మాట చెప్పినట్లు మనుజుండు నడచిన
మనిషి కాదు వాడు మహితుడగును
మాట చెప్పినట్లు మనిషి నడువడేని
మనిషి కాదు వాడు మృగమె కాని.
ఈనాటి మానవ సమాజములో మాటకు క్రియకు సంబంధములేదు. మాట క్రియతో కూడిన సత్యము. మనసు మాట క్రియతో కూడిన ఋతము. విద్యార్థులు దేశాభిమానాన్ని దేశౌన్నత్యాన్ని దేశకళ్యాణాన్ని మనసునందుంచుకొని ప్రవర్తనయందు ఆదర్శ జీవితాన్ని అందించాలి. ఈ నాటి విద్యార్థులు ఇంద్రియ నిగ్రహమంటే ఏమిటో తెలియదు. దీనికి సంయమము అని పేరు. సంయమము మానవునికి మాత్రమే చెందినది. ఇంద్రియములను అనుసరించి స్వేచ్ఛా విహారం జరపటంచేత మానవుడు తన దివ్యత్వాన్ని కోల్పోతున్నాడు. ఇట్టి ఇంద్రియ నిగ్రహమునకు సంస్కృతమునందు దమము అని పేరు. ఈ దమమును సాధించిన వాడే దాంతుడు. ఈనాడు లోకానికి దాంతులు కావాలి కాని వేదాంతులు అక్కరలేదు. ఈనాటి వేదాంతము మాటలలో మాత్రమే జరిగి పోతున్నది. వాచాలత్వము అధికమై పోతుండాది. ఆడంబరములు అధికమై పోతున్నాయి. ఆచారములు సన్నగిల్లుతున్నాయి? కనుకనే ఆనందము శూన్యమౌతుండాది.
(బృత్ర.పు. 100)
దమమనగా యింద్రియ నిగ్రహము, దమమనేది లేకపోతే యేమవుతుంది? మొన్న చెప్పినట్టుగా దమ ము త్రిప్పి చదివితే మద అయిపోతుంది. మదమనగా యేమిటి?ఒక దుర్గుణమును పెంచుకోవటము. దమమును సంపాదించుకున్న వానికి రెండవ పేరు సాక్షర అని యింకొకటి వుంటుండాది. సాక్షర యనే దానిని కూడ త్రిప్పి చదివితే రాక్షస అవుతుంది. మనము రాక్షసత్వమునకు పోకుండా దమమును అనగా యింద్రియములను అదుపులో పెట్టుకున్నామంటే నిజమైన ధర్మమును పోషించినవారమవుతాము. అన్నింటికి యింద్రియ నిగ్రహము అత్యవసరమని కృష్ణుడు అర్జునునికి బోధించాడు. అర్జునునితో ఇంద్రియ నిగ్రహము గావించుకొని నీవు స్థిత ప్రజ్ఞుడవు కమ్మని చెప్పాడు.
(శ్రీ...పు.233)
(చూ|| ఆధాతో బ్రహ్మజిజ్ఞాన)