గణపతి తత్వమనేది సర్వులకూ పతి (నాయకత్వ) తత్త్యాన్ని బోధిస్తున్నది. ఈ నాయకత్వం లోపలవున్న గొప్పతనాన్ని మనం గుర్తించాలి. ముఖ్యంగా గణపతి సర్వులకూ నాయకుడు. ఈ వినాయకచవితి శుభదినాన భారతీయులు అనేక విధములైన పిండి వంటలు చేసుకొని, గణపతికి నైవేద్యం పెట్టటం మన సంప్రదాయం. కొంత బియ్యం పిండి తీసుకొని, దీనిలో కొంత నువ్వుల పిండి కలిపి ఆవిరిలో ఉడకబెట్టి, ఉండ్రాళ్ళు చేసి, గణపతికి నైవేద్యం పెడుతారు. ఇది ఆరోగ్యమునకు, ఆనందమునకు ఇది ఒక ఆదర్శంగా నిరూపిస్తూ వచ్చింది. ఆవిరిలో ఉడకబెట్టిన ఈ పదార్ధము కన్నులకు ఆరోగ్యము నిస్తుంది. ఉబ్బస వ్యాధులను నివారిస్తుంది. అయితే ఈనాడు ఆరోగ్య ఆనందములను అందించేటటు వంటి, ఇట్టి ఆహారమును విస్మరిస్తున్నాం. విసర్జిస్తున్నాము. భగవంతుని యొక్క తత్త్వము ప్రతి ఒక్కటీ, కారణములేని కార్యంగా ఉండదు. కాని మానవుడు ఈనాడు ఈ సత్యమును గుర్తించుకొనలేక, కేవలం భౌతికమైన వాటిల్లో కాలాన్ని గడుపుతున్నాడు. ఇది సరియైనటు వంటిది కాదు. గణపతి పండుగ ఉత్తమమైన ఆరాధన. కేవలం మానవులకే కాదు, పశుపక్షి మృగాదులకు కూడనూ, ఈ పండుగ చక్కటి ఆదర్శమును అందిస్తున్నది. ఇలాంటి పవిత్రమైన దినమును మనం ఈనాడు అపవిత్రం గావించు కుంటున్నాం.
(శ్రీ ఆ. 2000 పు.8)
"సర్వగణములకు అధిపతియే గణపతి. గణములనగా మానవుని ఇంద్రియతత్వములే.
భారతీయ పర్వదినములన్నీ కూడా పారమార్థిక సంబంధమైన అంతరార్థములతో కూడినవే కానీ బాహ్యసంబంధమైన చర్యలతో కూడినవి కావు. తెల్లవారి లేచిన తక్షణమే ప్రతి మానవుడుకూడనూ పర్వదినమున అభ్యంగన స్నానమాచరిస్తున్నాడు.
దాని అంతరార్థమేమిటి? శారీరక పరిశుద్ధత ఆరోగ్యమునకు ముఖ్యము. ఇంతేకాక, భగవంతుడు లోపల, వెలుపల కూడను ఉన్నటువంటివాడు కనుక, బాహ్యశుద్ధి, అంతః శుద్ధి రెండూ అవసరము. అంతఃశుద్ది లక్ష్యమేమిటి? దుర్గుణములను దూరము గావించుకొని, సద్గుణములను అలవరచుకోవడం, ఇదియే నూతన వస్త్రధారణ అంతరార్థం. నూతన వస్త్రములనో లేక పరిశుభ్రముగా ఉన్న వస్త్రములనో ధరిస్తాము. హృదయమునకు వస్త్రము అని పేరు. హృదయపరిశుద్ధియే అంతఃశుద్ధి లక్ష్యము. గణేశ చతుర్థినాడు, పూజలు సల్పుతూ, ఉండ్రాళ్ళను నివేదిస్తారు. భగవంతునికి నివేదన ఏవిధముగా చేయాలి? తైలసంస్కారము లేకుండా, కేవలము ఆవిరితో మాత్రమే ఉడికినటువంటి విగా ఉండాలి. కనుకనే బియ్యపు పిండిలో, నువ్వుల పిండినో, పెసరపప్పో, కందిపప్పో పెట్టి ఉడికిస్తారు. వీటిని ఉండ్రాళ్ళు అని పిలుస్తారు. దీని అంతరార్థమేమిటి? నువ్వులపిండి శ్వాస రోగములకు, కంటి రోగములకు దివ్య ఔషధము. ఆవిరిలో ఉడికిన ప్రతి పదార్థముకూడను సులభముగా జీర్ణమౌతుంది. ఈరకముగా, ఆరోగ్యము, ఆనందము - ఈ రెండింటినీ పురస్కరించుకొనియే భగవంతునికి పూజలు చేస్తూ వచ్చారు ప్రాచీనులు.
మనసు పరిశుద్ధముగా ఉన్న సమయమునందే బుద్ధి వికసిస్తుంది. బుద్ధి వికసించినపుడే సిద్ధిత్వము ప్రాప్తిస్తుంది. జ్ఞానసిద్ధియే నిజమైన సిద్ధి. సిద్ధికి, బుద్ధికి క్షేమము, ఆనందము అనే కొడుకులు పుడతారు. క్షేమము, ఆనందములు విఘ్నేశ్వరుని పుత్రులని; సిద్ధి, బుద్ధి విఘ్నేశ్వరుని పత్నులని శాస్త్రము ప్రబోధిస్తూ వచ్చింది. గణపతి మానవుని పరిపూర్ణమైన పరిశుద్ధ హృదయాన్ని మాత్రమే ఆకర్షిస్తాడు. కనుక మనోశుద్ది ప్రతి మానవునికి అవసరము. మనోశుద్ధి లేనివాడు మానవుడే కాడు. దివ్యమైన మానవత్వాన్ని హెచ్చరించే నిమిత్తమై, పవిత్రమైన ఏకత్వాన్ని ప్రబోధించే నిమిత్తమై గణపతితత్వము ఆవిర్భవించింది. ఈశ్వరుడు విశ్వకుటుంబీకుడు. ఈశ్వరుని వాహనము నంది, పార్వతి వాహనము సింహము. ఈ రెండింటికీ శత్రుత్వమున్నది. ఈశ్వరుని శిరస్సుపై గంగ, నుదుటిపై అగ్ని. ఒకటి ఉన్నచోట మరొకటి ఉండటానికి వీలుండదు. వినాయకునిది గజ ముఖము, తల్లి వాహనము సింహము. సింహము స్వప్నములో వచ్చినా ఏనుగు - బ్రతకలేదు. సుబ్రహ్మణ్యుని వాహనము నెమలి, ఇక ఈశ్వరుని ఆభరణము పాము. ఇలాంటి పరస్పర విరోధ భావములున్నవన్నీ కలసిమెలసి ఉంటున్నాయి. ఈశ్వర కుటుంబం ఐకమత్యమును ప్రబోధిస్తున్నది. అయితే మంచి విషయాలలో మాత్రమే ఈ ఐకమత్యమును ప్రవేశపెట్టాలి.” (స. సా. న 2021 పు 57-58)