"ఇంద్రియములు తమ తమ స్థానములలోనే వుండిన యే భయము రాదు, లేదు. కాని, విషయములలో చేరుటవలన భయము, అనగా, ఇంద్రియ విషయ సంయోగమే సుఖ దుఃఖములకు కారణమగుచున్నది. నిన్నెవరైననూ దూషించిన, అది నీవు విన్న, నిన్ను వికారముగా మార్చును. అట్లుకాక, ఈ విషయమునే ని ఇంద్రియమునకు చేర్చకుండిన అనగా వారి దూషణము మాటలు నీ చెవిన పడకుండినంత కాలము యే వికారము నీలో లేదు. ఇట్టి వికారమునకు విషయేంద్రియ సమ్మేళనమే కారణము కదా!”
"ఇవి కేవలము శీతోలవలే మండును. శీతలము వేడి కాలమున సుఖమును హాయిని యిచ్చును. అటులనే ఉష్ణము కూడనూ శీతకాలమున సుఖమును హాయిని అందించును. అటులనే విషయ స్పర్శలు కూడనూ, ప్రపంచమున్నంతవరకూ బైట విషయాలు తప్పవు. ప్రారబ్దమున్నంత వరకు సుఖదుఃఖాలు తప్పవు. అయితే వాటిని భరించుకొను విద్యను. వుపాయమును, నేర్చుకొనవలెను."
(గీ.పు.28)
“భయమును దయ్యమును పారగద్రోలి నిర్భయముగ నుండరయ్యా
పాపంబన భయముండవలెనయ్యా లోకముతోటి భయము
మీ కేలనయ్యా అందరికి భయపడి దేవుని భజన
చేయగలేక భ్రమ చెంది మరణించు సమయమునందున
బలిమి మీరగ యముడు రమ్మిక రమ్మనుచు లాగంగ నప్పుడు
అయ్యయ్యొ అని యేడ్వంగ నెవ్వరు అడ్డితింపగ వత్తురయ్యా"
(శ్రీస.వి.వా.పు.59)
ఎవ్వరికీ మీరు భయపడకూడదు. Be fearless. కొందరు ఇంట్లో ఉన్నప్పుడు విభూతి పెట్టుకుంటారు, బయటికి వెళ్ళినప్పుడు ఎవరైనా చూస్తే ఏమనుకుంటారో అని తుడిచేసుకుంటారు. మరి కొందరు తాము పుట్టపర్తికి వెళుతున్నామంటే ఇతరులు హేళన చేస్తారేమోనని అనంతపురం వెళుతున్నామని చెప్పుకుంటారు. పుట్టపర్తికి వెళుతున్నామని చెప్పుకుంటే వచ్చే నష్టమేమిటి! ఎవరేమైనా అనుకోనీయడి. మీకెందుకింత భయం? మీరేమీ తప్పు చేయటం లేదు కదా! లోకంలో అనేకులు ఏమాత్రము భయం లేకుండా కావలసినన్ని తప్పుపనులు చేస్తున్నారు. దైవ దర్శనం కోసం వెళుతున్నామని చెప్పుకోవడానికి మీకు భయం ఎందుకు? ఈనాటి మానవునికి సాధనలో భయం, సత్కర్మలలో భయం, అన్నింటికీ భయం, భయం! భయం, భయం, బ్రతుకు భయం!
అన్నా! మనకీలోకం పన్నిన పద్మవ్యూహం
గతి లేని మానవులకు చితికిన సంసారాలకు
కష్టాలే బంధువులా! కన్నీళ్ళే కానుకలా!
భయం, భయం, బ్రతుకు భయం!
భయంతో జీవించేవాడు జీవితంలో దేన్ని సాధించలేదు.
దైవత్వముతో కూడినప్పుడు ఎందుకు భయపడాలి? భయంచేత చాలమంది జీవితాలు పాడు చేసుకుంటున్నారు. మర్చిపోయారు. మీరు ఏనాడూ అనుభవించిన ఆనందాన్ని ఆధ్యాత్మికంలో అనుభవించ గలరు. దైవత్వంలో గడిపే జీవితమే శాశ్వతమైన, ఆనంద మయమైన జీవితము. మీరు కూడా పశువులవలె జ్ఞానశూన్యులై తింటూ, తిరుగుతూ ఇంద్రియ సుఖాలను అనుభవిస్తుంటే ఇంక, "జంతూనాం నరజన్మ దుర్లభం" అని చెప్పడంలో అర్థమేమిటి? మీరు పశువులు కాదు, మానవులు, మొదటిది రాక్షసత్వం, తరువాత పశుత్వం, తరువాత మానవత్వం, తరువాత దివ్యత్వం. కనుక, మానవుల వలె జీవించండి. తరువాతనే దివ్యత్వాన్ని పొందగలరు. దేహాన్ని నమ్మవద్దు. లోకాన్ని విశ్వసించవద్దు. దైవాన్ని వదలవద్దు. ఆధ్యాత్మికం లో ఈ మూడింటిని ప్రధానంగా పాటించాలి.
(స.సా.డి.99.పు.353/354)
ఈనాడు లోకంలో ఎక్కడ చూసినా భయమే. భయం లేని మానవుడు ఎక్కడా కనిపించడం లేదు. అయితే, భగవంతుని అభయం పొందితే భయానికి చోటేలేదు. ఈనాడు కారెక్కాలన్నా, ట్రైన్ ఎక్కాలన్నా భయమే! పోనీ ఏదీ వద్దు. నడచుకొని పోదామన్నా అది కూడా భయమే! ఎక్కడికీ వద్దు. ఇంట్లో కూర్చుందామన్నా అదీ భయమే. దైవాను గ్రహమే అభయత్వాన్ని అందించగలదు. అట్టి అనుగ్రహానికై మనం పాటుపడాలి. దైవాను గ్రహాన్ని పొందాలంటే దైవ విశ్వాసాన్ని పెంచుకోవాలి.
(స.సా.డి.95పు.287)
(చూ|| నన్నేపొందుదురు, బ్రహ్మానుభవ ఉపనిషత్తు, భక్తుడు)
నారసింహుని చూసి అందరూ భయభ్రాంతులకు గురియౌతున్నారు, "గజగజ వణుకుతున్నారు. కాని, ప్రహ్లాదుడు మాత్రం ఆనందంతో కన్నార్పక చూస్తున్నాడు. నారసింహుడు ప్రహ్లాదుని, నాయనా! నా రూపం చూసి నీకు భయం కల్గటం లేదా? అని అడుగగా, నారాయణా! యద్భావం తద్భవతి, నిన్ను భయంకర స్వరూపముగా భావించిన వానికి నీవు భయంకరంగానే కనిపిస్తాం కాని, నేను నిన్ను ప్రేమస్వరూపునిగా భావిస్తున్నాను. కనుక, నీవు ప్రేమ స్వరూపునిగానే కనిపిస్తున్నావు, ఆనందమయునిగానే గోచరిస్తున్నావు. నాకు భయమెందులకు?” అన్నాడు. హిరణ్యకశిపుని శవాన్ని నారసింహుడు క్రింద - పడవేసిన తరువాత ప్రహ్లాదుడు దగ్గరకు వెళ్ళి నమస్కరించాడు. తన తండ్రికి సద్గతి ప్రసాదించమని ప్రార్థించాడు. (దివ్యఙ్ఞాన దీపికలు ప్రథమ భాగము పు162-163)