భూతదయకు భారతదేశము పుట్టినిల్లు, పెట్టింది పేరుభారతీయులు విషసర్పములకు కూడా పాలు పోసి పూజిస్తున్నారు. చీమలకు కూడా బియ్యపు పిండి వేసి పోషిస్తున్నారు. "చీమలో బ్రహ్మలో శివకేశవాదులలో ప్రేమ మీర వెలసియుండే బిరుదు వహించిన సీతారామ నన్నుబ్రోవరా!" అన్నాడు త్యాగరాజు. చీమ మొదలు సింహము వరకు, రాయి మొదలు రత్నము వరకు గులకరాయి మొదలు పర్వతము వరకు సమస్త పదార్ధములూ దైవస్వరూపములేనని ప్రబోధించినది భారతీయ సంస్కృతి. కనుకనే చెట్టును, గుట్టను, మట్టిని. పుట్టను కూడా పూజిస్తూ వచ్చారు. భారతీయులు. భగవంతుడను గ్రహించినప్రేమతత్వాన్ని కేవలం మానవులకే పరిమితం చేయకుండా సర్వప్రాణులకు, సమస్త పదార్థములకు ప్రసరింపచేయాలనే గొప్ప అంతరార్థముతో కూడినది భారతీయుల విశ్వాసము. పాశ్చాత్యులు విశ్వమానవ సోదర భావంకంటే మించినది లేదన్నారు. కాని, అందరి యందున్న ఆత్మతత్వం ఒక్కటేనని భారతీయ సంస్కృతిని మూఢ విశ్వాస మంటూ కొట్టి వేయడం కంటే మూర్ఖత్వం మరొకటి లేదు.
(స.పా.ఆ.96 పు.275)
"సర్వే భవంతు సుఖీన:
సర్వే సంతు నిరామయా:
సర్వే భద్రాణి పశ్యంతు
మా కశ్చిత్ దుఃఖ భాగ్భవేత్ “
దేశమంతా సుఖముగను, సౌభాగ్యముగను ఆనందము గను ఉండాలనేదే భారతీయ సంస్కృతి యొక్క ప్రధాన సూత్రము. భారతదేశము ఆధ్యాత్మికమునకు, దాన ధర్మమునకు పుట్టినిల్లు. శాంతి అహింసలకు మెట్టినిల్లు భారతదేశమునందున్న సత్యవ్రతము మరే దేశము నందున కానరాదు. ఈ గడ్డ సప్తఋషులకు జన్మస్థానము. వ్యాస వాల్మీకులు జన్మించిన స్థానం. రాముడు ఏలిన రామరాజ్యం. ఈ భారతదేశం కృష్ణుడు బోధించిన గీత ధర్మక్షేత్రం. ఈ భారతభూమి బుద్ధుడు సంచరించిన పుణ్యభూమి. ఇదే అనేక అవతారములకు అలవాలము ఈ భారతభూమి. అయితే ఇట్టి పవిత్ర మైనటువంటి ఈ పుణ్యభూమి తత్త్వమును భారతీయులేఈనాడు గుర్తించుకోలేకపోతున్నారు.
దాన ధర్మములే భారతీయుల ప్రధాన ధర్మము, ప్రధాన సంపద భారతీయులు భగవత్ ప్రార్థనము ప్రధానముగాభావించి ఆచరించేవారు. ఇట్టి సంపదకు బాలబాలికలే వారసులు. కనుక ఇట్టి పవిత్రమైన సంపదను నిలబెట్టుకొనుటకు బాలబాలికలు తగిన కృషి చేయాలి. అనాది కాలము నుండి ఈ భారతదేశం ఆధ్యాత్మిక సంపత్తిలో అన్ని దేశములకును సుస్థిర శాంతి భద్రతలను చేకూరుస్తూ వస్తున్నది. నాటికి నేటికి "లోకాస్సమస్తా స్సుఖినో భవంతు" అన్నదే భారతీయుల లక్ష్యము.
(శ్రీ ఏ.96 పు. 9)
సంస్కృతం, సంస్కృతి, సంస్కరణ, సంస్కారం, సాంఘికప్రవర్తన - ఇటువంటి పదములు వేరువేరుగా గోచరించినప్పటికి ఒక ‘సం’‘పూర్వక కృత్’ ధాతువునుండిపుట్టినటువంటివి. భారతీయ సంస్కృతి అనేక విధములైన శ్రేయస్సు, పవిత్రత, భిన్నత్వముల యొక్క ఆనంద మయమైన సారముతో కూడి ఉంటున్నది.
(శ్రీన.1990పు.1)
రామాయణ మహాభారతములు మన భారతీయులను వేలాది సంవత్సరాల కాలము, తీర్చి దిద్దినవి. భారతీయ సంస్కృతికి అవే పునాదులు. అలెగ్జాండర్ చక్రవర్తి సిందునదీ ప్రాంతమునకు దండెత్తి వచ్చినపుడు, మన సంస్కృతి యెట్టిది అని తెలుసుకొనుటకై మారు వేషమును ధరించి, గ్రామములకు చికటి సమయమందు వెళ్లేవాడట. ఒకనాడు, ఒక సత్రము సమీపమును చేరుకొనినాడు. అచ్చట చాలా మంది గుమిగూడి యేదో పెద్ద తర్క వితర్కములు చేయుచుండుట విని ఆయన ఒక చెట్టుచాటున నిలిచి, అన్ని శ్రద్ధగా గమనించినాడట. వింటూ వింటూ, భారతీయ సంస్కృతి యొక్క ఆదర్శాలను చూచి ఆనందించి, ఇట్టి దేశమునకు అన్యాయముగా అహంకారము వలన ఇంత కష్టనష్టములను కలిగించితినే అని కంటిధారలు కార్చి నాడట. ఈ గ్రామములో కొంత భూమిని దున్నినప్పుడు, బంగారు నాణ్యములతో నిండిన ఒక బంగారు పాత్ర దొరికినది. "నేను నీ దగ్గర నుండి భూమిని మాత్రమే కొనినాను. ఈ బంగారము నీదే కాని నా కేమాత్రము దానిని తీసుకొను అధికారము లేదు." అని దానిని తెచ్చి, అమ్మిన రైతు ముందు పెట్టగా, ఆయన, "పోపో”, నాకు దీనికి సంబంధమే లేదు, భూమిని అమ్మిన తరువాత, దానిలో దొరికే నిధి నిక్షేపములు అన్ని నివే" అని పాత్రను త్రోసివేసినాడు! నాది కాదు, నీదే, అని ఇద్దరూ ఆ సామ్మును వద్దు అనినప్పుడు, గ్రామములోని పెద్దలు కొంతమంది కూర్చొని, ఆలోచించి, "అయ్యా! బంగారపు పాత్ర దొరికిన రైతూ! నీకొడుకు. ఈ అమ్మిన ఆయన కుమార్తెను పెండ్లాడితే ఈ బంగారమును నీవు స్త్రీ ధనముగా నీ కోడలికిచ్చిన ఈ తర్క వితర్కములు, నాదానీదా అనే సమస్య శుభ్రముగా, అందరికి సంతృప్తిగా, పరిహారమగును" అని తీర్పు చెప్పినారు. అందరూసంతోషముతో ఆ అభిప్రాయమునా మెదించిరి. ఈ నీతిని విని అలెగ్జాండర్ చక్రవర్తి సిగ్గుచే తలవంచుకొని వెళ్లినాడు.
(ప.3.2.75.పు.90)
భారతీయ సంస్కృతి వేష భాషల యందే కాక ఆచారవిచారములందే కాక తెల్లవారి మొదలు రాత్రి వరకు మనకు అడుగడుగున కనిపించే దంతయు భారతీయ సంస్కృతియే.
(బ్బ.త్ర.పు.4)
(చూ॥ ఎవరు గొప్ప, ఏకత్వము. పద్మపురాణం, ప్రధాన సూత్రములు, రాముని ఆదర్శము,విద్యాభ్యాసం, హిమాచలం)