ఒక్కొక్క ఇంటి యందు బిడ్డలుంటారు. ఆ బిడ్డలు ఒకరికొకరికి సన్నిహిత సంబంధమే ఉండదు. కాని, దశరథ మహారాజు ఇంటిలో నల్గురూ పిల్లలూ ఒకే ప్రాణంగా ఉండేవారు. వారు తినడమూ, తిరగడమూ, ఆడుకోవడమూ అంతా ఒకచోటే. ఒకరిని విడిచి ఒకరు క్షణమైనా నివసించేవారు కాదు. ఎవరికైనా కించిత్తు భాధ కల్గితే, అందరూ ఆ బాధను పంచుకునేవారు. రాముని అందరూ అనుసరిస్తూ వచ్చారు. ఒక్క ఇంటిలో ఐకమత్యంలో జీవితానికి ఆదర్శము నందిస్తూ వచ్చారు. ఈనాడు ఒక్క భార్యతోనే భరించుకోలేనంత బాధలు పడుతూంటారు ఇంట్లో. ఇద్దరు భార్యలు ఉంటే ఇంక చెప్పనక్కర్లేదు. ముగ్గురు భార్యలుంటే ఎప్పుడు చూసినా పోట్లాటలే. కాని, దశరథుని ఇంట్లో అలాంటిది - ఏమాత్రం లేదు. మీరనుకోవచ్చు: “కైక అన్యాయమైన కోరిక కోరింది కదా, అశాంతిని కల్గించింది కదా,” అని. అది సరికాదు. ఇది కేవలం రాక్షస సంహార నిమిత్తమై తన పతి ఇచ్చిన వరమును ఉపయోగ పెట్టడమే. రాముడు రాక్షస సంహారం గావించాలి. దానికి అనుగుణంగా ఆమె రెండు వరాలు కోరింది. కాని, లోకరీతిగా మనం “మంథర బోధవల్ల కైక చెడిపోయింది,” అని అనేక రకములుగా భావించుకుంటాము. నిజానికి, మంథర మాట వినేటువంటిది కాదు కైక. ఈమె మహాగుణవంతురాలు, సాధ్వీమణి, శీలవంతురాలు. అసలు తన కుమారుడైన భరతునికంటే రాముణే అమితంగా ప్రేమించేది కైక. ఇంతగా రాముణ్ణి ప్రేమిస్తున్న వ్యక్తి ఈ కోరిక ఎందుకు కోరింది? అనే ప్రశ్న ఉదయించవచ్చు. రాముణ్ణి అరణ్యమునకు పంపితేగాని, రాక్షస సంహారం జరగదు. దానికొరకు ఆమె ఈవిధంగా కోరికలు కోరి, వాటిని నెరవేర్చుకుంది. కట్టకడపటికి రాక్షస సంహారం జరిగింది. – రాముడు అరణ్యవాసమునకు వెళ్ళాడని తెలుసుకున్న భరతుడు తల్లి వద్దకు వచ్చి ఆమెను ప్రశ్నించినప్పుడు ఆమె “ఇదంతా భగవత్సంకల్పమే. అందరూ ఈ సంకల్పమును పురస్కరించుకొని నడుచుకొనవలసివస్తుంది. ప్రతి ఒక్కటీ దైవాజ్ఞవల్లనే జరుగుతుందిగాని, మానవసంకల్పమంటూ ఏమీ ఉండదు,” అని చెప్పి భరతుణ్ణి సమాధానపరచింది. రావణుడు దేవతలచేతగాని, కిన్నెర కింపురుషులచేతగాని తనకు చావు ఉండకూడదని వరమును కోరాడు. కాని, మానవునిచేత మరణం - రాకుండా ఉండాలని కోరలేదు. రాముడు మానవాకారము. రామునిచేతనే అతని మరణం జరుగుతుంది. మానవులు అల్పులు కదా, అనుకున్నాడు రావణుడు. అయితే, చివరకు మానవునిచేతనే అతను మరణం పొందాడు. అందువలన మనం కోరిన కోరికలు కూడా చాలా సుస్పష్టంగా ఉండేలా చూసుకోవాలి. ఇందులో ఈ విధమైన రహస్యం ఉంటున్నది. ఇక హనుమంతుని గురించి కూడా మనం తెలుసుకోవాలి.
కౌసల్య, కైక ఇచ్చిన పాయసమును సుమిత్ర ప్రక్కన పెట్టి తల ఆరబెట్టుకుంటూ ఉండగా గరుడపక్షి ఆ పాయసపు కప్పును తన్నుకు పోయింది. దానిని అంజనాదేవి ధ్యానం చేసుకునే సమయంలో అక్కడ పడవేసింది.. ఆమె ఆ పాయసాన్ని తీసుకుంది. ఆమె గర్భంలో హనుమంతుడు జన్మించాడు. అనగా, రామలక్ష్మణ భరత శతృఘ్నుల అంశమే హనుమంతుడు కూడా. కనుకనే, హనుమంతుడు రాములకు అంత సమీపంగా ఉండి రామకార్యంలో పాల్గొంటూ వచ్చాడు. (రామాయణ దర్శనము వేసవి తరగతులు 2002 పు36-37)