పరులను నిందింప ఒప్పుకుందురు గాని
తమను తాము నిందింప తలచ నేరరు
పరుల రూపంబు చూచి వెక్కిరింతురు గాని
తమ రూపంబు చూడ నేరరు
ఇతరులను హేళన చేయుదురు గాని
తమను తాము హేళన చేయబోరు
ఇతరుల మాటలు వెక్కిరింతురు గాని
తమ మాటల తప్పులు గాంచలేరు
పుట్టినప్పుడే ఈ బుద్ధి పట్టుబడిన
ఇంతకన్న పాపమెత్తి కలదు.
(ప్ర.ప.పు.20)
మీకు ధైర్యమును, సంతోషమును కలుగచేసి మీలోనున్న బలహీనతను, భయమును పారద్రోలడమే నా లక్ష్యము. మిమ్మల్ని మీరు పాపులని నిందించుకోకండి; నిజానికి, పాపమనే మాటేలేదు; మీరు చేసే పొరపాట్లు మాత్రమే. అయితే, చేసిన పొరపాట్లకు మీరు మనస్ఫూర్తిగా పశ్చాతాపము చెంది చెడుపనులను, మీలో ప్రవేశించిన దురలవాట్లను తొలగించుకునే శక్తి సామర్థ్యాలు మీకు ప్రసాదించుమని భగవంతుని ప్రార్థించండి.
(దై.పు.299)
నిండుసభలో దుర్యోధన దుశ్శాసనాదులు ద్రౌపదిని పరాభవించడానికి ప్రయత్నించారు. ఆమె శాంతంగా భీష్ముని వద్దకు వెళ్ళి "పితామహా! ధర్మజుడు తానోడి నన్నోడెనా, లేక నన్నోడి తానోడెనా? చెప్పండి" అన్నది..
మొట్టమొదట ధర్మజుడు తనను తాను ఒడ్డుకున్నాడు. తాను ఓడిన తరువాత ద్రౌపదిని ఒడ్డే అధికారం అతనికి లేదు. కాని ద్రౌపది ప్రశ్నకు ద్రోణుడుగాని, భీష్ముడుగాని ఎవ్వరూ జవాబు చెప్పలేదు. ధృతరాష్ట్రుడు పెదవి విప్పలేదు. అప్పుడే విదురుడు చెప్పాడు - "నరకమునకు పోయేవారు కేవలం పాపం చేసినవారు మాత్రమే కాదు, పాపం చేయడానికి పురిగొల్పినవారు, పాపం చేయడం చూసినవారు, పాపం చేయడానికి మార్గం తెలిసేవారు పాము పాదములు కూడా నరకానికి పోతారు. పాపం చేయడం చూస్తూ దానిని తప్పించడానికి ప్రయత్నించనివారికి కూడా నరక ప్రాప్తి ఉంటుంది". భీష్ముడు మహా జ్ఞానియే కానీ నిరపరాధియైన స్త్రీని దుర్యోధన దుశ్శాసనాదులు నిండు సభలో పరాభవిస్తుంటే తానెందుకు వారికి అడ్డు చెప్పలేదు? కనుకనే, 56 దినములు శరతల్పముపై పరుండి ఆ పాప ఫలితాన్ని ప్రత్యక్షంగా అనుభవించాడు. ఆనాడు కౌరవులు చేసిన పాపానికి అడ్డు తగిలి ఉంటే తనకీ బాధ తప్పేదికదా!
(స.సా.మా.99 పు.62/63)
ధ్యానికి కేవలము ఆత్మానంద మార్గమేకాక, లోక హితార్థము కూడా ప్రధానము. అట్లు లోకహితమును కోరుటకు కారీర మానసిక వాక్కులందు కొన్నింటిని కట్టుదిట్టము చేసుకొనవలెను. అవియే దశవిధ పాపములు.కాయకంగా త్రివిధములైన పాపములు, వాక్కున చతుర్విధములైన పాపములు, మానసికంగా త్రివిధములైన పాపములు. అందులో కాయక పాపములు. 1. ప్రాణాతిపాతము 2. పరదారాసక్తి 3. దొంగతనము. ఇంక వాక్కు నందాచరించు పాపములు: 1. యనత్ ప్రలాపములు 2. పారుష్యము 3. పైసున్యము
4.అసత్యము. అటులనే మానసికంగా కూడను: 1. పరధనాసక్తి 2. పరులయెడ అసూయ 3. నాస్తికత్వము; ఈ విధములైన దశవిధ పాపములనూ ధ్యానసాధకుడు చెంత చేర్చక చూచుకొనవలెను. వాటిని పూర్తిగా పరిత్యజించవలెను.
(ధ్యావా.పు.23)
కాలిలో గుచ్చుకొని బాధించేది ముల్లే. ఆముల్లును తీసి మళ్ళీ బాధను నివారణ చేయునదీముల్లే. ఈ బాధకు కాని, నివారణకుగాని ముల్లు వంటిది ఈ మనస్సు, మనము కట్టుకున్నటువంటి బట్టలు మాలిన్యపరచేదీ మట్టే. అట్టి మాలిన్యము చేరినటువంటి బట్టను పవిత్రముగ శుభ్రపరచేటువంటిదీ మట్టే. కనుకనే మనస్సు కూడాను ఒక మట్టివంటిదే. దీనిని పురస్కరించుకొనయే "మృత్తికే హరమేపాపం"అన్నారు. ఈ మనస్సు వల్లనే మన పాపము తీరుతుంది. ఈ మనస్సు వల్లనే మన పాపము పెరుగుతుంది. మనస్సే దేహమును మట్టినుండి పుట్టించినది; తిరిగి యీ యొక్క దేహమును మట్టియందు లీన మొనర్చుచున్నది. కనుక యిట్టి మనస్సు యొక్క ఏకత్వాన్ని కనుక్కునేటటువంటి పవిత్రతను గుర్తించుకోవటము ప్రతి మానవుని కర్తవ్యము. "మనేవ మనుష్యాణాం కారణం బంధమోక్షయోః" అనగా బంధమునకును, మోక్షమున కున్సూ మనమనస్సే కారణమనేటువంటి సత్యాన్ని గుర్తించుకొని మన మనస్సు ఊహలచేత పవిత్రపరచుకొని తద్వారా మన యొక్క భ్రాంతులు కూడను అరికట్టుకోవటానికి ప్రయత్నము చేయటము సాధకుని యొక్క ప్రధాన కర్తవ్యము.
(మ.మ.పు.3/4)
మనస్సు కేవలము ఒక స్టీరింగు (Steering) వంటిది. ఈ స్టీరింగును మనము లోపల త్రిప్పుతూ రావటం చేత బయటనున్న టైర్లు, ఆంతకూడను రోడ్డులో పల, యెట్ల త్రిప్పితే అట్ల దొర్లుతుంటానికి పూనుకొంటుంటాయి. మనస్సు ద్విపాత్రాభినయము చేసేటువంటిదని మొన్న చెప్పాను. రెండు రకములైన అభినయములు చేస్తుంటాది. మంచిగాను చేస్తుంది: చెడ్డగాను చేస్తుంది. మనస్సు కేవలము కెమెరా లెన్సు (Camera Lens) వంటిది. ఎటువైపు త్రిప్పి స్విచ్ వేస్తే ఆ పిక్చరు (Picture) దాంట్లో వచ్చి చేరిపోతుంటాది. కానీ నేటి మానవుల యొక్క జ్ఞానము ఏ రీతిగా వుందనగా, దైవమును కోరుతున్నారు ప్రపంచమువైపు ఈ లెన్సును త్రిప్పి స్విచ్ ఆన్ చేస్తున్నారు. తదుపరి ఈ పిక్చరులో చూస్తున్నారు. ప్రపంచమే కనబడుతుండాదే అని భ్రమించి, ఆశించినది లభించలేదే అని నిరుత్సాహము నకు గురియై పోతున్నారు.
(మ.మ.పు36)
(చూ॥ మూడు విధములైన పాపములు, ప్రేమ)