శ్రీరాముడు సీతామహాసాధ్విని అరణ్యాలకు పంపిన తరువాత యెంతో వేదనకు గురియై ఎల్లప్పుడూ ఆమెను గురించిన ఆలోచనల్లోనే నిమగ్నమై ఉండేవాడు. ఆమె ఆ నిస్సహాయ స్థితిలో యేమి చేస్తున్నదో, ఎన్ని యిక్కట్లకు గురి కావలసి వచ్చినదో అని ఆమెను గురించే చింతిస్తూ ఉండేవాడు. అందుచేత రాచకార్యాలన్నీ భరతుడే ఎక్కువగా చక్కబెడుతూ ఉండేవాడు. ఒకనాటి రాత్రిభోజనానంతరం శ్రీరాముడు సీతా వియోగదుఃఖంలో పరధ్యానంగా తన శయ్యాగృహంలోకి ప్రవేశిస్తున్నాననుకొని ఆ ప్రక్కనే ఉన్న భరతుడి పడకగదిలోకి ప్రవేశించాడు. వారి సోదరుల శయన మందిరాలన్నీ ఒకే వరుసలో ఉండేవి. అయితే, శ్రీరాముని గదిలో శయ్యకు ఎదురుగా దశరథుని నిలువెత్తు తైలవర్ణ చిత్రం ఉండేది. ఆయన పితృభక్తుడు కావడం మూలాన నిద్ర నుండి లేస్తూనే తండ్రి చిత్రపటానికి ప్రణమిల్లిగాని వేరే ఇంకేపని చేసేవాడు కాదు. కాగా భరతుడు తన
అగ్రజువాడైన శ్రీరామచంద్రునికి భక్తుడు కావడం వల్ల తన శయ్యకు ఎదురుగా అన్నగారి నిలువెత్తు తైలవర్ణచిత్రాన్ని పెట్టుకున్నాడు. ఆయన నిద్రలేస్తూనే అన్నగారి చిత్రపటానికి నమస్కరించిగాని రాచకార్యాలలోకి వెళ్ళేవాడు కాదు. (మరొక విషయం కూడా చెప్పారు స్వామి. రామరాజ్యంలో ఏయిళ్ళకూ, గదులకూ తలుపులుగాని, గొళ్ళేలుగాని, వాటికి తాళాలు గాని ఉండేవి కావట. ఎందుకంటే, రామరాజ్యంలో వాటి అవసరం లేకపోయింది. కాబట్టి, కేవలం గది గుమ్మాలకు తెరలు మాత్రమే వేళ్ళాడుతూండేవి.)
శ్రీరాముడలా భరతుని శయన మందిరంలో ప్రవేశించి అతని శయ్యమీద అటుప్రక్కగా తిరిగి పడుకున్నాడు. అలసిపోయి ఉన్నాడేమో బాగా గాఢమైన నిద్ర పట్టేసింది. కొంత సేపటికి భరతుని భార్య మాండవి లోనికి వచ్చి చూసింది. తన పతిదేవుడైన భరతుడే నిద్రపోతున్నాడను కుంది. భరతుడు కూడా నీలమేఘశ్యాముడే కావడం మూలాన ఆమెకేమీ అనుమానం రాలేదు. ఆయన కే మాత్రమూ నిద్రాభంగం కల్గకుండా ఆమె కూడా అదే శయ్యమీద ఇటుప్రక్కగా ఒదిగిపడుకుంది. ఆనాటి రాచకార్యాలను ముగించుకున్న భరతుడు అర్ధరాత్రి సమయంలో తెర తొలగించుకుని తన గదిలోకిప్రవేశించాడు. ఎదురుగా కనిపించిన దృశ్యం చూసి ఒక్క క్షణం నిర్ఘాంతపోయాడు. ఆలోచించాడు. తన పడకపై అటు ఒత్తిగిలి పడుకున్నది. మూర్తీభవించిన ధర్మస్వరూపుడైన తన అగ్రజుడు శ్రీరామచంద్రమూర్తి, ఇటువైపుగా ఒదిగి పడుకున్న వ్యక్తి తన భార్య మహాసాధ్వి మాండవి. ఈ సంఘటన ఎలా జరిగి ఉంటుందో సులభంగానే ఊహించుకున్నాడు. కుశాగ్రబుద్ధి గల భరతుడు. అతడు సూక్ష్మ గ్రాహి. తనలో ఇలా తలపోశాడు - "ఇప్పటికే నా తల్లి సీతమ్మ విషయంలో వచ్చిన ఒక్క అపవాదుతో ఇంత రభస జరిగి అన్నగారు ఎంతో మనోవేదనకు గురి కావలసి వచ్చింది. ఈ దృశ్యం మరెవరి కంటనైనా పడితే ఇంకేమిఅనర్థం సంభవిస్తుందో! ఆ విధంగా జరగకూడదు. ఇటువైపు ఎవరూ రాకూడదు" అని ఆలోచించి, ద్వారం ముందు కట్టి ఉన్న తెర వెనుక తెల్లవారే వరకూ కాపలాగా నిలబడి ఉన్నాడు. ("ఇక్కడ చూడండి, ఎంతటి ఉదాత్తమైన మనస్తత్వమో భరతుడిది" అన్నారు. స్వామి.) ఆలా తెల్లవారే వరకూ భరతుడు అక్కడే ఉండి మాండవి మేల్కొన్న అలికిడి విని ఆమె కంట పడకుండా శీఘ్రంగా అక్కడి నుండి తప్పుకున్నాడు. ఆమె నిద్ర లేచి రాముడి చిత్రపటానికి నమస్కరించి తన గృహకృత్యాలలోకి వెళ్ళిపోయింది. ఆ తరువాత కొద్ది సేపటికి శ్రీరాముడు కూడా నిద్ర నుండి లేచాడు. అలవాటు ప్రకారం దశరథుని చిత్రపటానికి నమస్కరించ బోయాడు. అయితే, అక్కడ ఉన్నది తన తండ్రి చిత్రానికి బదులు తన చిత్రపటం ఉన్నది. ఒక్కసారిగా గుండె ఝల్లుమన్నది. ఇదేమిటి? ఇది భరతుడి గది కాదు కదా! ఇక్కడ తానెందుకున్నాడు? ఇలా ఎందుకు జరిగింది? ఎలా జరిగింది? ఒక్క క్షణం ఆలోచించిన తరువాత ఈ పొరపాటు ఎలా జరిగి ఉండవచ్ఛో గ్రహించాడు. అయ్యో, ఎంత పని జరిగిపోయింది! ప్రక్క మీద చూశాడు. మాండవి తలగడ మీద నలిగిన పువ్వులు, పాదాలవైపు పారాణిముద్రలు కనిపించినై. జరిగిన పొరపాటు గ్రహించాడు. ఇప్పుడేం చెయ్యాలి! ఏమైనా సరే, జరిగిన పొరపాటుకు వెంటనే ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. పోనీ, ఈ విషయం యెవరూ చూడలేదు కదా అని మౌనం వహించడం భావ్యమా? "అసంభవం. అది ధర్మరక్షణ యే విధంగా అవుతుంది? ఏమైనా సరే, ధర్మాన్ని ఆచరించి తీరవలసిందే, ఆది యెంతటి కఠినమైనదైనా ఫరవాలేదు." అని దృఢంగా నిశ్చయించుకున్నాడు.
వెంటనే కులగురువులైన వశిష్టులవారిని రావించి, జరిగిన సంగతి వివరించి తనచేత ప్రాయశ్చిత్త కర్మ చేయించి రక్షించమన్నాడు రాముడు. "ఇందులో యే తప్పిదమూ లేదు. మీరిద్దరూ అమాయకులే, నిరపరాధులే. ఇక్కడ జరిగిన దోషమేదీ లేదు. నీవంటి నిర్మల చిత్తునకుప్రాయశ్చిత్తం చేసుకోవలసిన పని లేదు." అని వశిష్ఠులవారు నచ్చ జెప్పారు. కాని, ధర్మమూర్తి అయిన శ్రీరాముడు అందుకు ససేమిరా ఒప్పుకోలేదు. ప్రాయశ్చిత్తం జరిగి తీరవలసిందేనని పట్టుబట్టాడు. చేసేది లేక అప్పుడు వశిష్టులవారు ధర్మశాస్త్రములను తిరగేసి పది రోజులపాటు కటిక ఉపవాసం చెయ్యాలని రాముణ్ణి ఆదేశించారు. అలాగే శ్రీరాముడు పది రోజులపాటు పూర్తి ఉపవాసం చేసి ప్రాయశ్చిత్తం చేసుకున్నాడు.
(ఈ సంఘటనంతా వివరంగా చెప్పి చివరగా స్వామి ఇలా అన్నారు).. ఈ సన్నివేశం గురించి వాల్మీకి రామాయణంలో గాని, మరియే ఇతర రామాయణంలోగాని ఎందులోనూ లేదు. కేవలం అమభవించినవాణ్ణి కాబట్టి నాకు మాత్రమే తెలుసు."
(స.సా.న.2001 పు. 331/332)
(చూ|| ప్రేమకు మూడు మెట్లు, సంప్రదాయము)