ప్రతి మానవుడు తన కర్తవ్యాన్ని నిర్వర్తించుకొంటూ భగవంతునిపై భారం వెయ్యాలి.
నాయందున్న ఆత్మస్వరూపుడు నన్ను యీ విధంగా ఆడిస్తున్నాడని విశ్వసించాలి. ఎక్కడ విశ్వాసమో - అక్కడ ప్రేమ
ఎక్కడ ప్రేమనో - అక్కడ శాంతి,
ఎక్కడ శాంతియో - అక్కడనే సత్యము
ఎక్కడ సత్యమో - అక్కడనే దైవము
ఎక్కడ దైవమో - అక్కడనే ఆనందము.
కడపటిది ఆనందం - మొదటిది విశ్వాసం. విశ్వాసం ఉండిన వానికే ఆనందము లభ్యమవుతుంది. విశ్వాసం లేని వారికి ఆనందం లభ్యంకాదు Duty is God work is worship.
నేను చేసే పనులన్నీ భగవంతుని యొక్క సేవలే అన్న భావంలో చెయ్యి. అప్పుడు Work will be transformed into worship.
నీవు చేసే పని అంతా భగవంతుని పనిగా భావించు. అదే సరియైన మెడిటేషన్.
నాదేహమే ఒక పనిముట్టు - ఈ పనిముట్టు ద్వారా భగవంతుడే ఈ పని చేస్తున్నాడు. అనే విశ్వాసాన్ని పెంచుకో. ఈ సాధన ఎంతో ఉపకారంగా ఉంటుంది - ఆదర్శవంతంగా ఉంటుంది.
(దే.యు.పు. 109-110)
“మనస్సు, చిత్తము, ఇంద్రియములు ఇలా అన్ని అంగముల సమ్మిళిత స్వరూపమే దేహం. అంతేకాని వీటన్నిటి సమ్మిళిత స్వరూపం ఆత్మ కాదు. దేహములోను ఆత్మ ఉంది. మనస్సులోను ఆత్మ ఉంది, అంతఃకరణంలోను ఆత్మ ఉంది. ఇవన్నీ ఆత్మ యొక్క ప్రబోధం చేతనే పనిచేస్తున్నాయి.
దీనికొక చక్కని ఉదాహరణ : కారులో స్టీరింగ్ ఉంది, క్లచ్ ఉంది, బ్రేక్ ఉంది. ఇంకా అనేక రకములైన అంగములున్నాయి. అయితే ఇవన్నీ వేటికవే పని చేస్తున్నాయా? నీవు కారులో ప్రయాణమై పోతుంటే హారన్ దానికదే మ్రోగుతుందా? స్టీరింగ్ దానికదే తిరుగుతుందా? కాదు, కాదు దీనికి డ్రైవరున్నాడు. అదే విధంగా దేహమనే రథమునందు ఆత్మ అనే డ్రైవరు ఉంటూ కన్నుల ద్వారా చూపిస్తున్నాడు. చెవుల ద్వారా వినిపిస్తున్నాడు, నోటి ద్వారా పలికిస్తున్నాడు. చేతుల ద్వారా చేయిస్తున్నాడు. దేహంలో ఈ డ్రైవరు ఉన్నంత వరకే సర్వాంగములూ తమ తమ పనులను నిర్వర్తిస్తున్నాయి. దేహమునుఈ డ్రైవరు వదిలిపోయినప్పుడు కూడా అవే కళ్ళు ఉంటున్నాయి కానీ చూడగల్గుతున్నాయా? అవే చెవులు ఉంటున్నాయి కానీ వినగలుగుతున్నాయా? అవే చేతులు ఉంటున్నాయి కానీ పనులు చేయగల్గుతున్నాయా? అదే నోరుంటున్నది కానీ మాట్లాడగల్గుతున్నదా? ఏ మాత్రము లేదు. సర్వాంగములూ స్తంభించిపోతాయి. జడమైపోతాయి. అంతకు పూర్వం వీటన్నింటి ద్వారా పనులు చేయించినది ఆత్మ అనే మాస్టర్! అతను ఈ దేహంలో ఉన్నంత వరకు ఇది “శివం”; దేహమును వదలిపోతూనే ఇది “శవం”. కనుక మనము ఎవరమో చక్కగా విచారిస్తే మనం ఆత్మ స్వరూపులమని, ఇవన్ని కేవలం పనిముట్లే కాని మనం కాదని చక్కగా తెలుస్తుంది" అంటారు భగవాన్ శ్రీసత్యసాయిబాబా. (తపోవనము పు 117-118)