ఈనాటి విద్యార్థులు మాతృదేశాన్ని విసర్జిస్తున్నారు, విదేశాలను ఆశిస్తున్నారు. అన్ని దేశాలను ప్రేమించండి, తప్పులేదు. కానీ, మాతృదేశాన్ని త్యజించి, విదేశాలను వరించటం చాల పొరపాటు. ఒకానొక సమయంలో నరేంద్రుడు ఆమెరికా పర్యటన పూర్తి గావించుకొని భారత దేశానికి తిరిగి వచ్చే ముందు పత్రికలవాళ్ళు అతనిని ఇంటర్యూ చేశారు. అప్పుడు నరేంద్రుడు, "నేను భారత దేశాన్ని మాత్రమే కాదు, భారత దేశంలో ఉన్న మట్టిని, గాలిని, ధూళిని కూడా ప్రేమిస్తున్నాను, గౌరవిస్తున్నాను. నా మాతృభూమి సేవకే నా జీవితాన్నిఅంకితం గావిస్తున్నాను" అన్నాడు. కానీ, ఈనాటి విద్యావంతులు కేవలం ధనార్జనకే తమ జీవితాన్ని అంకితం గావిస్తున్నారు.
నిరత సత్య ప్రౌడి ధరణి నేలిన హరి
శ్చంద్రుడి ధర బాసి చనగ లేదా
ఎల్ల లోకములేలి ఎసగు శ్రీనలరాజు
తన వెంట భూమిని గొనుచు చనెనె
కృతయుగంబు నలకృతిని చేయు మాంధాత
సిరి మూట గట్టుక అరిగినాడే
జలధి సేతువు గట్టె ఆలనాటి శ్రీరాము
డుర్విపై ఇప్పుడు ఉన్నవాడే
ఎందరెందరు రాజులు ఏగినారో
ఒక్కరును వెంట గొనిపోరు ఉర్వితలము
నీవు మాత్రము రాజ్యంబు భోగములను
తలను కట్టుక పోదువా ధర్మహృదయ!
మరణించినప్పుడు ధనమేమైనా వెంట వస్తుందా? సంపాదించిన లక్షలాది రూపాయలను వదలిపెట్టక తప్పదు. మరణించేటప్పుడు పిడికెడు మట్టినైనా వెంట తీసికొని వెళ్ళటానికి వీలుకాదు. లేకపోతే ప్రపంచంలో మట్టికి కూడా రేషన్ వచ్చి యుండేది! మరణించే సమయంలో మంచి, చెడ్డ - ఈ రెండు మాత్రమే మీ వెంట వస్తాయి. కనుక, తుచ్ఛమైన ఆస్తిపాస్తులకోసం ప్రాకులాడకుండా, దైవమే మీ నిజమైన ఆస్తిగా భావించి సమాజ సేవలో ప్రవేశించండి. మీ హృదయంలో దైవభావాలకు చోటివ్వండి.
(స.. సా.జూ..99పు 152/153)
స్వామి ప్రతి సంవత్సరము ఢిల్లీకి రావాలని వాజ్ పెయి, కుల్వంతరాయ్ కోరారు. తప్పక నేను సంవత్సరానికి ఒక తూరి వస్తాను. అయితే, మీరు ఈ విశాలమైన భావాలను ఆచరణలో పెట్టాలి: వ్యక్తిగతమైన ద్వేషాలను దూరం చేసుకోవాలి. అందరూ సోదర సోదరీమణులుగా జీవించాలి. వంద సంవత్సరాలకు పూర్వం వివేకానందుడు చికాగో మహాసభలో తన ప్రసంగాన్ని ప్రారంభిస్తూ సభికులను " బ్రదర్స్ అండ్ సిస్టర్స్" అని సంబోధించగా, వారు పదిహేను నిమిషాలపాటు కరతాళ ధ్వనులు చేశారు. కానీ, ఈనాడు భారతదేశంలోనే అలాంటి విశాలమైనభావం కరువైంది. ప్రజలు సోదర సోదరీమణులుగా జీవిస్తూ సుప్రీం స్టేజా (ఉన్నత స్థాయి)కి పోయే బదులు ఒకరితో ఒకరు పోట్లాడుకుని సుప్రీం కోర్టుకు పోతున్నారు! ఒక్క ఢిల్లీ బాగుపడిందంటే దేశమంతా బాగుపడుతుంది. ఢిల్లీ భారత దేశం యొక్క కడుపు వంటిది. కడుపు బాగున్నప్పుడే మిగిలిన అంగములు బాగుంటాయి. కనుక, మీరు ఢిల్లీని బాగుపర్చుకోవాలి, భద్రపర్చుకోవాలి. ఐకమత్యం ఉన్నప్పుడే ఇది సాధ్యమవుతుంది.
(స. సా.మే.99పు.126)
సింహళములో వివేకానందుడు పునర్జన్మ మెత్తి వృద్ధిపొందుచున్నాడు. అతడు వచ్చి నా కార్యక్రమములో పాల్గొనును. వివేకానందుని జీవిత చరిత్రను ఆంగ్లములోమొదట వ్రాసిన గ్రంథకర్త పడమటి సముద్రతీరమందలి కుట్టి పురములో నొక పూరిగుడిసెలో నిన్న రాత్రి జన్మించెను. ఆ బిడ్డ విశాల నేత్రములలో నల్లారుముద్దుగా నున్నాడు.
(స.శి.సు.రె.పు. 121)
(చూ! దైవం కోసం)