ప్రాచీన ఋషులు చాలా గొప్పవారు వారిని మనం అనుసరించాలి. నేటి మానవులు బలహీనులైనటువంటి వారు. తప్పులు చేసి గుర్తించిన తరువాత కూడా సరిదిద్దుకోవటానికి ప్రయత్నించరు. ఆనాటివారు మాత్రం తప్పులను సరిదిద్దుకొని, కృతజ్ఞతాపూర్వకంగా దైవాన్ని క్షమించమని ప్రార్థించేవారు. ఆ ప్రార్థనే పశ్చాత్తాపమునకు మూలకారణము. దీనిని గుర్తింపజేసే నిమిత్తమై వత్సరాని కొకపర్యాయం విఘ్నేశ్వరపూజ అనేది పెట్టారు. విఘ్నేశ్వరుడు అనగా ఏమిటి? గణపతి అనగా ఏమిటి? గణ అనేది బుద్ధికి సంబంధించినటువంటిది. ణ అనేదివిజ్ఞానమునకు సంబంధించినది. విజ్ఞాన ప్రజ్ఞానములకు ఆధిపతి గణపతి , వినాయకుడు .అనగా తనకంటే నాయకుడు మరొకడు లేడు. తనకు తానే నాయకుడు. అలాంటి వినాయక తత్త్వము ఎవ్వరికీ కీడు తలబెట్టదు. సర్వకర్మలకును ఆవిఘ్నమస్తు అని ఆశ్వీరదించి పోషించేవాడు వినాయకుడు. చెడ్డను ఏమాత్రం దరికి చేరనిచ్చేవాడు కాదు. అతనిది. ఎలుక వాహనము. "మూషికము అనగా చీకటి. రాత్రులయందు చీకటి వుంటుంది. కనుకనే ఎలుకలు కూడానూ రాత్రి యందు సంచరస్తాయి. దైవత్వమనేది కేవలం మానవత్వమునకే పరిమితం కాకుండా, యావత్ క్రిమికీటకాలకు, జంతుజాలాలకు కూడా ఆదర్శవంతమైనదనే సత్యాన్ని నిరూపించే నిమిత్తమై, విఘ్నేశ్వరునికి ఏనుగుతల, ఎలుక వాహనం రెండింటిని సృష్టించారు.
ఏనుగు చాలా తెలివి గలది అందువలననే గజ తెలివి అని వాడుకలో వచ్చింది. ఏనుగు చాలా విశ్వాసం కలది. ప్రాణంపోయినా సరే యజమానిని మరువదు. కృతజ్ఞతకు ఆదర్శం గజం. కృతజ్ఞత అనేది చాలా పవిత్రమైనది. క్షమాస్వరూపమే గజము. ఏ దారిలేని ఆరణ్యంలో ఏనుగుఒక తూరి ప్రవేశించిందంటే, మనుషులు నడవడానికి దారి ఏర్పడుతుంది. కనుకనే జీవితారణ్యమునందు మార్గము కనిపించని మానవులకు మార్గము చూపించేది ఈ గజము. అట్టి తెలివి తేటలు గల శిరస్సును ధరించి నటువంటివాడు వినాయకుడు. తన తెలివితేటలచేత మానవునికి ఆదర్శమైన మార్గమును నిర్దేశించేవాడు వినాయకుడు.
(శ్రీ. సె .2001వు.12)