ఈ ఉపనిషత్తు సర్వ వేదాంతసారము, అన్నింటికంటెను గంభీరమైనది. మోక్షప్రాప్తికి ఈ మాండూక్యోపనిషత్తు ఒక్కటి చాలును. బ్రహ్మ విద్యను బోధించునట్టివానిలో ఇది ముఖ్యమైనదై యున్నది. కాని ఉపనిషత్తులలో ఇంత చిన్నది మరే ఉపనిషత్తులేదు. ఇది చాలా స్వల్పమైనది. దీనిలో పదురెండు మంత్రములు మాత్రమే యున్నవి. ఇందులో ఆగము; వైతథ్య, అద్వైత, ఆలాతశాంతులను నాలుగు ప్రకరణము లున్నవి. మొదటిదైన ఆగమ ప్రకరణమందు. ఆత్మతత్త్వమునకు ఉపాయమగు ఓంకారత్యము నిర్ణయింపబడినది. రెండవదైన వైతథ్య ప్రకరణమున ద్వైతో పశమనము, మూడవదైన అద్వైతమున ఏకత్వము అనగా అద్వైత తత్వము విచారింపబడినది. నాలుగవదయిన అలా శాంతి ప్రకరణమున పరస్పర విరుద్ధములు, అవైదికములు మతాంతములు వివరింపబడినవి. శబ్దములన్నియు ఓంకారముకంటె వేరుకావు కనుక అవి అన్నియూ ఓంకారములగుచున్నవి. అయితే బ్రహ్మ ఓంకారశబ్దవాక్య మగుటవలన ఓంకారము బ్రహ్మము కంటే వేరుకాదు. పరోక్షముగ కనిపించు బ్రహ్మమే అపరోక్షమగు ఆత్మ. ఆత్మకు విశ్వతైజస ప్రాజ్ఞాది బేధము ఉపాధికల్పితము. నేనూ, నేనూ అని సర్వ సామాన్యముగ తెలియవచ్చు ఆత్మ, రెండూ ఒక్కటియే. అవస్థాత్రయము నొకదాని తరువాత నొకదానిలో తనను అనుసంధానము చేసికొనగా ఆయా అవస్థలు అనుభవించుచున్నది. నదీ ప్రవాహ మధ్యగతమగుచు. రెండు కూలములను ఆటంక సంచరించు మత్స్యమువలె ఉండును. సుషుప్తియందువిషయ వాసనలన్నియు ఘనీ భూతములగుటవలన ఉన్ననూ ఉండినట్లు కనుపించవు. స్వప్నము నందు వాసన రూపమున దానిని అనుభవించుచున్నారు. విషయ వాసన లన్నియూ మానసిక స్పందనముచే జాగ్రత్ స్వప్నములందు మొలక వేయుచున్నవి. దీనినే అనగా మానసిక స్పందనమునే సృష్టి అని అందురు. జాగ్రదాద్యవస్థాత్రయముకంటే, (అనగా జాగ్రత, స్వప్నము, సుషుప్తి, అను మూడు అవస్థలకంటే) భిన్నమయినది. ఒకటి కలదు. దానినే తురీయము అని అందురు.
(ఉ.వా.పు.26/27)