అర్జునునకుఅనేక పేర్లున్నాయి.అర్జున,ఫల్గుణ,పార్థ,శ్వేతవాహన,బీభత్వ,కిరీటి,సవ్యసాచి,ధనంజయ. ధనుంజయ అనేది కడపటి బిరుదు. ఈ బిరుదులు ప్రతి ఒక్కటి లోకరీతిగా సంపాదించుకొన్నది. ప్రపంచములోపల అనేక మందికి అనేక బిరుదులుంటాయి. పద్మశ్రీ,, పద్మవిభూషణ లాంటివి. ఎవరిస్తున్నారు? ఇవి ప్రభుత్వము నుండి వస్తుంటాయి. అర్జునకు యీ టైటిల్సు యెవరిచ్చారు? సాక్షాత్ కృష్ణుడే యిచ్చాడు. కట్టకడపటి టైటిలు యేమిచ్చాడు? శ్రణ్వంతు విశ్వే అమృతస్యపుత్రా అన్నాడు. నాయనా నీవు అనృతపుత్రుడుకాదు,అమృతపుత్రుడవుఅనిఅనృతాన్ని యేమాత్రము నీవు లెక్క చేయవద్దు అని చెప్పాడు. గాండీవమును పొందే నిమిత్తమై ఏకస్తంభము పైన అనేకవర్షములు తపస్సు ఆచరించాడు. కట్టకడపటికి తీవ్ర వైరాగ్యముచేతను, తీవ్రమైన దీక్షచేతన పట్టుదలచేతను దృఢముచేతను, ధైర్యము చేతను, అనేక యిబ్బందులు అతనిని వెంటాడినప్పటికిని యెదుర్కొని యీ ధనుస్సును సాధించాడు. ఈ ధనుస్సును సాధించుటకు పూర్వము పంచభూతములు అతనికి యెదురు తిరిగినాయి.
కానీ లెక్క చేయక సాధిస్తూ వచ్చాడు. ధనుస్సును సాధించినవాడు కనుక అర్జునా నీవు ధనుంజయుడవు అన్నాడు. దానినే లోకరీతిగా ధనంజయా అని పిలుస్తూ.. వచ్చారు. దీనికి అర్థము లేకపోలేదు. రాజసూయ యాగము చేయటానికి ధర్మరాజు పూనుకున్నాడు. కానీ ధూర్తులైన దుర్మార్గులైన దృతరాష్ట్రుని కొడుకులు దుశ్శాసన, దుర్యోధనాదులు రాజ్యమేలుతున్నారు. పాండవులకు ఖజానాలో పైసా లేదు. ధర్మరాజు అర్జునునకు చెప్పాడు. తమ్ముడా! మనము రాజసూయయాగము చేయటమంటే సామాన్యమైనది కాదు. కృష్ణుడేమో చేయుమని చెబుతున్నాడు. దీనికి తగిన ధనము మనకవసరమే కదా! దీనిని ఎక్కడ ప్రోగు చేసుకోవటము అన్నాడు. అప్పుడు అర్జునుడు చెప్పాడు. కల్పవృక్షమును దగ్గర పెట్టుకొని మనకు యీ కంగారు యెందుకన్నా! సర్వరక్షకుడైన కృష్ణుడే మనకు రక్షకుడుగా వుంటున్నప్పుడు ధనమునకు యేమి తక్కువ? తను ఒక తూరి ఆశీర్వదించి పంపితే కావలసినంత ధనమును తెస్తా నన్నాడు. అర్జునుడు రాజసూయయాగ నిమిత్తమై ధనము నిమిత్తమై డొనేషన్లకు బయలుదేరాడు. ధర్మజుడురాజసూయాగముచేస్తున్నారనేదివినేటప్పటికియెవ్వరూ వెనుకంజవేయలేదు. ఎవరి తలపుల వద్దకు పోనక్కర లేదు. రాజులే వచ్చి అర్జునుని చూచి కావలసినంత ధనమును యిచ్చారు. ఈ ధనమును అర్జునుడు ఏనుగులతో తీసుకొని వచ్చాడు. ధనము రాసులుగా బయలుదేరినది. కృష్ణుడు వచ్చి చూచాడు. ఏమి తెలియనట్లు "ధర్మజా ! యింత ధనమెక్కడ నుండి వచ్చింది?" అన్నాడు. అప్పుడు ధర్మరాజు మన సోదరుని ప్రభావమని అర్జునుని చూపించాడు. అప్పుడు కృష్ణుడు ధనంజయా అని పిలిచాడు. ధనమును పోగుచేసివాడుకనుక ధనమును జయించినాడు కనుక,ధనంజయుడని,ధస్సునుజయించినవాడు కనుక ధనుంజయుడని యీ విధమైన పేర్లు రావటం చేతనే కృష్ణుడు మాటిమాటికి ధనంజయా, పార్ధా అనే పేర్లతో అతనిని సంబోధిస్తూ వచ్చాడు. అర్జునునకు పార్ధాయనేది ప్రధానమైన ఒక పేరు. పృథ్వీ (పృధా) పుత్రుడు కనుక అతనికి పార్థుడు అని పేరు.
(శ్రీగీ పు. 47/48)
భగవద్గీత విన్నవాడు అర్జునుడు.పాండవులలో ఎంత గొప్ప వారుంటున్నారు. మహాధర్మమూర్తి అయిన ధర్మజుడే వుంటున్నాడు. ధర్మజునికి యింత పవిత్రమైన గీత ఎందుకు బోధించి వుండకూడదు? అతనికి సర్వబలములు వుంటున్నాయి. పోనీ భుజబలము, బుద్ధిబలము, గజబలము వుండేవాణ్ణి చూస్తామా అంటే భీముడున్నాడు కదా! భీమునికి ఎందుకు బోధించి వుండకూడదు? అర్జునికి మాత్రమే ఎందుకు బోధించాలి? దీనిని మొట్టమొదట యోచించాలి. ధర్మజుడు మంచివాడే, ధర్మమూర్తియే. అయితే అతనికి పూర్వతాపము లేదు. పశ్చాత్తాపము వుంది. అనగా ముందు జరగబోయే దానిని గురించి తాను యేమాత్రము విచారించడు. జరిగిన తరువాత అయ్యో! యీవిధముగా జరిగిపోయిందే అని విచారిస్తాడు. ఇంక భీమునకు భుజబలముంది, కండబలముంటుండాది గాని బుద్ధిబలము లేదు. తనకేమైనా కోపము వచ్చెనా పెద్ద వృక్షమున వేళ్లవరకు పెరికి అందరితోనూ పోట్లాడటానికి సిద్దమవుతాడు. కాని బుద్ధిబలము తక్కువ. అర్జునునికి పూర్వతాపమే వుంటుండాది. యుద్ధమునకు పూర్వమే అర్జునుడు "కృష్ణా యింతమంది బంధువులను మిత్రులను చంపి యీ రక్తపు కూడు భుజించుటకంటె నేను బిచ్చమెత్తటానికైనా వెడతాను. నేను యుద్ధము చేయను" అన్నాడు ముందుగానే, పూర్వతాపమే తాను అనుభవించాడు అర్జునుడు. ధర్మరాజు అట్లా చేయలేదు. యుద్ధమంతా అయిన తరువాత విశ్రాంతిగా యింటిలో కూర్చుని అయ్యో! నా బంధువులందరు పోయారే. నావారందరూ వెళ్లారే ఇంక నేను రాజ్యము యేలి ప్రయోజన మేమిటి? అని అప్పుడు విచారిస్తూ వచ్చాడు పాపం. వేగిరించినచో అది విషమగును. కనుకనే
తమరు చేయంగవలయు కార్యమునుగూర్చి
మంచి చెడ్డలు చక్కగా నెంచి చూచి
చేయుచుందురు గాక యే చింత లేక
వేగిరించినచో నది విషమె యగును.
ఇది దశరథ మహారాజు యొక్క స్వభావము కూడ.దేవాసుర యుద్ధమునందు తోడ్పడుటకై తన మూడవ భార్యకైకను తీసుకొని వెళ్ళాడు. కైకేయి కేకయరాజపుత్రిక. ఆమె అస్త్రశస్త్రవిద్యలు గొప్పగా తెలిసినది. కృష్ణావతారములో సత్యభామ, రామావతారములో కైకేయి అస్త్రశస్త్ర విద్యలలో ఆరితేరినవారు.దశరథుడుయుద్ధము చేస్తున్న సమయములో, రథచక్రమునకు ఒక సీల వుంటుంది అది వూడిపోయింది. అది పూర్తిగా వూడి పోయిందంటే చక్రము క్రింద పడిపోతుంది. ఆసమయములో తన భర్తకు అపజయము కలుగుతుందో యేమోనని తన వ్రేలిని రంధ్రములో పెట్టి కాపాడింది. ఈ విజయమును సాధించిన తరువాత దశరథ మహారాజు చూచాడు కైకేయి చేతి మంచి రక్తము కారిపోతుండాది. ఈ దృశ్యమును చూచి కైకా! నీవలన నేను విజయమును సాధించాను. కనుక నీవు యేమైనా రెండు వరములు కోరుకో యిస్తాను అన్నాడు. సమయమూ చెప్పలేదు. ఆ కోరికలూ చెప్పలేదు. నీయిష్టమొచ్చిన సమయములో నీ యిష్టమొచ్చిన కోరికలు కోరుకోమని రెండూ ఆమెకే అప్పచెప్పాడు. ఒక కాలమైనా నిర్ణయము చేయాలి. లేదా కోరికలైనా నిర్ణయం చేయాలి. ముందు వెనుకలు యోచించుకొనకుండా వరము లిచ్చేశాడు. ఆమెకు యిష్టము వచ్చిన సమయములో యిష్టమొచ్చిన కోరికలే కోరుకుంది. అప్పుడు ఎవరిది తప్పు కైక తప్పా ? దశరధుని తప్పా? దశరథుని తప్పు.కనుకనే వేగిరించినచో అది విషమె యగును అన్నారు. తొందరపడటము కొన్ని విషయములలో ప్రమాదమవుతుంది.
అదేవిధముగనే యిక్కడ అర్జునునియందుండిన ప్రేమచేత ముందూ వెనుక యోచించకుండ కృష్ణుడు పనిచేయలేదు. అర్జునుడు ముందు వెనుకలు యోచించి యుద్ధమునకు సిద్ధమయ్యాడు. యుద్ధములో ఎంతమంది బంధుమిత్రులు పోతారో! ఇదంతా జరిగిన తరువాత నేను యెవరి కోసము యుద్ధము చేయాలి. ప్రజలే లేనప్పుడు రాజ్యమేమిటి? అని ముందు రాబోయే విషయాన్ని యోచిస్తూ వచ్చాడు. పశ్చాత్తాపము కాక పూర్వతాపముతో వుండినవాడు అర్జునుడు. ఈ పూర్వతాపము పరిశుద్ధ హృదయమున్న వారికే వస్తుంది. అందువల్లనే అర్జునుడనగా పవిత్రము, పరిశుద్ధ హృదయము కలవాడని అర్థము. శ్రీశైలము యిక్కడకు దగ్గరగా వుంటుంది. అక్కడ మల్లికార్జున-భ్రమరాంబ అని వుంటున్నారు. దీనికి పార్వతీపరమేశ్వరులని అర్థము చెబుతారు. మల్లికార్జున- మల్లి అనగామల్లెపువ్వు. ఎలాంటి మల్లెపువ్వు అది? అర్జున తెల్లని మల్లెపువ్వు. తెల్లని మల్లెపువ్వువంటివాడు యీ మల్లికార్జునుడు. ఈతడే ఈశ్వరుడు. భ్రమర అంబ. పార్వతి యెవరంటే ఒక భ్రమరము - తుమ్మెదట. అంబయైన భ్రమరము తెల్లని మల్లెపూవులో చేరి ఆ మల్లె యొక్క మకరందమును తీసుకుంటుందట. ఈ పార్వతమ్మ మల్లికార్జున అనే ఈశ్వరత్వములో ప్రవేశించింది. భ్రమరాంబ పార్వతి. తెల్లని మల్లెపువ్వులోని మకరందము ఈశ్వరుడు. మల్లెపువ్వులోని మకరందమును గ్రోలేది కనుక ఆమెకుఅర్థభాగములో అధికారముంటుండాది. దీని అర్థము పురస్కరించుకొనియే శ్రీశైలములోమల్లికార్జున భ్రమరాంబయని పేరు పెట్టారు.
ఏతావాతా అర్జున అనగా పవిత్రము, నిర్మలము అని అర్థము. అలాంటి నిర్మలమైన
పవిత్రమైన హృదయము కలిగిన అర్జునుడు కనుకనే ఆనాటి నుండి యుద్ధకాలము
వరకును అనగా 75 సంవత్సరములు విడనాడని జంటగా కలసి మెలసి ఉంటున్నారు.
కృష్ణార్జునులు 75 సంవత్సరములు కలసిమెలసి వుండినప్పటికిని యేనాడును
భగవద్గీత బోధించలేదు. కారణమేమిటి? అంతకాలము బంధుత్వము అనుసరిస్తూ
బావా బావమరదులుగా అనగా దేహాత్మ బావముతోనే జీవిస్తూ వస్తున్నారు.
ఏనాడు అర్జునుడు నేను నీకు శరణుజొచ్చినవాడను అని శరణాగతి పొందినాడో
అప్పుడు కృష్ణుడు గురువయ్యాడు. అర్జునుడు శిష్యుడయ్యాడు. ఆ
సమయంలోనే గీతము బోధించటానికి ప్రయత్నించాడు. అనగా పవిత్రమైన
జ్ఞానమును బడయవలెనన్న గురుశిష్యుల సంబంధము రావాలి.
త్రేతాయుగంలో విజయుడనే రాజు వుండేవాడు. చంద్రగోళపురం రాజధానిగా చేసుకుని సామ్రాజ్యం పరిపాలిస్తూ వుండేవాడు. సత్యం, నీతీ. శాంతీ సుస్థిరంగా నెలకొల్పి బీదలపట్ల సానుభూతీ దుఃఖితులయెడల దయా ప్రదర్శిస్తూ విస్తారమైన ప్రఖ్యాతి సంపాదించాడు. పొలిమేరలలో వున్న రాజ్యాలు ఆక్రమించుకొని సామ్రాజ్యం విస్తరించుకో వాలనే బలీయ మైన కోరిక కలిగింది. శాస్త్ర నియమాలను అతిక్రమించడనే విశ్వాసంతో ఆయన గురువు గర్గుడు విజయప్రయత్నాలను ఆమోదించాడు. దైవ సహాయం సంపాదించేమంత్రమును ఉపదేశించాడు. ఆ మంత్రం నేర్చు కుని జపించగానే హనుమంతుడూ జాంబవంతుడూ సుగ్రీవుడూ ప్రత్యక్ష మయినారు. మాకు ఏమి ఆజ్ఞ ఇస్తారో చెప్పండి అన్నారు. విజయుడు తనకు నేల నాలుగు మూలలనూ జయించాలనే కాంక్ష కలిగిందనీ అదితీరే వరకూ తనకు విశ్రాంతి లేదని చెప్పాడు. హనుమంతుడూ సహచరులూ చెప్పారు. “ఇది అసంభవం, ఇంటికి వెళ్లు. ఇది నీకు ద్వాపరయుగం లోనే సాధ్యమౌతుంది. " రాజభవనానికి విజయుడు తిరిగి వెళ్లిపోయాడు. ద్వాపరయుగంలో విజయుడే అర్జునుడుగా జన్మించాడు. ((శ్రీ సత్య సాయి వచనా మృ తము 1963 పు 169-170)