అంకె తరువాత సున్న కబ్బువిలువ |
అటులే దేవుని తరువాతఅగును జగతి |
కాన ఒక్కడే దేవుని గాంచి పిదప !
నీవు లెక్కగొనుక అనేక జీవి జాతి ||
(సా॥ పు. 459)
దైవత్వంలోని ఆదర్శాలను మనం అందుకోవాలి. దేవుని దేవుడుగా పూజించడం ప్రధానము కాదు. దేవుడు ఏ ఒక్క ప్రత్యేక స్థలములో లేడు. ఆంతటా యున్నాడు. అందుకే తరచుగా చెప్పుతూ వుంటాను. ఒక చిత్ర పటాన్ని దేవుడుగా భావించి పూజింపవచ్చును గాని, దేవుడు చిత్రపటంగా కాదు. ఒక ఆదర్శం కోసం చిత్రపటాన్ని పెట్టుకున్నామేగాని, చిత్రపటమే దేవుడు కాడు.
(సా.పు . 618)
శ్రీకరుండగు దేవుండు నీకు నరుడ
పగటి వేళ చుక్కలు కనబడని రీతి!
కాన రాకున్న అజ్ఞాన కారణమును
అంత మాత్రాన అతడు లేడనకు సుమ్మి॥
(సా॥పు 343)
పూలయందు పరిమళమెట్లు కలదో
అటుల దేవుండు నీలోన కలడు జూడ
మేది చెడినట్టి కస్తూరి మృగము వోలె
ఏలవెతికెదు దేవుని వెఱ్ఱవాడ!
(శ్రీ.స.ది.పు.81)
ఒకడు దేవుడున్నా డంటాడు. ఒకడు లేడంటాడు. ఉన్నాడనే వాడు దేవుని చూసే ఉంటాడు. లేడనే వాడు కూడా చూసే ఉండాలి. చూడకుండా లేదని చెప్పే అధికారం వానికి లేదు. ఇతనునంజుండయ్య - చూసినవాడు ఇతను నంజుండయ్యే అని గట్టిగా చెపుతాడు. చక్రవర్తిని పిలిచి నంజుండయ్య అంటే ఇతను నంజుండయ్యకాదు. చక్రవర్తి అంటాడు వాడు. ఇతను నంజుండయ్య అనే వాడు కాని, ఇతను నంజుండయ్య కాదనే వాడు కాని నంజుండయ్యను చూసే ఉండాలి. చూడకుండా నంజుండయ్యే అనడానికి, కాదవడానికి గాని వీలులేదు. అదే విధంగా దైవాన్ని చూసిన వానికే ఇతను దైవం కాడని చెప్పే ఆధికారం ఉంది. ఈ అవును, కాదు అనేది మాటల గారడీ! అవునన్నా కాదన్నా మాటల మార్పే తప్ప ఉన్నదాన్ని ఎవరూ కాదనడానికి లేదు.
(ఆ.ప్ర.న.1992పు.60)
దేవుడెక్కడనుచు దేవులాడగ నేల?
హృదయమందు లేడె ఈశ్వరుండు!
ఇచ్చుకొనుము సేవ పుచ్చుకొనుముప్రేమ
అటుల చేసి ఆత్మతత్వ మనుభవించు!
(స.సా.డి. 85 పు. 306)
ప్రేమస్వరూపులారా! మానవ జన్మ అత్యంత ఉత్కృష్టమైనది, సౌజన్యమైనది, సౌశీల్యమైనది. మానవుడు దైవసమానుడు. దైవం ఎక్కడున్నాడు? మీరందరూ దైవస్వరూపులే! దేహోదేవాలయ ప్రోకోః, జీవో దేవస్స తనః దేహమే దేవాలయం, జీవుడే దేవుడు. ఈ సత్యాన్ని గుర్తించడమే సమస్త సాధనల గమ్యం. మానవ దేహం కదిలే దేవాలయం. ఇందులో ఆత్మ అనే దేవుడు ప్రతిష్టయై యున్నాడు. అతనిని వేదము.
"నిర్గుణం నిరంజనం సనాతనం నికేతనం
నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం"
అని వర్ణించింది. అట్టి దేవుడు మీయందే ఉండగా మీరు ఎక్కడో దేవుణ్ణి వెతకడానికి పోవడం వెఱ్ఱితనం కాదా? ప్రస్తుతం ఈ ప్రపంచంలో 600 కోట్ల దేవాలయములున్నాయి. ఏమిటా దేవాలయములు? మానవ దేహములే! ప్రతి దేహమూ ఒక దేవాలయమే. దేహములో ఉన్న చైతన్య శక్తియే భగవంతుడు. కనుకనే వేదము "ఈశ్వరస్సర్వ భూతానాం" అని బోధించింది. సర్వ భూతములందు ఈశ్వరత్వం ఉంటున్నది. కనుక, మీరు ఎక్కడే మనిషిని చూసినప్పటికీ ఒక దేవాలయాన్ని చూసినట్లుగానే భావించాలి. ప్రతి మనిషిలోను ఆత్మస్వరూపుడైన భగవంతుడున్నాడు. “దేవాలయము" యొక్క అందచందములను కాదు మీరు చూడవలసింది; అందులో ఉన్న ఆత్మస్వరూపుడైన దేవుణ్ణి చూసి ఆనందించాలి. ఎవ్వరినీ దూషించకూడదు. హింసించ కూడదు. బాధించకూడదు. ఈ సత్యాన్ని గుర్తించి వర్తించేవాడే నిజమైన భక్తుడు. ఇష్టమొచ్చినట్లు ఇతరులను దూషించేవాడు, పరిహసించేవాడు భక్తుడెలా అవుతాడు? అట్టివాడు పరమ నీచుడనే చెప్పవచ్చు.
(స.సా..మే2000 పు. 130/131)
(చూ॥ చదువు, ప్రధమకర్తవ్యం. భగవంతుడు)