పిప్పిని త్రిప్పికొట్టి చెరకునందలి రసమనే మానవులు జఱ్ఱుకొను నటుల పుష్పము యొక్క అందచందములు చూడక, తుమ్మెద అందలి మధువునే గ్రోలినటుల, అగ్ని ప్రమాదమును యోచించక ప్రకాశమునే ఆకర్షించి మిడత దీపమును చేరునటుల, సాథకులు కావ్యమునందలి కరుణారసమునే లక్ష్యమందుంచుకొని మిగిలిన విషయములను విసర్జించవలెను.
(రా.వా.మొ.పు.3)
మనం లక్ష్యాన్ని గుర్తించాలి. సత్యాన్ని అర్థం చేసుకోవాలి, నిత్యములో చేరాలి. ఇది మానవుని ప్రధానమైన కర్తవ్యము. చలించని మనసును భ్రమించని దృష్టిని సాధించుటయే సరియైన లక్ష్యము.
(శ్రీ స.వి.వా.పు.16)
మన విద్య ఆత్మ విద్య. దీనిద్వారా మనము పవిత్రమైన ఆదర్శవంతమైన జీవితాన్ని లోకాని కందించాలి. జానెడు పొట్ట నింపుకునే కోసమని రెండు చేతులు నిచ్చాడు. రెండు చేతులనిండుకు పని దొరికతే పని చేస్తే, కష్టపడి శ్రమిస్తే, పొట్టనిండదా? మనము రెండు చేతులతో శ్రమించి పనిచేయటం లేదు. కనుకనే మనము ఈ అవస్థలకు గురియైపోతున్నాము. “కర్మణ్యేవాధికారస్తే” కర్మనే మనకు ప్రధానమైన లక్ష్యము. పవిత్ర కర్మలు ఆచరించాలి. ఆదర్శవంతమైన కర్మలు ఆచరించాలి. అన్యులకు సహాయకరమైన కర్మలు ఆచరించాలి. లోకోద్ధారమునకు మనము జీవితము అంకితము చెయ్యాలి..
మన సంస్థకు కాని, మనం ఎవరినుండి ఇంత స్థాయికి వచ్చామనే విషయం కాని ఆ కృతజ్ఞతను విద్యార్థులు మరువరాదు. అదేనిజమైన దీక్ష. నిజమైన త్యాగము, స్వార్థాన్ని త్యాగము చేసి, పరార్థాన్ని విశ్వసించి, పరమార్థాన్ని పొందాలి.
(బృత్ర.పు. 166/167)
(చూ॥ ఆధ్యాత్మికము, దూషించుట, యుగలక్ష్యం, సందేశము, సమాజము, హిరణ్యగర్భతత్త్వం)