ఆత్మ శబ్దాత్ - ఆత్మ అను శబ్దమును వినియోగించుట వలన ‘అగ్ని ఈ క్షించెను అని కొన్నింటియందు శ్రుతులు ఈక్షతి శబ్దమును గౌణముగా తెలియబరచెను. నిజముగా అచ్చట ఆత్మ శబ్దమే ప్రయోగింపబడినది. ఈక్షించునది. సంకల్పించునది ఆత్మనే కాని మరకోటి కాదు. ఈ దృశ్యగోచరమైన జగత్తు నంతయు సద్ వస్తువే అయివుండెను - అని ఆరంభించి క్రమముగా ఈ సమస్తము సద్ వస్తువే. ఆదియే ఆత్మ అని వేదములు తెలుపుచున్నవి. ఈ వస్తువు జడ వస్తువు కాదు. ఒక్కొక్క పరి ప్రధానమునకు కదా ఆత్మ శబ్దము ఉపయోగించి బడుతుంది. ఎందుకన అది చేతన పురుషుని యొక్క కార్యములన్నింటిని చూచుకొంటుంది. ప్రకృతి చేయు కార్యములకు పరమాత్మ కారణముగా నున్నందున ప్రకృతికి కూడా చేతనత్వము ఆపాదింపబడుతుంది. జీవుండంటే రాగద్వేషాలకు కష్ట సుఖాలకు ప్రపంచము యొక్క ఆకర్షణకు లొంగినవాడు. అట్టివానినే బద్ధుడని అందురు. కావున ప్రతి జీవికి మోక్షము అవసరము. ఈ మోక్షము కావాలంటే ప్రకృతినే ఆశ్రయించరాదు. ఆది గ్రుడ్డివాడు గ్రుడ్డివానిని ఆశ్రయించునట్టుండును. లేక దరిద్రుడు మరొక దరిద్రుని ఆశ్రయించినట్లగును. అట్టి ఆశ్రయము వలన వాని దరిద్రము గాని లేక బాధగాని విముక్తి కాజాలదు. దరిద్రము పోవాలంటే ధనవంతుని ఆశ్రయించాలి. సరియైన దారిని నడువవలెనన్న దృష్టికల వానిని అనుసరించాలి. అట్టిజ్ఞాన దృష్టి ఆఖండ ఐశ్వర్యము కలవానిని, దయాళువును ఆశ్రయించవలసి వుంటుంది. అతడే ఆత్మ స్వరూపుడు. అట్టి పరమాత్మను ఆశ్రయిస్తేనే దుఃఖమనే దరిద్రమును తొలగించుకొనవచ్చును. ఆనందమనే ఐశ్వర్యమును పొందవచ్చును, గమ్యమును చేరవచ్చును.
కనుక ఈ విధమైన స్థితిని పొందుటకు బ్రహ్మ అనుగ్రహం ఆత్మ ప్రాప్తి లభించవలెను. ఈ ఆత్మ ఎక్కడున్నది? దానిని తెలుసుకొను విధానమేమి? అని చింతించిన, అచేతన వస్తువునందు భక్తి కలిగియుండినపుడే అట్టి నిష్ఠ మోక్షకారణము కాగలదు. సద్గుణ బ్రహ్మపై ఆధారపడిన వానికే ఆత్మతత్వము అర్థము కాగలదు. అట్టి ఆత్మ సగుణకారమునందు కూడనూ కలదను దృష్టాంతమె లెన్నియో వున్నవి. ఆత్మపదార్థమే బ్రహ్మపదార్థమని అనుభవ పూర్వకంగా తెలిసికొనుటయే బ్రహ్మ విద్య. ప్రపంచంలో ప్రతి మానవుడు నాలుగు దశలను ప్రతిదినము అనుభవిస్తాడు. మొదటిది జాగ్రదవస్థ, రెండవది స్వప్నావస్థ, మూడవది సుషుప్త్వవస్థ; తదుపరి తురీయావస్థ. ఈ నాలుగు అవస్థలు లేక నాలుగు పాదములుగా వర్ణించింది. వేదము. జాగ్రతావస్థ - ఇందులో వ్యక్తి మేల్కొని ఉంటాడు. ఆత్మబహిర్ముఖంగా ఉంటుంది.ప్రపంచములోని వస్తువులన్నియు కంటికి కనిపిస్తాయి. శబ్దాలు వినిపిస్తాయి. రుచులు, వాసనలు, స్పర్శలు అనుభవంగా ఇంద్రియాలకు గోచరిస్తాయి. సమాజములో సమిష్టి జీవితాన్ని గడుపుతాడు. కర్మేంద్రియాలు ఐదు, జ్ఞానేంద్రియాలు ఐదు, పంచ ప్రాణములు ఐదు, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం అనే నాలుగు అంత:కరణములు - మొత్తము పందొమ్మిది - ముఖములతో జాగ్రదవస్థలో, సుఖ దుఃఖాదులలో లాభ నష్టములను, విజయ అపజయాలను స్థూలంగా అనుభవిస్తాడు. శరీరము స్థూలంగా ఉండుటచేత అనుభవములు కూడా స్థూలంగానే ఉంటాయి.
అయితే స్వప్పలోకం దీనికి భిన్నంగా ఉంటుంది. స్వప్నావస్థలో ఆత్మ అంతర్ముఖంగా ఉంటుంది. తన అనుభూతి తన వరకే పరిమితమై ఉంటుంది. పదిమంది గదిలో పరుండి ఉండినా ఎవరి కలవారికే, ఎవరి అనుభూతి వారిదే, కాని ప్రక్కనున్న వారికి సంబంధముండదు. ఎవరి స్వప్నములు వారినే బాధించును, ఆనందింపజేయును. బాహ్యసంబంధము ఏమాత్రము ఉండదు. అసలు బాహ్యజగత్తే కానరాదు. స్వప్నావస్థలో మరొక ఊహా ప్రపంచమును సృష్టించుకొని అందులోనే అనుభవిస్తాడు. అయితే వస్తువు కల్పితమైనా ఆనందానుభూతిలో భేదముండదు. జాగ్రదవస్థలో ఉన్న పందొమ్మిది ముఖములు స్వప్నావస్థలో కూడా ఉంటాయి. ఇవి భౌతికంగా కనుపించవు. మానసికంగా మాత్రము పనిచేస్తాయి. అందులో కూడా ఒక వెలుగు ఉంటుంది. దానిని తైజసుడు అని అంటారు. ఈ తేజోమయ ప్రపంచములో వ్యక్తి తనకు తోచిన రూపాలను, శబ్దాలను, రుచులను సృష్టించుకొంటాడు. ఈ స్వప్నలోకము ఆత్మకు రెండవ పాదం లేక దశ.
గాఢ నిద్ర. దీనినే సుషుప్తి అని అంటారు. ఇందులో కలలు కనుపించవు. మంచి నిద్రయందుంటాడు. సుషుప్తిలో మనిషికి అవయవాలు కాని, శబ్ద, స్పర్శ, రూప, రస గంధాలు కాని ఏవియు ఉండవు. అన్ని అవయవాలు, వాటి గుణములు మనసులో లీనమై ఉంటాయి. అనుభూతి ప్రజ్ఞాన రూపంగా ఉంటుంది. ఇక్కడ వ్యష్టిగా కానీ, సమిష్టిగా కాని ఉండడు. ఆత్మతో పాటు పరమానందమును అనుభవిస్తాడు.
తూరీయావస్థ - ఇది పూర్తి ఆత్మమయముగా ఉంటుంది. సకల జీవ జగత్తుకు మూలాధారమైన సర్వాత్మ కల్పించుకొన్న సామ్రాజ్యము ఇది. ఈ స్థానమును అందుకొన్న ఆత్మ జీవిని గురించి ఏమీ చింతించదు. ఇందులో తెలివితేటలు ఉన్నాయని కాని, లేవని కాని, చెప్పేందుకు అసలే వీలుండదు. తురీయావస్థలో పరమానందాన్ని అనుభవిస్తూ ఉంటాడు..
ఆత్మ కంటికి కనిపించదు. పట్టుకొనుటకు వీలుకాదు. ఆత్మసారమనేది ఒకటి ఉన్నదనేది మాత్రము తెలుస్తుంది. అందులో మంచి తప్ప మరొకటి ఉండదు. ప్రాపంచిక వాసనలన్నియు ఉపశమించిన తరువాతనే ఈ ఆత్మప్రత్యయం ఏర్పడుతుంది. ఆత్మలోని నాలుగు పాదములు ఓంకారములోని నాలుగు మాత్రలను పోలి వుంటాయి. ఆత్మ అనుభవించే జాగ్రత్, స్వప్న, సుషుప్తి, తురీయావస్థలే ఓంకారంలోని ఆ,ఉ,మ అధిగత మాత్రలు, ప్రణవమాత్రలే పరమాత్మకు పాదాలు. జాగ్రత్తలో నేత్రమునందు, స్వప్నమునందు, సుషుప్తిలో హృదయము నందు, తురీయావస్థలో అంతా తానై ఉంటుంది. ఆత్మ. ఏతావాతా ఆత్మ అన్ని అవస్థలయందు, అన్ని స్థానములందు అన్ని క్రియలయందు ఉన్నది. అంతా ఆత్మ, ఆత్మే అంతా అని సమన్వయింపజేస్తుంది సూత్రము, సమన్వయమే లేకుండిన సంతోషమే లేదు. సంతోషమే లేకున్న సర్వం శూన్యం. అయితే జగత్తంతా పూర్ణమే కానీ శూన్యము కాదు.
(సూ.వా. పు. 35/38)