‘శాస్త్రయోనిత్వాత్’ అను సూత్రము బ్రహ్మను తెలుసుకొనుటకు వేదము కారణమనియు, వేదము ద్వారానే బ్రహ్మము తెలుసుకొనగలమనియు,సర్వవేదముల చేత బ్రహ్మ వేద్యమవుతాడనియు అర్థమును వివరించుచున్నది. ఇంతేకాకదేనికి శాస్త్రము ప్రమాణమో అదే బ్రహ్మ అనియు బ్రహ్మమే వేదమునకుప్రమాణమునకు కారణమనియు అర్థములున్నవి. - సర్వజ్ఞడు తప్ప ఇతరులెవ్వరూ వేదమునకు కారణము కాజాలరనియు తెలుపుచున్నది. బ్రహ్మజ్ఞానమునకు శాస్త్రమే కారణమని కూడా అర్థమును తెలుపుచున్నది. మానవుని జీవితాన్ని నియమబద్ద మొనరించి, కాపాడునది లేక పాలించునదిగా తెలుపుచున్నది.
బ్రహ్మ ప్రతి మానవుని స్వరూపమై యున్నాడు. ప్రతి మానవుని శాస్త్రము శాసించుచున్నది. అయితే మానవుడు మాయకు లొంగి మమత్వములో పడి తమస్సున తన్మయత్వమును పొంది యున్నాడు. అయినా శాస్త్రము తల్లివంటిది కనుక అతనిని విడువక, వెంటపడి, అతనిని ఉద్దరించవలెనని తలంచి లక్ష్యమును స్మరింపజేయు చున్నది. అగమ్యగోచరమైన, అప్రమాణమైన, అనిర్వచ నీయమైన పరబ్రహ్మను తెలుపుటకు శాస్త్రము కారణమైనదగుటచే శాస్త్రయోనిత్వాత్ అని నిరూపించు చున్నది. ఈ సూత్రము. ఈ శాస్త్రము అనంతము. తెలుసుకొనుటకు ఆయువు తక్కువ. విజ్ఞానము అనంతము. సందేహములు సంఖ్యాతీతం, శ్రద్ధ ఆల్పం, కనుక అన్నింటినీ తెలుసుకొననెవరి తరమూ కాదు. సముద్రమును పూర్తిగా గ్రోలి రుచి చెప్పలేము. అందులోని ఒక బిందువు రుచిచూచి సముద్రము యొక్క రుచినినిరూపించినట్లు శాస్త్రమును పూర్తిగా తెలుసుకొనుట అసాధ్యము కనుక, అందులోని ప్రధాన సారమును అర్థము చేసుకొని గ్రహించి ఆచరించుటకు ప్రయత్నించిన చాలును. అదే దైవచింతన.
పురుషుడు అన్న సారమే. ఏతావాతా మానవ శరీరము అన్నమయం కాదు. అన్నము స్థూలమయిన స్థానము, దానికంటే సూక్ష్మమైనది ఒకటున్నది. అదే ప్రాణము. దానికంటే సూక్ష్మమైనది. మనస్సు. మనసుకంటే సూక్ష్మమైనది ఆనందం. మానవుని శరీరమునందే పై అయిదు కోశములు ఇమిడియున్నవి. కాని చివరిదైన ఆనందస్థాయికి మానవస్థాయి చేరినపుడే బ్రహ్మ తత్వమును బ్రహ్మ స్వరూపమును చేరగలడు. చెందగలడు..
"ఓమిత్యేకాక్షరం బ్రహ్మ" అను వాక్యము ననుసరించి ఓంకారమే బ్రహ్మ. ఈ చరాచర ప్రపంచమంతయూ ప్రణవముతో నిండియుండుట చేత, ప్రపంచమంతయూ బ్రహ్మమయము. ప్రణవమయమయిన జగత్తు బ్రహ్మ మయమని చెప్పవచ్చు. తరువాత అయమాత్మా బ్రహ్మ అని. ఆత్మతత్వము బ్రహ్మ పదార్థమే అయివున్నది. ఆత్మకూ బ్రహ్మకు ప్రణవానికీ అభేదం. ఇవి అవినాభావ సంబంధమైనవి. ఆత్మతత్వమే బ్రహ్మపదార్థము అని అనుభవముతో తెలుసుకోవటమే బ్రహ్మవిద్య. బాహ్య ప్రపంచానికి, ఆంతర్జగత్తుకు అవినాభావ సంబంధం ఉందనే విషయాన్ని సూత్రము తెలుపుతుంది.
(సూ.వాపు 23/27)