము పెంచబోదు

కోటి విద్యలుండి గుణము లేకున్నచో

ఫలమదేమి వాని విలువ దేమి?

(బ్బ.త్ర.పు.52)

 

విద్యయే మానవునకు సౌందర్యము. విద్యయే మానవునకు గుప్త ధనము.విద్యమానవునకు కీర్తి, సుఖభోగములను అందించునది. విద్య గురువునకు గురువు. విదేశములకు వెళ్ళినప్పుడు మానవునకు ఒక బంధువు వంటిది విద్య, విద్య మరోకనేత్రము. రాజులతో పూజింపబడునది విద్య - ధనము కాదు. ఇట్టి పవిత్రమైన విద్యయే లేకుండిన మానవుడు వింత పశువనేచెప్పవచ్చును. విద్య మానవునకు వినయమును మాత్రమే అందించునది కాదు. విద్య యొక్క లక్ష్యము భౌతిక జ్ఞానమును అందించుటయే. భౌతిక జ్ఞానముతో బాటు వినయవిధేయతలను, శీలమును అందిస్తుంది. ఇటువంటి పవిత్రమైన విద్యయొక్క తత్త్వాన్ని ప్రతివ్యక్తి గుర్తించుకొనుట అత్యవసరము.

 

ఈనాటి విద్యార్థి కలిమిని, బలిమిని, చెలిమిని ఆశిస్తున్నాడే కాని ఏ మాత్రము గుణమునకు ప్రయత్నించుటలేదు. గుణార్జన నిమిత్తమేర్పడినది విద్యగాని, ధనార్జన నిమిత్తమేర్పడినది విద్యకాదు".ఈ సత్యాన్ని ప్రతి విద్యార్థి చక్కగా గుర్తించి వర్తించాలి. మెదడునకు విషయమును అందించుట మాత్రమే విద్య యొక్క లక్ష్యము కాదు. హృదయాన్ని పవిత్రముగావిస్తుంది.

(స.పా.డి.1990పు.316)

 

పవిత్రమైన శీల సంపద లేకుండిన, మానవత్వములోని విద్యలన్నియు నిరుపయోగములే, వ్యక్తిత్వాన్ని పోషించి దివ్యత్వాన్ని వికసింప జేసి, మానవత్వాన్ని రాణింపజేసేదే విద్య.

 

విద్యయందు రెండు ప్రధానమైన గుణములు కలవు. ఒకటి విషయాన్ని వివరించి చెప్పుతుంది. రెండవది జీవిత వ్యక్తిత్వాన్ని వికసింపజేస్తుంది. ఒకటి Matter రెండవది Energy. ఈ పదార్థశక్తుల సమ్మిళితమైన స్వరూపమే విద్య, ఆధ్యాత్మిక, భౌతిక సమ్మిళితమైన స్వరూపమే విద్య. కేవలముమెదడునకు మాత్రమే అందించునది విద్య కాదు. విద్య అనగా ప్రకాశమే.

(స.సా.డి.1990 పు.317)

 

విశ్వశాంతిని చేకూర్పు విధమునేర్చి

సంకుచిత భావములం దెల్ల సమయ చేసి

ఐకమత్యము సహజీవనాదికములు,

సమత నేర్పుటయే కాదె సరస విద్య.

 

విద్య డిగ్రీల కొరకుకాదు వెఱ్ఱివీడి

సేవాకా వృత్తికై మీరు చేరబోక

స్వీయ దేశ సౌభాగ్య శ్రేయ మరసి

జగతి శ్రామిక విద్యలు చదువ వలయు:

(సా .ప॥ 551, 570)

 

 

ఈనాడు నైతిక, ధార్మిక ఆధ్యాత్మిక విద్యలు లోపించుట చేతనే ఈ ఆత్మవిద్యగాక లౌకిక విద్యగా రూపొందుతోంది. అని గవర్నరు గోవిందనారాయణ చెప్పెరు. “సావిద్యయా విముక్తయే" అనగా బంధములను, బాధలను, అంధకారమును నిర్మూలింపచేసేదే విద్య. అని అర్థము. మానవత్వమనే దివ్యత్వముతో కూడిన పవిత్రత అనే సత్యమును గుర్తించుకోవటానికి "ఉత్తిష్టత, జాగ్రతప్రాప్యవరాన్ నిభోథత" అని ఉపనిషత్తులు మేలు కొలుపుతూ వచ్చాయి.

( సా. పు. 571)

 

నీతిలేని జీవితం చెల్లని కాసువంటిది. బిక్షగాడు కూడా దానిని అంగీకరించడు. సచ్చీలనము, లేని బ్రతుకు చీకటి కొంప వంటిది. ఎన్ని చదువులు చదివినా, సచ్చీలనమే భూషణం, సత్యనిరతి, క్షమశిక్షణ. కర్తవ్యపాలన నేర్పేదే నిజమైన విద్య

(సా.. పు. 227)

 

విద్య జీవితం కోరకు
        జీవితం ప్రేమకొరకు
ప్రేమ  మానవుని సేవకొరకు
          మానవుడు సేవకొరకు
సేవ సమాజము కొరకు
           సమాజం దేశo కొరకు
దేశo ప్రపంచం కొరకు
           ప్రపంచం శాంతికొరకు. 
(స. సా . మే 2021 పు 13)

 బహుళ విద్యలయ్యే వాంఛలు మితిమీరే
బ్రతుకు  ఆడo బరాలతో భారమాయె .
( సనాతన  సారధి మే  పు 14 )

 

పొట్టకూటికి చే కూర్చునట్టి విద్య

నీతి ధార్మిక దృష్టిని నేర్పగలదా

సహజ ధార్మిక దృష్టినే చంపివేయు

సత్యమును తెలుపు బాట ఈ సాయిమాట

(శ్రీవాణి జూన్ 2021 పు. 5 )

  

"సద్విద్య ఉన్నచో సంస్కారమబ్బును

సంస్కారమున్న జన్మయే జన్మ:

సద్విద్య యున్నచో సౌఖ్యంబు చేకూరు

సౌఖ్యంబువల్లనే కలుగు శాంతి;

సద్విద్య యున్నచో సత్సంగమబ్బును

సత్సంగమున్నచో సద్గుణములు కలుగు

సద్గుణమున్నచో జన్మ సార్థకమగు

జన్మసార్థకముచే కలుగు ముక్తి;

సత్యనిత్యమైన చదువును చదివిన

సారరహిత సంసార సాగరమున

మునిగి తేలక మోక్షము పొందగలరు

కాన ఇటువంటి చదువుకై తరలిరండు”

( సనాతన సారధి మే పు 14 )

 

“కృషి కూటికోసం, విద్య విజ్ఞానంకోసం” విద్య కూటికోసం కారాదు. కాని ఈనాటి ఎడ్యుకేషనంతా పొట్టకూటికోసమే.

“జేనెడు పొట్ట నింపుకొన చిక్కుల నొందుచు , కోటి విద్యలన్
పూనిక మీర నేర్చి పరిపూర్ణ సుఖంబుల పొందలేక యీ
మానవజాతి దుఃఖముల మ్రగ్గగ నేటికి ? శ్రీపరాత్పరున్
ధ్యానము చేయ భక్తులకు దారిని చూపక యున్నె మానవా”
(శ్రీసత్యసాయి విద్యార్థి వాహిని పు 90)

 

“మనం బానిసలం కాకూడదు. పశువులు బానిసలై ప్రపంచానికి అణిగి ముణిగి ఉంటున్నాయి. మానవుడు మాధవుడుగా, నరుడు నారాయణుడుగా మారి ఈ ప్రపంచాన్ని పాలించాలి. జగన్నాయకుడుగా తయారు కావాలి. అనువుగా కాక పశుపతికావాలి. పరమేశ్వరుడుగా తయారుకావాలి. అందుకు తగిన విద్య ఈనాడు అభ్యసించాలి. అదే ‘ఆధ్యాత్మిక విద్య, ఆధ్యాత్మికవిద్యా విద్యానాం అది ఎన్ని విద్యలకు తలమానికము”. -బాబా (సాలీత పు165)

 

"మేలు చేసినవానికి కీడు చేయు
కూడు పెట్టినవానినే కూలద్రోయు
విద్య నేర్పినవానినే వెక్కిరించు
ఇదియె ప్రోగ్రెస్సు ఈనాడు విద్యయందు!” – బాబా
(సనాతన సారథి, సెప్టెంబరు 2021 పు13)


About Us

Sri Tumuluru Krishna Murty and his late wife, Smt. Tumuluru Prabha are ardent devotees of Bhagavan Sri Sathya Sai Baba

Read More

Reach Me

Sri Tumuluru Krishna Murty

E-mail : hello@srisathyasaidigest.com

Subscribe For Contemplate Massage