నేత్రశోత్రములచే నెల్లపుడు మంగళప్రదమగు కార్యములు చూచునట్లునూ, మంగళ నాదము వినునట్లును, సర్వేశుని అనవరతము చింతన చేయుచు ఆయుష్కాలమును గడుపునట్లును, శాంతిపతనముతో ఈ ఉపనిషత్తు బోధించుచున్నది. ఇందులోఉపదేశించిన విద్య, కార్యబ్రహ్మయగు హిరణ్యగర్భు నిచే మొదట చెప్పబడుటచే గాని, బ్రహ్మమును గురించి చెప్పడుటచేగాని, బ్రహ్మవిద్య అని పిలువబడుచున్నది. పూర్తి క్షురకర్మ చేయబడిన శిరస్సునందు అగ్నిని బంధించుటయే ముఖ్య లక్షణముగా గల శిరో వ్రతము నాశ్రయించినవారు మాత్రము ఇచట బ్రహ్మవిద్య కలగుటచే ఈ ఉపనిషత్తుకు ముండకమని పేరు కలిగినది.గుణ సంవత్తిచే ఈ ఉపనిషత్తు సర్వోప నిషత్తులకూ భూషణముగా నుండుటచే కూడను దీనికి ముండకమని పేరు సమన్వయింపబడినది. ఇది అధర్వణ వేదములోనిది.
సంప్రదాయసిద్ధమై పరంపరగా వచ్చిన ఈ బ్రహ్మవిద్య, నిర్గుణ బ్రహ్మమును బోధించు పరవిద్యయనియి, ధర్మాధర్మ ఫల సాధనమగు సగుణ బ్రహ్మమును బోధించు అపరవిద్య అనియు, ఇందులో రెండు భాగములున్నవి. ఇవి రెండును శాసకుడు అంగిరమునకుపదేశించెను. వేదములతోనూ వేదాంగములతోనూ కలసిన దానిని అపరవిద్య అందురు. ఉపనిషత్తు మొదలగు శబ్దరాశియంతయూ అపరవిద్యయందురు. కానీ, అవి అపర విద్య లయినప్పటికిని, దాని బోధచే బ్రహ్మమును బోధింపచేయు విజ్ఞానము, పరవిద్య యగుచున్నది.
(ఉ.వా.పు.21)
(చూ॥ బ్రహ్మవిద్య)