"ఏకమేవాద్వితీయం బ్రహ్మ" అని శ్రుతులు ఘోషించు చున్నవి. అనగా పరబ్రహ్మము తప్ప మరియొకటేదియు లేదనియు, సర్వకాల సర్వావస్థలయందును ఉండు వాడనియు అర్ధము. ఛాందోగ్యోపనిషత్తు ప్రకారము ప్రథమమున నొక సత్తు మాత్రముండెను. అట్లే, శాంతం, శివం, అద్వైతము అని మాండూకోపనిషత్తు చెప్పెను. ఈ లోకములో వివర్తము పైకి కనబడునది మాత్రమే. ద్వివిధ రూపము కాజాలదు. మనకు కనబడు భిన్న భిన్న రూపములన్నియు మన కల్పనామయమగుట వలననూ, వాసనామయ మగుటవలననూ కలుగుచున్నవి. దీపము తెచ్చి చూచిన తక్షణమే పాము అని భ్రమింపబడుచున్న త్రాడు ఎట్లు బయటబడుచున్నదో అట్లే ద్వంద్వరహితుడైపర బ్రహ్మజ్ఞానముతో చూచిన వానికి ప్రపంచము మీదభ్రమ మాయమగుచున్నది.ద్వివిధములుండు చోటునే భయము. చూచువాడు. వినువాడు, చేయువాడు, ఆనందించువాడుతానే అయియుండినప్పుడు భయమెట్లు కలుగును? నిద్రలో నున్న స్థితిని తెలిసి కొందుము. నిద్రపోవుచున్నప్పుడు ప్రపంచమంతయూ మాయమగుచున్నది గదా? రెండవదనునది లేకయే సర్వత్ర ఏకత్వమునే అనుభవించుచున్నాము. అట్టి ఏక స్వరూపుడైన పరమేశ్వరునిలో విశ్రమించుచుంటిమి. పరమభక్తుడైన జ్ఞానికి అట్టి అనుభవము కలుగుచున్నది. పరబ్రహ్మము సర్వవ్యాప్తమైన ప్రాణ వాయువు వలె చిదాకారుడై యున్నాడు. సత్తు, చిత్తు, ఆనందము, పరిపూర్ణము, నిత్యము అనెడి ఐదు గుణములచే పరబ్రహ్మము బాగుగా కొనియాడబడుచున్నాడు. ఈ గుణములను తలచుకొనుచు పరమాత్మను కనుగొనవలెను. త్రికాలములలో నుండునది సత్; తన్ను తాను తెలిసికొని ప్రకాశింప జేసికొని ఇతరులను ప్రకాశింపజేయునదియే చిత్తు. ప్రతివానికిని పరమ ప్రీతికర మైనది ఆనందము.
ప్రాకభావ, బ్రధ్వంసాభావ, అన్యోన్యాభావముల నుండి విముక్తి పొందినవాడే నిత్యుడు. ఇచ్ఛారహితుడైనాడే పరిపూర్ణుడు.
(ఉ.వా.పు.80/81)