బ్రహ్మవిద్య మానవాతీతమైనది కాదు. ఇది నిత్యజీవితంలో మానవుని సత్యమార్గమున నడిపించి, వ్యక్తిత్వాన్ని పోషించే సహజమైన సాధనయే. ఇట్టి సాధనాసంపత్తిని మానవుడు దినదినాభివృద్ధి చేసుకోవాలి. అనంతమైన బ్రహ్మచర్యము నకు ఉపనిషత్తు మూడు విధములైన రూపములను నిరూపిస్తూ వచ్చింది. 1. విరాట్టుడు. 2. హిరణ్యగర్భుడు. 3. ఆవ్యాకృతుడు. ఈ మూడు రూపముల స్థూల, సూక్ష్మ, కారణములకు సంబంధించినటువంటివి; జాగ్రత్, స్వప్న, సుషుప్తులతో చేరినటువంటివి.
విరాట్టుడు అనగా స్థూలమైన స్వరూపాన్ని ధరించి, భౌతిక శరీరంతో తాము దీర్ఘాయుష్మంతుడుగా ఉంటుంది, జాగ్రతావస్వరూపుడైన ఆత్మ తత్త్వమునకు - "విరాట్ స్వరూపుడని పేరు. ఇతను వివిధ రూపములను ధరించి, వివిధ నామములతో ప్రకటితమౌతుంటాడు. అనగా, పిపీలికాది బ్రహ్మ పర్యంతమును. ఆకాశాది పంచ భూతములను, చరాచర ప్రపంచమంతటిని తన రూపములుగా నిరూపిస్తూ - "సర్వం విష్ణుస్వరూపము" అనే సత్యాన్ని తాను ప్రకటించుట చేతనే ఇతనిని - “విరాట్ స్వరూపుడు " అన్నారు. అంటే కొండలు, గుట్టలు, నదులు, పర్వతాలు మొదలైన దృశ్య కల్పిత జగత్తంతా "విరాట్ స్వరూపమే". ఇది, అది అనే భేదము లేకుండా ఏదైతే కనిపించునో, అదంతయు విరాట్ స్వరూపుని అంశమే. కనుక, విరాట్టుడు అనగా, బాహ్యజగత్తునకు సంబంధించి స్థూలమైన జగత్ స్వరూపాన్ని ధరించి, తాను ఈ జగత్తునకు ఆదర్శాన్ని అందిస్తుంటాడు.
ఈ విరాట్టునికి మరిరెండు పేర్లు కలవు. 1. వైశ్వానరుడు 2. విరాజనుడు. వైశ్వానరుడు అనగా ప్రతి వ్యక్తియందు "నేను, నేను" అనే పదము చేత నిరూపించబడేవాడు. రాజు మొదలుకొని రైతులవరకు, నిరుపేద మొదలుకొని శ్రీమంతునివరకు, బాలుని మొదలుకొని వృద్ధుని వరకు ప్రతి ఒక్కరూ తనను తాను పరిచయం గావించుకొనే సమయంలో "నేను" అనే పదమును ఉపయోగపడతారు. కాబట్టి, ఈ "నేను" అనే పదము సర్వజీవుల యందు ఉంటున్నది. ఈ విధంగా సర్వజీవుల యందు నేను అనే పదమును ఉచ్చరించే వాడే వైశ్వానరుడు.
విరాట్టునికి మరొక పేరు విరాజనుడు. ఇతడు విచిత్రమైన స్వరూపమును ధరించినవాడు. ఇతడు అందరి యందుండి కూడను తాను లేనట్లుగా, అన్ని పనులు చేస్తూ తాను చేయనట్లుగా, అన్నింటిని అనుభవిస్తూ తాను అనుభవించ నట్లుగా ఉంటాడు. ఈ విధమైన రూపాన్ని ధరించినవాడు కనుకనే ఇతనికి విరాజనుడని పేరు. కనుక విరాట్టుడు, వైశ్యానరుడు, విరాజనుడు అనే వివిధ నామములన్నీ ఒక్కరికి సంబంధించినవే.
ఇంక రెండవది హిరణ్యగర్భుడు. ఇతడు సమస్త జ్ఞానానికి ఆది, నైతిక, భౌతిక, ధార్మిక, ఆధ్యాత్మిక, వైజ్ఞానిక జ్ఞానములన్నీ హిరణ్యగర్భుని నుండే ఆవిర్భవించినవి. అందుచేత ఇతనినిజ్ఞానభాస్కరుడని కూడా పిలువవచ్చును. ఉదయించేటప్పుడు భాస్కరుడు హిరణ్మయ స్వరూపాన్ని ధరిస్తూ ఉంటాడు. ప్రకృతిని కూడా హిరణ్మయంగా మారుస్తాడు. కనుక హిరణ్య గర్భునకు జ్ఞానభాస్కరుడనే పేరు సరియైన అర్థాన్ని అందిస్తుంది. సమస్త సృష్టి ప్రప్రథమములో హిరణ్యగర్భుని నుండియే వచ్చినది. హిరణ్యగర్భుడనేది ఒక "బంగారు గుడ్డు" ఆకృతిని కలిగియుంటుంది. ఈ విధమైన ఆకారము నుండి మొట్టమొదట నోరు పుట్టింది.దాని నుండి శబ్దము ప్రారంభమైనది. తదుపరి నాసిక పుట్టింది. దాని నుండి గాలి ప్రారంభమైనది. తదుపరి కన్నులు పుట్టాయి. కన్నుల నుండి అగ్ని ప్రారంభమైనది. తరువాత చెవులు పుట్టాయి. అప్పుడు దిక్కులన్ని ప్రారంభమైనాయి. ఈ విధంగా మానవజీవితానికి హిరణ్యగర్భుడు మూలాధారుడు. ఇతని నుండియే సమస్త జీవులుఉద్భవిస్తూ వచ్చాయి. ఈ సమస్త జీవులకు నిత్యానిత్య విషయ పరిశీలన చేసే విజ్ఞాన, ప్రజ్ఞాన సుజ్ఞానములను హిరణ్యగర్భుడే ప్రసాదించాడు. మానవుడు దేనిని చేయవచ్చును? దేనిని చేయ కూడదు? దేనిని పొందవచ్చును? దేనిని పొందకూడదు? అనే విషయాలలో మానవుని సరియైన మార్గంలో ప్రవేశింపచేయటానికి తగిన జ్ఞానాన్ని మానవునికి అందిస్తున్నాడు. ఇది హిరణ్యగర్భుని ప్రధానమైన క్రియ.
హిరణ్యగర్భు నకి మరి రెండు పేర్లు కలవు. 1. సూత్రాత్మకుడు. 2. ప్రాణుడు. సూత్రాత్మకుడు అనగా - మణులలో సూత్రము ఏరీతిగా ప్రసరిస్తూ ఉంటుందో, అదే విధముగా ప్రతి మానవుని యందు హిరణ్యగర్భుడు ఒక సూత్రరూపమును ధరించి అందరి యందు సమత్వంగా ప్రసరించేవాడు. దీనినే " బ్రహ్మసూత్రము" అని చెప్పవచ్చును. "వీరు వారు" అనే భదము లేక సర్వులు యందు సమముగా చేరియుండి, సమత్వాన్ని చాటే తత్వం హిరణ్యగర్భతత్త్వం. ఈ విధంగా హిరణ్యగర్భుడు భేదరహితమైన సృష్టిని జగత్తునకు నిరూపిస్తూ వచ్చాడు.
హరిణ్యగర్భునికి మరొక పేరు ప్రాణుడు. హిరణ్యగర్భుడు సూక్ష్మాకారములో స్వప్నావస్థయందు ఆత్మస్వరూపాన్ని ధరించినవాడు. కనకనే, నిద్రావస్థయందు, స్వప్నావస్థయందు హిరణ్యగర్భుడు మేల్కొని ఉంటాడు. జ్ఞాగ్రదావస్థ యందు విరాట్టుడు సర్వమూ సృష్టించితే, హిరణ్యగర్భుడు సర్వమును సంకల్పము చేత సృష్టించుకొంటాడు. స్వప్నములో దేవిని చూసినప్పటికీ అది హిరణ్యగర్భుని సృష్టియే కనుక, సూక్ష్మమైన హిరణ్యగర్భుడు స్వప్నావస్థ యందు సమస్త జగత్తునూ సృష్టిస్తున్నాడు.
ఇంక మూడవది అవ్యాకృతుడు. అవ్యాకృతుడనగా ఎట్టి ఆకారం లేనివాడు. ఎట్టి విశ్లేషణకు లొంగని వాడు. ఈతడు కారణశరీరము నందు పరిపూర్ణమైన రూపరహితుడై సుషుప్తిస్థితిని అనుభవిస్తుంటాడు. ఇతనికి ఎట్టి ఆకారము లేదుగాని, అన్నింటిని తన స్వాధీనము చేసుకొంటున్నాడు, ఇతనికి కరచరణాది అవయవములు లేవుగాని, అన్ని పనుల తాను చేస్తున్నాడు. అనేక దూరములు ప్రయాణము సల్పుతున్నాడు. ఇతనికి నేత్రములు లేవుగాని అన్నింటిని చూస్తున్నాడు. శోత్రములు లేవుగాని సర్వమును వింటున్నాడు. ఈ విధంగా, అకారరహితుడై సృష్టికి సంబంధించిన సమస్తము ఆచరిస్తున్నాడు. కనుక, ఇతనిని "అవ్యాకృతుడు" అని పిలుస్తూ వచ్చారు.
అవ్యాకృతునకు మరి రెండు పేర్లు ఉంటున్నాయి. 1. అంతరాత్మ, 2. ఈశ్వరత్వం. అంతరాత్మ అనగా తన నుండి అన్నింటిని ప్రేరణ చేసేవాడు. ప్రతి ఒక్క ప్రేరణ అంతరాత్మ నుండియే ప్రారంభమౌతున్నది. అదే అంతర్వాణి. ఈ అంతర్వాణికి ఆధారభూతుడు అంతరాత్మనే. మానవుని యందు ఆవిర్భవించే సమస్త శబ్దములు అంతరాత్మ నుండియే ఆవిర్భవిస్తున్నాయి. అవ్యాకృతునకు రెండవ పేరు ఈశ్వరుడు. ఈశ్వరుడనగా సకలైశ్వర్యస్వరూపుడనే పేరుండి నప్పటికీ, ఈ పరిస్థితి యందు తానొక శిక్షా ప్రదాతగా ఉంటాడు. మంచి చెడ్డలను విచారణ సల్పి ఇతడు శిక్షను అందిస్తాడు. ఇతనినే లోకులు "లయకారకుడ”ని పిలుస్తూ వచ్చారు. సకలైశ్వర్యస్వరూపుడైన ఇతడు తన యందున్న క్రియాశక్తి చేత మానవుని మంచి చెడ్డలను ని ర్ణ యం చేసి తగిన ఫలాన్ని అందిస్తుంటాడు. ఐశ్వర్యము నందించేవాడనగా ఏమిటి? మంచి - చెడ్డ రెండూ ఐశ్వర్యములే. కనుకనే, మానవుని మంచి - చెడ్డలను తాము గుర్తించి, తగిన ఫలితాన్ని ఇస్తాడు.
ఈ విరాట్టుడు, హిరణ్యగర్భుడు, అవ్యాకృతుడు వేరే ఎక్కడ ప్రత్యేకంగా లేరు. వీటిని సూక్ష్మ రూపంలో విచారణ సల్పినప్పుడు ప్రతి మానవుడు విరాటస్వరూపుడే, ప్రతి మానవుడు హిరణ్యగర్చుడే, ప్రతి మానవుడు అవ్యాకృతుడే. ఐతే, మనం ఆల్ప మైన మార్గములో ప్రవేశించుట చేత అనంతమైన తత్త్వాన్ని అర్ధం చేసికొనలేకపోతున్నాము. శరీరాన్ని అనంతంలో గుణించినప్పుడు విరాటస్వరూపుడౌతాడు.
శరీరము X అనంతము = విరాట్టుడు;
మనస్సు X అనంతము = హిరణ్యగర్చుడు
జీవితము X అనంతము = అవ్యాకృతుడు.
ఈ మూడు స్థూల, సూక్ష్మకారణములలో చేరి నటువంటివి. 1. దేహమునకు సంబంధించినది విరాట స్వరూపము. 2. మనస్సునకు సంబంధించినది హిరణ్యగర్భస్వరూపము. 3 జీవితమునకు సంబంధించినది అవ్యాకృతస్వరూపము. అయితే, ఈ మూడు కూడా ఒక్క మానవునితో కూడినటువంటివే.
(స.సా.జ. 92. పు. 10/12)
జీవేశ్వరులను రెండు పక్షులునూ, శరీరమను ఒక వృక్షమునే ఆశ్రయించి ఉన్నవి. జీవుడు కర్మఫలమును అనుభవించును. ఈశ్వరుడు దూరమునుండి చూచుచూ సాక్షిభూతుడగును. జీవుడు శరీరధర్మములలో ఐక్యమై దుఃఖమును అనుభవించుచున్నాడు. ఏనాడు తానే ఈశ్వరుడని తెలిసికొనునో అప్పుడు శోకవిముక్తిని పొందుచున్నాడు. ఈశ్వర జ్ఞానేచ్ఛచే వశీకృత చిత్తుడైనవానికి విషయేచ్ఛ నశించి ఆత్మజ్ఞానము కుదురును. అట్టి పవిత్రబ్రహ్మవిద్యోపదేశమే ఈ ముండకోపనిషత్తు యొక్క ఉద్దేశమని చివర మంత్రమునందు తెలుపబడినది. ముండమన శిరస్సు;ఉపనిషచ్చిరోభూషణ మగుటంచేసి ఇద్దానికీ నామము కలిగినట్లు తెలిసికొన వచ్చును. ఆగ్నిని శిరస్సునందు ధరింటచు యే ముఖ్య లక్షణముగా యథావిధిగా నాచరించినవారికే బ్రహ్యవిద్య బోధ కాగలదనికూడ దీని భావము. ఈ ఉపనిషత్తులో మంత్రవిచారము కొరకు బ్రహ్మసూత్రముల యందలి రెండధికరణములు వినియోగింపబడినవి. ఈ ఉపనిషత్తులో రెండేసి ఖండములుగా మూడు ముండకములు గలవు. ప్రధమ ముండకము ప్రథమ ఖండమున పరాపర విద్యలును, రెండవ ఖండమున పరబ్రహ్మప్రాప్తి హేతవగు కర్మమును కర్మ ప్రతిపాదక మగు శబ్దము సామాన్యముగ మంత్రములలో చెప్ప బడినవి. ఇవియే కర్మ కాండమునం దెక్కువ వినబడుచున్నవి. ఉపనిషత్తు మంత్రములన్నియు బ్రహ్మవిద్యా ప్రతిపాదములగుటచేసి పవిత్ర సూచకము లగుచున్నవి.
(ఉ.వా.పు.22/23)
“విత్” అను ధాతువునకు "య" అను ప్రత్యయము చేర్చి నపుడు "విద్య" అను పదము యేర్పడుచున్నది. "య" అనగా ఏది, "విత్" అనగా వెలుగు. యేది వెలుగును ఇచ్చునో అది విద్య అని ఉత్పత్తి అర్ధము. కనుక విద్యపదము బ్రహ్మవిద్యకు మాత్రమే తగినది. జ్ఞానమును వెలుగుగా అజ్ఞానమును చీకటిగా పూర్వీకులు పేర్కొనిరి. ప్రకాశ అంధకారములు యెట్లు ఒకే కాలములో ఒకే స్థానమున నిలువజాలవో అట్లే విద్య అవిద్యలు రెండూ ఒకే కాలమున, ఒకే స్థలమున నిలువజాలవు. కాన ప్రగతి పథమున పయనించు ప్రతి మానవుడు బ్రహ్మవిద్య నభ్యసించి పరిశుద్ధాత్ముడు కావలెను.
(వి.వా.పు.53)
వరుణ పుత్రడగు భృగువనువాడు "పూజ్యాడవగు ఓ తండ్రీ! నాకు బ్రహ్మము ముపదేశింపుడు " అని తండ్రిని సమీపించి ప్రార్థించెను. అపుడు అన్నము. ప్రాణము, చక్షువు, శ్రోత్రము, మనస్సు, వాక్కు అని వరుణుడు పుత్రున కుపదేశించెను. మరి దేనివలన ఈ భూతములుత్పన్నమగుచున్నవో, అది బ్రహ్మమని తెలిసికొనుమని అతడు తెలియజెప్పెను. భృగువు ఈ రెండు వాక్యములు తండ్రివలన విని తప మొనరించి అన్నమే బ్రహ్మమని తెలిసికొనెను.
ఏలయన ఈ భూతము అన్నమువలననే పుట్టుచున్నవి. పుట్టిన భూతము లన్నముచేతనే జీవించుచున్నవి. ఇట్లు తెలిసికొనిన భృగువు మరల తండ్రి దగ్గరకు వెళ్ళి, తనకు బ్రహ్మమును ఉపదేశింపుడని కోరెను. తపస్సుచేతనే బ్రహ్మమును తెలిసికొనమని, తపస్సే బ్రహ్మమని తండ్రి కుమారునకు తెలియజెప్పెను. అతడు తపస్సు చేసి, విజ్ఞానము బ్రహ్మమని తెలిసికొనెను. విజ్ఞానము వలననే భూతము లుత్పన్నమగుచున్నవి. విజ్ఞానముచే జీవించుచున్నవి. విద్యలలో కెల్లా ఉత్కృష్టము, పవిత్రము, పరమరహస్యమగు బ్రహ్మవిద్యమ సంప్రదాయ సిద్దముగా తెలిసికొనెను.
అన్నమును నిందింపకూడదు. అది బ్రహ్మవిదునకు వ్రతము. ప్రాణమే అన్నము. శరీరమన్నాదము. ప్రాణమునందు శరీరము ప్రతిష్టితమయి యున్నది. అందువలన అన్నమును పరిహసింపకూడదు. అది వ్రతము. ఉదకములు జఠరాగ్నిచే జీర్ణములయి అన్న మగుచున్నవి. ఉదకములయందు విద్యుదగ్ని ప్రతిష్టితమగుచున్నది. జ్యోతిస్సునందు ఉదకములు ప్రతిష్టితములు. అందువలన ఈ యభయమునగు నన్న మన్న మునందు ప్రతిష్ఠితమగుచున్నది. ఎవడు ఆపోజ్యోతి రూపమగు నన్నమును అన్నమునందు ప్రతిష్ఠితమైన దానినిగా ఉపాసించుచున్నాడో వాడు ప్రతిష్ఠిరుడగు చున్నాడు. బ్రహ్మవిజ్ఞానమునకు అన్నము ద్వారమగుటచే నది గురుతుల్యము. దానిని నిందింపరాదు. ఉపాసకుని కిది ఒక వ్రతము. శరీరము అన్న వికారమగుటచే అన్నమయకోశమనియూ, ప్రాణాత్మకమగునది.
ప్రాణమయ కోశమనియూ, మంచి చెడుగులను విచారించునపుడు మనోమయ కోశమనియు, విచారించిన దాని పర్యవసానమును నిశ్చయించినప్పుడు విజ్ఞాన మయకోశమనియు, నిశ్చయించిన దాని ఫలముగు ఆనందము ననుభవించునపుడు ఆనందమయ కోశమనియు వ్యవహరింపబడుచున్నది.
బ్రహ్మభావముచే ఉపాసించుటకై ప్రాణమయ కోశము యొక్క పురుషాకృతిత్వము ప్రదర్శింపబడు చున్నది. ప్రాణమయకోశము శరీర పిండముకంటె నన్యము, సూక్ష్మతరము. అన్నమయకోశము తనలో ఇముడ్చుకొనియున్నది. అది వాయుమయము. దానిచే అన్నమయకోశమాపాద మస్తకము నిండియున్నది. అన్నమయకోశమున కది ఆత్మ అగుచున్నది.ప్రాణవాయువులేక అది నిలువనేరదు. ప్రాణము క్రియాశక్తి కార్యభూతము. ఈ ప్రాణము ప్రాణాపాన వ్యానోదాన సమానములను అయిదు రూపముల మారి ప్రాణమయకోశమగుచున్నది. అన్నమయ కోశమునకు ప్రాణమయ కోశము ఆత్మయను స్థిరమగు భావనచే అన్న మయకోశమునందత్మనాబుద్ది తొలగును. మూసలో కరిగించి పోసిన లోహమువలె అన్నమయ కోశము నాశ్రయించి ఆత్మభావముచే వర్ధిల్లు చున్న ప్రాణ మయ కోశము కూడా పురుషాకారమున కనిపించుచున్నది.
స్వాహారూపమగు ప్రాణవృత్తి ప్రాణమయ కోశమునకు శిరస్సు, వ్యానవృత్తి దక్షణపక్షము, అపానవృత్తి ఉత్తరపక్షము. శరీర మధ్యమున నున్న సమాన వృత్తి ఆత్మ. పృథిని దేవతాస్థితి హేతవగుటచే పుచ్చమగు చున్నది. ప్మథిని ప్రతిష్టాన హేతువు కానిచో వుదాన వృత్తిచే సర్వ గమనమెంది. బరువుచే క్రిందపడుట సంభవించును. హృద్దేశము నుండి ముఖ నాసికా మూలమున పైకి సంచరించుటచే ప్రాణ వృత్తి శిరస్సనియు అచట నుండి సర్వ నాడులయందును ప్రసరించుటచే వ్యాన వృత్తి, అధః ప్రసారముచే అపానవృత్తి, పక్షములనియు, ఉదర మధ్యమున నాభి సమీపమున నుండుటచే సమాన మాత్మ మనియు కల్పింపబడినది.
(ఉ.వా.పు.76/79)
బ్రహ్మవిద్యగూర్చి బహుళ ప్రచారమ్ము
సలుపువారు కలరు చాలమంది కాని
ఆచరించు ఘనుడొక్కడును లేడు
సత్యమైన బాట సాయిమాట.
(ఉపనిష ద్బృందావనమ్ పు 122)