ధర్మరాజు స్వర్గానికి పోయేదారిలో ఒక కుక్క అతనిని అనుసరించినది. ద్రౌపది పోయింది. అర్జునుడు పోయినాడు, భీముడూ పోయినాడు, నకుల సహదేవులు కూడా పోయారు. ఎవరెవరి స్థానములలో వారు వారి ప్రాణములు వదలుతూ పోయారు. కట్టకడపటికి ఆ కుక్క మాత్రమే ధర్మజుని చివరివరకు అనుసరించింది. స్వర్గమునకు పోయే ముందు దైవదూతలు అక్కడకు చేరి ధర్మజా! నీవు మాత్రమే స్వర్గానికి పో! అని చెప్పారు. అపుడు ధర్మరాజు ఇంతకాలము నన్ను అనుసరించి, జంటగా ఉంటూ వస్తున్నది ఈ కుక్కయే కానీ, కట్టుకున్న భార్యా నావెంట రాలేదు. కడకు సోదరులు రాలేక పోయారు. ఈ కుక్క మాత్రం నన్ను ఆశ్రయిస్తూ వచ్చింది. ఇది నన్ను ఆశ్రయించింది కాబట్టి మొదలు దానికి స్థానం ఇవ్వండి. తరువాత నేను వస్తాను. అని చెప్పాడు. ధర్మజుడనగా నీతినిజాయితీలు అనుసరించేవాడు. నమ్మినవారిని మోసము చేయకూడదు. నమ్మి సహాయం చేసినవారికి ద్రోహం చేయకూడదు. (దీ.పు.8)