భరతుడు

రాముని సోదరులైన భరత శత్రుఘ్నులు చతురంగబల సమేతులై తల్లులతో మంత్రులతో ప్రయాగ చేరుకొన్నారన్నవార్త భరద్వాజ ఆశ్రమవాసులకు తెలిసిన భరద్వాజ మహర్షి తమ శిష్యులను పంపి ఆశ్రమమునకు ఆహ్వానించెను మహాఋషి ఆజ్ఞానుసారము భరతుడు తమ్మునితో ఆశ్రమమును ప్రవేశించెను మునిరాజునకు ఇరువురూ నమస్కరించిరి. భరద్వాజ మహర్షి వారలను లేదు ఎంతో వాత్సల్యముతో వారలను దగ్గరకు చేర్చుకొని చల్లని పానీయములు తెప్పించి ఇప్పించెను.

అయితే మహాఋషి తనను ఏమి ప్రశ్నించునో? ఏమి అడుగులో - భరతుడు లోలోన భయపడుతూ, సిగ్గుచే శిరస్సును వంచుకొని, వింత నుండునటుల కనిపించెను. మహర్షి భరతుని స్థితిని గమనించి "భరతా! భయపడనక్కరలేదు, నాకు సర్వమూ విదితమే. విధికృతములు ఒకరి అధీనములు కావుకదా! నీ తల్లికోరిన కోర్కెను నీవు తలంచి విచారించ పనిలేదు. ఆమె దోషము ఇందులో ఏ మాత్రమూ లేదు. దైవ సంకల్పమే ఆమె బుద్ధిని ఆ రీతిగా మార్చినది; కైకకు శ్రీరాముడన్న మహా ప్రాణము; అట్టి తల్లి ఇంతటి కఠిన చర్యకు పాల్పడెనన్న " దైవకృతమే కాని మానవమాత్రుల ప్రయత్నములు కావు.

లోకవాడుక ప్రకారము కైక దోషి; వేదాచార ప్రకారము సరస్వతి దోషి; వీరిరువురు పరమాత్మకు సమ్మతమే. ప్రభువు స్వేచ్ఛానుసారము సర్వమూ జరిగెను. భరతా! నీ నిర్మలకీర్తిని గానము చేయుటవలన లోకములకు,వేదములకూ గొప్పతనమువచ్చును. ఏ కొమారునికి తండ్రి రాజ్యము ఇచ్చిన, వాడే రాజ్యము చేయుట కర్హుడు అని లోక సిద్ధాంతము. అదియే వేదవాక్యము. ఆ సత్యసంధుడు, మహాత్ముడు, దశరథమహారాజు నిన్ను బిలిచి నీకు రాజ్యమిచ్చి రాజ్యధర్మముల ననుసరించి ప్రవర్తింపుమని చెప్పెను. శ్రీరాముని వనగమనము సకల అనర్థములకూ మూలమయ్యెను. .. అందులకు - లోకమంతయూ విచారించెను. ఇప్పుడు నీ తల్లి , పూర్వము తాను చేసిన పనికి విచారించెను, ఈ విషయములో నీ అపరాధ మేమాత్రమూ లేదు; నీవు రాజ్యమును ఏలిననూ ఫరవాలేదు; నీవు రాజ్యము నేలుచున్నావన్న విషయమును విన్న శ్రీరాముడు కూడా సంతసించును. అంతేకాదు, నీవు ఇప్పుడు పూనుచున్న పని శ్లాఘనీయము. నీ యుద్యమము సర్వోత్కృష్టము. శ్రీరాముని చరణారవిందముల యందు అనురాగము కలిగియుండుటయే సకల సన్మంగళములకు మూలము. భరతా! నీ యంతటి గుణశాలి, అదృష్టవంతుడు, వేరోకడు లేడనే చెప్పవచ్చును. రాముని ప్రియసోదరుడవనుటలో సార్థక నామమును అందుకొంటివి. శ్రీరామచంద్రుడు వనమునకు వెళ్లు మార్గమధ్యమున మా ఆశ్రమమును పవిత్రము చేసెను. ఆనాడు అర్ధరాత్రి వరకూ రామప్రభువు నీ గుణములనే , వర్ణించెను. వారు ప్రయాగకు స్నానము చేయుటకు నాతోనే వచ్చిరి. స్నాన మాచరించు సమయమున కూడనూ నిన్ను తలంచి, “అయోధ్యను విడచునపుడు నా సోదరులైన భరత శత్రుఘ్నులను చూడనైతిన”ని ఎంతో విచారించెను.రామునకు మీ పైనున్న ప్రేమ ఇంతయని చెప్పలేను.
అంతేకాదు. అతడు ప్రణతార్తిహరుడు. అతనికి లోకమే కుటుంబము మూర్తీభవించిన శ్రీరాముని వాత్సల్యమే నీవని నా అభిప్రాయము : విషయమును నీవు కళంకమని తలంచుచుంటివో ఆ విషయము నావంటి వాడు ఉపదేశమనే నా అభిప్రాయము. భరతా! నీవు చింతించకూడదు. చింతామణిని స్వీకరించి దరిద్రమని తలంచుట మంచిది కాదు. సీతారామ లక్ష్మణులను దర్శించుటయే సకలసాధనములకు ఫలము. ఆ ఫలము నాకు లభించెను. కన్నులార వారిని చూచితిని; సంభాషించితిని; స్పర్శించితిని; ఆతిధ్యము నంధించితిని. అంతో ఇంతో శేషము కొంత ఉన్నది. నీ దర్శనముతో పూర్తి అయినది. నేను ధన్యుడను. ఇట్టి మునులను పవిత్ర మొనర్చుటకే రామచంద్రుడు వనవాసము చేసెను. ధన్యులము!” అని ఈవిధముగ భరద్వాజ మహా ఋషి భరతుని అనేక విధముల కొనియాడెను. భరద్వాజుని నేత్రములనుండి ఆనంద బాష్పములు ఏకధారగా నేల రాలెను. (రామ కథా రసవాహిని ప్ర ధమ భాగం పు292-294)

 

 

భరతుడు రామునికంటె ఏ మాత్రము కూడను తీసిపోడు. సత్య శీలమునందుకాని, ధర్మమునందుకాని, త్యాగమునందుకాని అతడు రామునితో సరిసమానము. లోకరీతిగా భరతుని మనము మూడవవానిగా భావిస్తున్నాము. రామ లక్ష్మణ భరత శత్రుఘ్ను లని అతనిది మూడవస్థానముగా మనము యెంచు తున్నాము. కాని, వారి జన్మకాలమును మనము చక్కగా విచారంచినపుడు, భరతుడు రెండవవాడు. వీరి జన్మకాలమునందు కొన్ని గంటలు మాత్రమే వ్యత్యాసము కన్పిస్తున్నది. అంతమాత్రముచేత అతడు పెద్దవాడు, ఆ చిన్నవాడు అనుటకు ఏమాత్రము వీలుకాదు. ఇది కేవలము మానవుల తృ ప్తినిమిత్తము మాత్రమే. ఈశ్వరాంశసంభూతులైన ఈ లక్ష్మణ భరత శత్రుఘ్నుల యొక్క తత్త్వాని మనము గుర్తించుకోలేకపోతున్నాము.


భరతుడు తాతగారింటిలో కాలము గడుపుచున్న సమయములో అతనికొక లేఖను పంపారు “ఈ లేఖను చూచిన తత్క్షణమే - నీరు అయోధ్యకు రావలెను” అని. భరతుడాలేఖను చూచుకొని, రాముని పట్టాభిషేక నిమిత్తమై ఈ ఆహ్వానము వచ్చియుండ వచ్చునని చాలాసంతోషించి నా డు. కాని, మరియొక పర్యాయము యోచించి “రాముని పట్టాభిషేకము - సత్య మైయుండిన తాతగారికి కూడను ఆహ్వానము వచ్చియుండెడిది - ఆహ్వానము రాలేదు. కనుక, ఈ ఆహ్వానము పట్టాభిషేకమునకుసంబంధించినదై యుండదు, మరి ఏమై యుండవచ్చును?” అని తాను కొంతవరకును యోచనలో ఉండిపోయినాడు. తరువాత, ఈ విధమైనటువంటి మానసిక ఆందోళనతోనే బయలుదేరి శత్రుఘ్నునితో చేరి ప్రయాణము సల్పుతూ వచ్చాడు.


అయోధ్యకు వచ్చి చేరినాడు. సింహద్వారము జూచినాడు. భరతుడు సూక్ష్మణుద్ధి కలిగినటువంటి వాడు. అందువలననే త్యాగరాజు “లక్ష్మీదేవి వలచునా? లక్ష్మణుండు కొలుచునా? సూక్ష్మబుద్దిగల భరతుడు చూచి మ్రోక్కునా? అబ్బ! రామభక్తి ఎంత గొప్పరా!” అని వర్ణిస్తూ వచ్చాడు. అలాంటి సూక్ష్మబుద్ధి గల భరతుడు సింహద్వారమువంక చూచాడు. ద్వారమునకు కట్టిన తోరణములు, ఎండు మామిడి ఆకులతో వుంటున్నవి. పచ్చతోరణములతో నిత్యకల్యాణముగా కళకళలాడుతూ, కిలకిలలాడుతూ వుండే సింహద్వారము ఇట్లా ఎండిపోయిన తోరణాలతో వుండుటకు కారణమేమి? అని యోచించాడు అశుభమేమైనా జరిగి యుండునా? అని చింతించాడు. తాను పురములో ప్రవేశించినప్పుడు రాజవీధులలోని గృహములన్నియు మూయబడియున్నవి వీథులన్నియు దుమ్ముతో నిండియున్నవి. ఒక్క పౌరుడైనను సంచారము చేయుట లేదు. ఏమో జరిగియుండవచ్చునన్న అనుమాన మతనికప్పుడే కలిగినది. ఈ విధమైనటువంటి ఆందోళనతో అతడు కైకేయి మందిరమునకు వెళ్లాడు. విచిత్రమైన ఆమె ముఖమును చూచి గుర్తించలేకపోయినాడు. కొన్ని నిమిషముల పోయిన తరువాత తండ్రి యొక్క మరణము, రామునియొక్క అరణ్యవాసము తాను గుర్తించాడు. దుఃఖమును భరించుకొనలేక, వసిష్ఠులవారి దగ్గరకు పరుగెత్తుకొని వెళ్ళినాడు. వసిష్ఠులవారు ఉన్న సంగతంతయు, జరిగిన సంగతులన్నియు విపులముగా చెప్పినారు. ఆ వార్తలను విని మండిపడ్డాడు భరతుడు. తన దేహము తనకు కనుపించలేదు. కన్నులు ఎఱ్ఱబరచుకొన్నాడు. ఉద్రేకముచేత తల్లిని అనేక విధములుగా దూషించాడు. ఒక్క క్షణమైనకూడను అచట ఆగలేకపోయినాడు. నేరుగా కౌసల్య దగ్గరకు వెళ్లినాడు. కౌసల్య పతివియోగ దుఃఖమును, కుమారునియొక్క అరణ్యవాస దుఃఖమును భరించుకొనలేక కృంగిపోతున్నటువంటి దృశ్యమును చూచాడు. పరుగెత్తుకొని పోయి భరతుడు కౌసల్య పాదముల పైనపడి "తల్లీ నన్ను క్షమింపుము. ఈ అపరాధమునకు నేను కారకుడను కాను. నాకేమాత్రము తెలీదు. నేను నిర్దోషిని అని చెప్పుకొన్నాడు. కౌసల్యయు, వసిష్ఠులవారును “మొదట తండ్రి అంత్యక్రియలు ఆచరించు; తదుపరి విషయము ఆలోచించుకోవచ్చును” అని సమాధానము చెప్తూ వచ్చారు. అప్పటికి దశరథుడు గతించి పదునాలుగు దినములు అయినది. ఆయన దేహము తైలమునందుంచబడినది. ఈనాటి వలె ఐస్ (Ice) అని, ఇంకొకటని, ఇంకొకటని దేహము చెడిపోకుండా వుంచేటువంటి పరికరములు ఆనాడు లేవు. ఈ దృశ్యమును చూచి భరతుడు "అంత్యక్రియలు ఆచరించే అధికారము నాకు లేదు. శ్రేష్ఠుడు, జ్యేష్ఠపుత్రుడు అయిన శ్రీరామచంద్రుడు వచ్చి ఈ అంత్యక్రియలు ఆచరించాలి” అని పటుపట్టాడు. “రామచంద్రుడు లేనటువంటి ఈ అయోధ్యలో నేను క్షణకాలమైనను జీవించుటకు వీలుకాదు; ఉండుటకు వీలుకాదు” అన్నాడు. తండ్రిపోయిన పోయిన దుఃఖమును కూడను మరచి, రామచంద్రుని యొక్క వియోగమునకై - తపించినటువంటి వ్యక్తి ఈ భరతుడు. అతడు తల్లియైన కౌసల్య యొక్కబోధను వసిష్ఠులవారి యొక్క ఆజ్ఞను పురస్కరించుకొని అంత్యక్రియలు ఎట్లో ఆచరించాడు.


రెండవదినమే భరతునికి పట్టాభిషేకము జరిపే నిమిత్తమై అన్ని సామగ్రులును ప్రోగుచేయబడినవి. కాని, అందులకు భరతుడు ఏమాత్రము అంగీకరింపక, ఆ సమస్త సామగ్రిని తీసుకొని అందరును తనతో అరణ్యమునకు రావాలని ఆజ్ఞాపించాడు. “ఇక్ష్వాకుల వంశములో జేష్ఠపుత్రుడైనవాడికే రాజ్యపట్టాభిషేకమునకు అధికారముకాని, కనిష్ఠునకు ఏమాత్రము అధికారము లేదు. నేను అన ర్హు డను” అని కూడను విలపిస్తూ వచ్చాడు. ఇది ధర్మవిరుద్థమైనటువంటి కార్యమని తాను గుర్తించి, వసిష్ఠులవారిని కూడను ప్రార్థించి,పురప్రముఖులందరిని కూడను ప్రార్థించి, అందరితోపాటు తాను అరణ్యమునకు పోవాలని అన్ని ఏర్పాట్లు గావించుకొన్నాడు. అరణ్యమునందే మధ్య పట్టాభిషేకముకూడను చేయవచ్చునని అతని ఊహ.


రాముడు ప్రజారంజకుడును, ప్రజల యొక్క ఆనందమునకు సర్వమును త్యాగము చేసేటువంటివాడును కనుక, ప్రజల యొక్క అభిప్రాయమును కూడను అక్కడ తెలుపవచ్చుననేటువంటి ఉద్దేశముచేత ప్రజలను కూడను తన వెంటబెట్టుకొని వెళ్ళినాడు. ఈ విధముగా చతురంగ బలసమేతుడై అరణ్యమునకు ప్రయాణమయ్యాడు. కొంతదూరమునుంచి చూచినాడు చిత్రకూట పర్వతముపైన వున్న పర్ణశాలను. శ్రీరామచంద్రుడు దర్భశయ్యపైన పండుకొన్నట్టుగా భరతుడు చూచాడు, హృదయము కరిగిపోయినది. తనకు భరించలేనటువంటి దుఃఖము పొంగివచ్చినది. జడలు ధరించినటువంటి శ్రీరామచంద్రుని చూచాడు. “పట్టుపాన్పుల పైన శయనించిన నీవు దర్భశయ్యలపై పరుండినావా?” అని గట్టిగా అరచుకుంటూ వెళ్లి శ్రీరామచంద్రుని పాదములపై పడినాడు. భరతుని దుఃఖమును చూచి రాముడు అనేకరకములుగా అతనికి సమాధానము చెప్తూ వచ్చాడు. ఎన్ని విధములైనటువంటి సమాధానములు చెప్పినప్పటికిని భరతునకు ఏమాత్రము కూడను శాంతి కలుగలేదు. పాదముల పైన పడినటువంటి భరతుడు “రామా! నేను అయోధ్యకు వచ్చి పట్టాభిషేకము చేసుకొంటాను అని నీవు మాటయిచ్చువరకును నేను పాదములను విడువను" అని పట్టుబట్టినాడు.


అలాంటి దుఃఖస్థితియందుకూడను రామచంద్రుడు “భరతా రాజ్యమంతా క్షేమమా? సక్రమమైనటువంటి పరిపాలన జరుగుచున్నదా? తల్లితండ్రులు క్షేమముగా ఉన్నారా?” అని క్షేమవార్తలు పరమశాంతంగా పలుకరిస్తూ వచ్చాడు. ఈ సంభాషణలయందు తండ్రియొక్క మరణమును భరతుడు చెప్పాడు. ఆ వార్త విన్న రాముడు నిజముగా సాక్షాత్ నారాయణ మూర్తి అయినప్పటికినీ మానవాకారం ధరించటంచేత, ఆదర్శవంతమైన జీవితం లోకానికి అందించునిమిత్తమై తానుకూడను తండ్రి యొక్క వియోగము భరించనటువంటి రీతిగా బాధపడుతున్నట్లు నటించాడు. “ఎండుమట్టితోడ కుండలు కుమ్మరి చేయలేడు నీరు చేర్చికాని”. అదే విధముగనే దైవము జడమును, చైతన్యమును ప్రత్యేకముగా సృష్టించవచ్చును కాని, జడచైతన్య స్వరూపమైనటువంటి దేహమును సృష్టించుటకు దేహమును ఆవిర్భవింప చేయుటకు తల్లితండ్రులే మూలకారణమనే విషయాన్ని తాను నిరూపిస్తూ వచ్చాడు. దీనికి తల్లితండ్రులే కారణమని కూడను చెప్పాడు. కాబట్టి మానవజన్మమునకు దైవం సాక్షిభూతుడు అయినప్పటికినీ, తల్లితండ్రులే దీనికి మూలకారణమని కూడను తాను భావిస్తూ వచ్చాడు. కనుక, అట్టి తల్లితండ్రులకు తన జీవితమునందు తగినటువంటి కృతజ్ఞతను ప్రకటింపయత్నించుట కర్తవ్యమని కూడను తాను విశ్వసించాడు. కనుకనే "మాతృదేవోభవ; పితృదేవో భవ, ఆచార్యదేవోభవ, అతిథి దేవోభవ" అనుట. తల్లితండ్రులను ప్రసన్నులు గావించుకొనేటందుకు చేసే ప్రయత్నమే మానవులకు ప్రధానమైనటువంటి కర్తవ్యము అని తాను ప్రబోధిస్తూ వచ్చాడు.


రాముడు సోదరులతో చేరి నదికి వెళ్ళి, పితృపిండములు విడిచి, తదుపరి ఇంటికి వచ్చి అనేకరకములుగా క్షేమవార్తలు మాట్లాడుతూ వచ్చాడు. రెండవ దినము భరతుడొక పెద్దసమావేశమేర్పాటు చేసి, ఆ సమావేశములో రామచంద్రా! మే మందరమును నిన్ను అయోధ్యకు తీసుకొనిపోవుటకై ఇచ్చాను. నీవు మావెంట రాకపోతే మేమూ అయోధ్యకు వెళ్లము. నీ సన్నిధిలో ఇక్కడనే ప డి వుంటాము” అని ప్రాధేయపడమని ప్రజలకు బోధించాడు. వాండ్లకు బోధించి “రామచంద్రా! నీవు అయోధ్యకు వచ్చి పట్టాభిషేకమైనా చేసుకోవాలి; లేదా, తండ్రి యాజ్ఞ నీ కెట్టిదో నాకును అట్టిదే కనుక, నీతోపాటు పదు నా లుగేండ్లు అరణ్యములో వుండుటకు నా కనుజ్ఞనైనా యివ్వవలెను” అని గట్టిగాపట్టుపట్టాడు. మరియు, తన తల్లి చేసిన మహాపాపమునకు తాను కారకుడుకానని కూడను మొర పెట్టుకొన్నాడు. అపుడు రామచంద్రుడు చెప్తున్నాడు భరతా! దీనికి కారణము తల్లికాదు. ఆమె విషయమట్లుండనీ. రెండవదినము ఉదయముననే పట్టాభిషేకము కట్టుటకై అన్నిరకములైనటువంటి ఏర్పాట్లు గావించిన తండ్రి, ఆ రాత్రి తాను మార్పుచెందుటకు కారణమేమిటి? ఇది కేవలము దైవసంకల్పమే కాని అన్యము కాదు. దీనికి అన్యులు కారకులు కాదు"అని భరతునకు సమాధానము చెప్పాడు. ఎన్ని సమాధానములు చెప్పినను, భరతుడు తన పట్టుదలమాత్రము వదలలేదు.


భరతుడు రామునివద్దకు వెళ్ళే సమయములో గంగానది ఒడ్డున గుహుడు కూడను అతనిని సంశయించి “భరతా! నీవేమైనా రామునకు కీడుచేసే నిమిత్తమై సేనా సమూహముతో వెడుతున్నావా?” అని ప్రశ్నించాడు. కాని, అక్కడ సమాధానము చెప్పలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు భరతుడు. అందువల్ల అతనికేమీ బదులు చెప్పక “పాపి కైకేయి గర్భమున జన్మించుట వలనకదా ఈ నిందలకూ, నిష్టూరములకూ నేను గురికావలసివస్తున్నది” అని అనేక విధములుగా తల్లిని నిందించి, తన్నుతాను నిందించుకొన్నాడు. అచటనుండి భరద్వాజముని ఆశ్రమానికి వెళ్లాడు. భరద్వాజులుకూడను అదేవిధముగనే భరతుని సంశయించాడు. అక్కడ భరతుడు రామునియెడ తనకు గల భక్తి యెట్టిదో చక్కగా వ్యక్తము గావించాడు. భరద్వాజుడు భరతుని కొంత పరీక్షించ గోరి, పెద్దసింహాసన మొకటి అలంకరించి అక్కడ పెట్టి, విందుకు తగినయేర్పాట్లు చేశాడు. భరతుడు ఆ సింహాసనమును చూచిన తత్క్షణమే ప్రక్కనున్న చామరలలో ఒకటి తాను తీసుకొని, ఒకటి శత్రుఘ్నునకిచ్చి “ఇది కేవలము రామునియొక్క సింహాసనముగానే నేను భావిస్తాను” అని ఆ ఖాళీ ఛేర్ (Chair) కు తాము ఇద్దరూ సేవచేస్తూ నిల్చున్నారు. భరతశత్రుఘ్నులు ఆ ఋషి గావించిన విందులో ఏమాత్రము కూడను పాల్గొనలేదు. రామచంద్రుడు అరణ్యములో కందమూలాదులు భక్షిస్తూ ఉండగా, నేను ఈ పంచభక్ష్యములు భుజించటమా? ఇది మహా అన్యాయమని, తాను భావించుకున్నాడు.


కనుక, ఆనాటి అన్నదమ్ముల యొక్క సన్నిహిత సంబంధాన్ని కాని, ప్రేమనుగాని గుర్తించటములో మనము ఎంతైనా ప్రయత్నము చేయాలి. ఆనాటి రామలక్ష్మణుల ప్రేమతత్త్వమును గుర్తించిన భరతుడు “నాకు ఇట్టి అవకాశము లభించలేదే! కేవలము లక్ష్మణుడు ఒక్కడే రామునితో నివసించడానికి తగిన అర్హత కలవాడుగా ఉన్నాడు. నాకు అట్టి ప్రాప్తి లేకపోయినదికదా!” అని కూడనూ విచారిస్తూ వచ్చాడు. ఈ విధంగా రామునకు నిరంతరము సేవచేస్తూ తన జన్మము సార్థకము గావించుకోవలెననియే భరతుని ఉద్దేశము. భరతునియొక్క భక్తి ప్రపత్తులను అనేక రకములుగా వర్ణించవచ్చును. అతడు లక్ష్మణునికంటే కూడను అతిగొప్పభక్తి కలిగినటువంటివాడు అని కూడను చెప్పవచ్చును. ఇట్టి భక్తిప్రపత్తులు కలిగినటువంటి సోదరులు లోకమునందు అరుదు. అనేక విధములుగా తమ జీవితపర్యంతముకూడను రామచంద్రునికి సేవ గావించుకొంటూ మానవులకు ఆదర్శవంతమైన జీవితాన్ని అందిస్తూ వచ్చారు ఈ అన్నదమ్ములు. ప్రతి కుటుంబమునందుకూడను సోదరులు ఏరీతిగా మెలగాలి, ఒకరినొకరు ఏవిధంగా అర్థం గావించుకుంటూ ఉంటుండాలి అనేటువంటి దీన్ని ప్రత్యక్ష నిరూపణలతో వారు లోకానికి చాటుతూ వచ్చారు.


విద్యార్ధులారా!
మనం మన సోదరులతత్వమును, ఒకరికొకరి మధ్యనుండే సన్నిహిత బాంధవ్యాన్ని చక్కగా గుర్తించి అన్యోన్యమైన ప్రేమతో, లోకకల్యాణమునకై, స మాజము యొక్క క్షేమమునకై ఏదో కొంతభాగమైనను పాటుపడటము పరమ పవిత్రమని మీరు భావించాలి. కుటుంబముయొక్క ఆదర్శాన్ని భారతదేశానికి చాటడానికి తగినటువంటి ప్రవర్తనలో మీరు ఆరితేరాలి. స్వార్థాన్ని త్యాగముచేసి, పరార్థానికి మనం కొంతవరకును ప్రయత్నం చేయాలి. స్వార్థాన్ని పూర్తిగా త్యాగంచేసి, సచ్ఛీలమును పెంచుకొని, పవిత్రమైన ఆదర్శాన్ని అందించటమే రామాయణము యొక్క ప్రధానోద్దేశము. రామాయణములో నున్నటువంటి ప్రతివ్యక్తి కూడను ఇటువంటి ఆదర్శవంతమైన జీవితాన్ని నిరూపిస్తూ వచ్చారు. ఇలాంటి ఆదర్శవంతమైన జీవితము ఈనాడు అత్యవసరము. ఇట్టి ఆదర్శవంతమైన జీవితమునందు మనము కొన్ని క్రమశిక్షణలను పాటించాలి. ఈ క్రమశిక్షణ లేకపోతే ఎన్ని విధములైనటువంటి ఆదర్శాలను అందించినప్పటికిని మన జీవితమునకు విలువ ఉండదు. కనుక, ఈ క్రమశిక్షణలను మనము ఆదర్శమునందుంచుకొని, ఆదర్శవంతమైన జీవితములో సచ్ఛీలమును ప్రధానంగా భావించుకొని, త్యాగమును రెండవ లక్షణముగా తీసుకొని జీవితమును సాగిస్తూ పోవాలి.


భరతుడు రామాజ్ఞ మీరలేక,రాజ్యమేలుట తనకిష్టములేక కర్తవ్యము సంకటస్తితిలో బాధపడుతూ వుండటం చూచి రాముడు “భరతా! నేనయోధ్యకు వచ్చుట నా నియమమునకు భంగము. కనుక, అది అసంభవము. నాకు మారుగా ఏదో ఒక వస్తువును చిహ్నముగా ఇత్తును. దానిని తీసుకొని ఉపశాంతి పొంది, తిన్నగా అయోధ్యకు వెళ్ళు” అన్నాడు. ఆమాటనందుకొని వసిష్ఠులవారు “రామచంద్రా! నీ పాదుకలనతని కనుగ్రహింపుము” అని మనవిచేసి “భరతా! నీవీ పాదుకలను గొనిపోయి, వాటికి పట్టాభిషేకముచేసి, అది రామరాజ్యంగానే విశ్వసించి, వొక ఏజంటు (Agent) గా, పాలన వ్యవహారము జరుపుచుండు” మని ఉపదేశించాడు. భరతుడు గురువాజ్ఞను, రామాజ్ఞను రెండింటిని ఉల్లంఘించలేక అతిభారమైనటువంటి హృదయముతో ఆ పాదుకలను శిరస్సునందు ధరించాడు. ఆనాటి ప్రజలు కూడను అట్టి పవిత్రమైనటువంటి హృదయము కలిగినటువంటివారు కనుక, భరతునియొక్క ఆజ్ఞను శిరసావహించి నడచుకుంటూ వచ్చారు. భరతుడు అయోధ్యకు వచ్చి, ఆ పాదుకలు సింహాసనము పైన పెట్టి, తాను అతిసమీపములోనున్న నందిగ్రామములో వుంటూ జడలు ధరించి "పదునాలుగు సంవత్సరములును రామచంద్రుడు అయోధ్యకు వచ్చి చేరునంతవరకూ నేను అన్నపానాదులు మానివేస్తాను” అని ప్రతిజ్ఞ పట్టాడు. రాముడు ఏవిధంగా అరణ్యమునందు తనయొక్క జీవితమును గడుపుతున్నాడో ఆవిధంగానే తాను నందిగ్రామమునందు జీవితము గడుపుతూ వచ్చాడు. కనుకనే రామభరతుల యొక్క తత్త్వము ఒక్కటే అని పెద్దలు బోధిస్తూ వచ్చారు; ఋషులు విశ్వసిస్తూ వచ్చారు. భరతుడు పవిత్రమైన అన్న ఆజ్ఞను శిరసావహించి రాజ్యాన్ని ఏలుతూ, ఆదర్శవంతమైన జీవితాన్ని చూపుతూ వచ్చాడు.
(ఆత్మారామమ్ 1977 వేసవి తరగతులు పు 109-116)

 


About Us

Sri Tumuluru Krishna Murty and his late wife, Smt. Tumuluru Prabha are ardent devotees of Bhagavan Sri Sathya Sai Baba

Read More

Reach Me

Sri Tumuluru Krishna Murty

E-mail : hello@srisathyasaidigest.com

Subscribe For Contemplate Massage