ఆదర్శము

మీరు కష్టాన్ని భరించుకోలేరు. కనుకనే అన్ని ఇస్తాను. నేను దేనికైనా భరించుకోగలను, సహించుకో గలను. నాకేదీ అక్కర్లేదు.

 

నిజానికి అవతారాలన్నీ అంతే కదా! రాముడు అరణ్యవాసంలో అనేక కష్టాలను భరించుకున్నాడు. కృష్ణ పరమాత్మ పార్థసారిథిగా కింగ్ మేకర్ గా ఉన్నాడేగాని, తాను కింగ్ కావాలని ఏనాడూ ఆశించలేదు. సుగ్రీవ పట్టాభిషేకంగానీ, విభీషణ పట్టాభిషేకంగాని రాముని కటాక్షమే కదా! అవతారమూర్తుల క్షమ అనండీ, లేదా భరించుకునే శక్తి, లేదా సహించుకునే ఓర్పు మనకు ఆదర్శాన్ని చాటుకుంది. (స. సా. జూలై 2000 పు. 214)

 

సత్యనిత్య సుకృతులన్ని వికృతిరూపు పొందుచుండె

పవిత్ర ప్రకృతి ప్రతిదినము ప్రజల వీడిపోవుచుండె

దయా ధర్మాచరణ సతతము వికృతిరూపు పొందుచుండె

ఆర్యవేదవిద్యలణగె దుర్విద్యలు పెరుగుచుండె.

ప్రాచీన కాలమునుండి భారతదేశము ఆధ్యాత్మిక సంపత్తి చేత అన్ని దేశములకు శాంతి సుఖముల నుందిస్తూ వచ్చింది. కనుకనే నాటికి నేటికి లోకా స్సమస్తాస్సుఖినో భవంతు అన్నదే భారతీయుల యొక్క ఆదర్శము. (భ.స.మ. పు.3)

 

భారతదేశం ఎప్పూడూ లోకహితాన్నే కోరింది! ప్రపంచ శ్రేయస్సునే కాంక్షించింది. విశ్వశాంతినే అభిలషించింది! వసుదైక కుటుంబమే లక్ష్యంగా ఉంచుకుంది! దేశకాల పరిస్థితులకు అతీతమైన మన పవిత్ర సాంప్రదాయ సంపదను సుసంపన్నం చేసుకోవాలి! ఎంత దివ్యమైన దేశం మనది! ఎలాంటి ఆదర్శవంతమైన దేశం మనది! ఎంతటి ప్రేమ పూరితమైన దేశం మనది!

 

యోగభూమి - త్యాగభూమి అయిన భరత ఖండంలో పుట్టిన మనం, అన్నం కోసం కాదు - ఆదర్శం కోసం జీవించాలి! జీవనోపాధి కోసంకాదు - జీవిత పరమావధి కోసం జీవించాలి! లోకహితం - యువకుల వ్రతం కావాలి!

 

ఈ గడ్డపై పుట్టిన ప్రతి ఒక్కరూ - మానవాళి పునరుద్ధరణ కోసం పని చెయ్యాలి. మానవత్వ విలువలకోసం ధరమ సమ్మతమైన మానవ సమాజ నిర్మాణము కోసం ఉద్యమించాలి. (దే.యు.పు. 47)

 

ఒకానొక సమయంలో రామలక్ష్మణభరతులు బంతి ఆట ఆడుకుంటున్నారు. కొంత సేపటికి రాముడు ఆడి ఆడి అలసిపోయి చెమట కార్చుతూ వచ్చి తల్లి కౌసల్య ఒడిలో కూర్చున్నాడు. రాముడు చాల ఆనందంగా కనిపించాడు. కౌసల్య అడిగింది - "ఇంత శ్రమపడి వచ్చావు? ఏమిటి నీ ఆనందానికి కారణం?" అప్పుడు రాముడు "అమ్మా! ఈనాడు బంతిఆటలో భరతుడు గెల్చాడు. నాకు చాల సంతోషంగా ఉంది" అన్నాడు. "ఓహో! తమ్ముడు గెల్చాడని అన్నకు ఇంత ఆనందమా! అన్నదమ్ములంటే ఇలా ఉండాలి" అని తల్లి ఆనందించింది. కొంత సేపటికి భరతుడు పరుగెత్తుకుంటూ వచ్చాడు. కాని, చాల విచారంగా కనిపించాడు. "నాయనా! గెల్చినందుకు ఆనందంగా ఉండాలి కాని, ఎందుకు విచారిస్తున్నావు ?" అని అడిగింది కౌసల్య "అమ్మా! నేను ఓడిపోయే పరిస్థితిలో నన్ను గెలిపించాలని అన్న కావాలని ఓడిపోయి నాకు గెలుపు నందించాడు. నా నిమిత్తమై ఉన్న ఓడి పోవడం నాకు చాల కష్టంగా ఉన్నది" అన్నాడు భరతుడు. అన్న ఓడిపోయినందుకు తమ్ముడు దుఃఖించాడు. తమ్ముడు గెల్చినందుకు అన్న ఆనందించాడు. ఎంతటి అన్యోన్యత చూడండి! ఆనాటి అన్నదమ్ముల ఐకమత్యం ఇంత పవిత్రంగా ఉండేది. సమత, సమగ్రత, సమైక్యత, సౌభ్రాతృత్వము - ఈ నాలుగూ అత్యవసరమన్నాడు రాముడు. వీటిని పొందినప్పుడే వ్యక్తిత్వము ప్రకాశిస్తుంది. ఇలాంటి వ్యక్తిత్వము కల్గిన కుటుంబము దేశానికి ఆదర్శాన్ని అందిస్తుంది. ఇది రామాయణంలోని ఆదర్శం. ఆనాటి అన్నదమ్ములు సుప్రీం స్టేజికి వెడితే ఈనాటి అన్నదమ్ములు సుప్రీంకోర్టుకి వెడుతున్నారు. ఇది సరియైనది కాదు. అన్నదమ్ములు ఐకమత్యంగా ఉండాలి: అన్యోన్యంగా, అనుకూలంగా ఉండాలి. కాని, ఇలాంటి అండర్‌స్టాండింగ్, అడ్జస్ట్ మెంట్ ఎక్కడా కనిపించడం లేదు. (ది.ఉ. మరియు స. సా..ఏ. 1996 పు. 97)

 

"ఆకాశం ముక్కలై పడినా సాయి సంకల్పానికి తిరుగులేదు". అన్న భగవాన్ దివ్యవాణి ని జ్ఞప్తికి తెచ్చుకుంటూ ముందుకు సాగిపోవాలి. ఈ సందర్భం గా యువతకు స్వామి ఇచ్చిన సందేశం ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. హనుమంతుడు ఏ సందేహమూ లేకుండా రామాజ్ఞను శిరసావహించాడు. రామకార్యములో ఏమైనా కష్ట నష్ట ములు ఎదురవుతాయే మొ నని వెనుకంజ వేయలేదు. స్వామి తన కే ఇంత విశేష మై న కార్యమును అప్పగించారని అహంకారమూ పొందలేదు. "దాసోఽహం కోసలేంద్రస్య్" అనే భావంతో రామకార్యాన్ని స ఫలీ కృతం చేసి, విజయాన్ని సాధించి రామదూతగా నిలిచిపోయాడు. మీ కందర కూ అంజనేయుడే ఆదర్శం కావాలి.

 

అగరువత్తి ఆదర్శం కావాలి
పురోభివృద్ధి కోరువారు పూర్వ వృత్తాంతమును మరువ రాదు అన్నారు. అనగా, మనలను ఎవరు ఇంతవరకూ కాపాడుతూ వచ్చారు? మనం తినే తిండికిగాని, కట్టే బట్టకు గాని, చదివే చదువుకుగాని ఎవరు బాధ్యత వహిస్తున్నారు? ఈ విషయం గుర్తించినప్పుడే తల్లిదండ్రులకు సరియైన కృతజ్ఞతను మనం అందించగలము. తల్లులకు తల్లి, తండ్రులకు తండ్రి అయిన దైవత్వాన్ని మనం గుర్తించాలంటే ముందు కన్న తల్లి ప్రేమను అర్థం చేసుకోవాలి. ఒక్క తల్లి ప్రేమనే అర్థం చేసుకోలేనివారు వెయ్యి తల్లుల ప్రేమ గల దైవత్వాన్ని ఏరీతిగా అర్థం చేసుకోగలరు?! ఊదువత్తులు సుగంధాన్ని అందిస్తూ కాలిపోతాయి. అదేరీతిగా మన వయస్సు పెరిగే కొద్దీ మన కుటుంబానికి, సమాజానికి, మానవత్వానికి పవిత్రమైన ఆదర్శాన్ని అందిస్తూపోవాలి. ఆదర్శవంతమైన విషయాలు కోటి ఆలోచించేకంటే ఒక్కటి చేసి చూపించు, అదే చాలు. నిక్కమైన మాట ఒక్కటుండిన చాలు, టక్కు బిక్కు పలుకు పెక్కు లేల? ఉపయోగకరమైన జీవితాన్ని జగత్తున కందించడమే మీరు నేర్చుకోవలసింది. - శ్రీసత్యసాయి (సనాతన సారథి, మే 2021 4గ వ కవరు పుట)


About Us

Sri Tumuluru Krishna Murty and his late wife, Smt. Tumuluru Prabha are ardent devotees of Bhagavan Sri Sathya Sai Baba

Read More

Reach Me

Sri Tumuluru Krishna Murty

E-mail : hello@srisathyasaidigest.com

Subscribe For Contemplate Massage