జడ భరతుడు భారతదేశమున పరిపాలించుటచేత ఈ దేశమునకు భారతదేశము అని పేరు వచ్చింది. శకుంతలా దుష్యంతుల కుమారుడు భరతుడు ఈ దేశమును పరిపాలించుట చేత, ఈ దేశమునకు భరతదేశము అని పేరు వచ్చినది చెప్పవచ్చు. శ్రీరామచంద్రుని సోదరుడైన భరతుడు "రామ పాదుకల" కే పట్టాభిషేకము గావించి, పవిత్రమైన హృదయముతో పాలించుట చేత, భరత" అనే నామము ఈ దేశమునకు వచ్చినదని పురాణములు చెప్పవచ్చును. ఐతే ఈ భరత" అనే శబ్దము ఏనాడు పుట్టినది? జడభరతునికి పూర్వమే ఈ భరత అనే పేరు ఉండుట చేతనే కదా! ఈ జడ భరతునికి భరత అని పేరును ఉచ్చరించినారు. శకుంతలా దుష్యంతుల కుమారునికి పూర్వము ఈ భరత అనే పేరు ఉండుటచేతనే కదా! వారి కుమారునికి పేరు పెట్టినారు. అదే విధముగనే భరత అనే పేరు అనాదిగా ఉండునటువంటిది. సరస్వతి, భగవతి, భారతి అని సరస్వతి కి ఈ పేర్లు సార్ధకమైనటువంటివి. సరస్వతి అనగా వాగ్దేవతా స్వరూపిణి కనుక వాక్కు చే ఉద్భవించిన ప్రతి మానవుడు భరతుడే. కేవలం ఈ దేశమునకు మాత్రమే, ఈ కాలమునకు మాత్రమే, వ్యక్తికి మాత్రమే సంబంధించిన పేరు సమస్త జాతికి, ఈ భరత అనే పదం అన్వయిస్తుంది.
"భ" అనగా దివ్య జ్ఞాన స్వరూపమైన తత్వమునకు "భ" కారము అని అర్ధము, స్వస్వరూప జ్ఞానమే భ ఈ భఅనేదానిని రమించినవాడు భరతుడు. స్వప్రకాశమైన జ్ఞానమును ప్రకటించేవాడు భరతుడు. "సంగ్రమం తనోతీతి భరతః" అని దీనికి ఉత్పత్తి స్థానము. అనగా సంగ్రామము నందు కుశులుడైనవాడు భారతీయుడని అర్థము, సం గ్రామమనగా ఏమిటి? అసుర ప్రకృతి యొక్క శక్తిని ఆత్మశక్తి తో ఎదుర్కొనుట,కనుక ప్రతి మానవుడు తన యందున్న అసుర ప్రకృతి శక్తిని దివ్యమైన, భవ్యమైన ఆత్మశక్తితో ఎదుర్కొనే వాడు భారతీయుడు. బలం, భరం, భవతి, భిభ ర్తేః అని నిరుక్త పదములు. బలం అనగాబ్రహ్మబలం, తేజోబలం, క్షేత్రబలం, ఈ మమ్మూర్తులతో కూడినవాడు భరతుడు, బలం అనగా ప్రతి యందు దీనిని యజ్ఞమని ఒక అర్ధము. "యజ్ఞం ఆత్మబలం వా తనూ తీత భారతీ" అనగా యజ్ఞముచేత ఆత్మబలమును పొందేవాడు భారతీయుడు. ఆత్మబలం అనగా దైవ బలమును పొందే వాడు భారతీయుడు. కనుక ఏదేశము వాడైనా ఏ కాలమువాడైనా ఏ వ్యక్తి యైనా వీటిని పొందుటకు అధికారి కాగలడు.
(స.సా..డి.1990 పు.309/310)