అధ్యాపకులు మార్గదర్శకులు. భవిష్యత్తుకు రాచబాట వేయువారు విద్యార్థులు. మానవజాతియొక్క గౌరవముకానీ, శక్తిసామర్థ్యములుకాని ఉపాధ్యాయుల గుణము పైననే ఆధారపడియుంటివి. మానవత్వమునకు గుణమే గీటురాయి. గుణమును పోషించే నిమిత్తము తమ విద్యను జ్ఞానమును వినియోగించి విద్యార్థులను ఉన్నతస్థాయికి తీసికొనిపోవుటకు అధ్యాపకులు తగిన ప్రయత్నము చేయాలి. సాంఘిక జీవితానికి సర్వోన్నతిని కలిగించేది గుణము. మానవత్వమునకు మొగ్గను తోడిగేది గుణము. అన్నము నిమిత్తముకాక ఆదర్శము నిమిత్తమై జీవించుటమేగుణము. గుణములేని జీవితము దీపములేని గుడివంటిది, చెల్లని రూపాయి వంటిది, దారము తెగిన గాలిపటము వంటిది.
ధన నిమిత్తమే ఆధ్యాపకుడు బోధన సలపడము ఉద్యోగనిమిత్తమే విద్యార్థులు విద్యనభ్యసించడము సరియైన పద్ధతి కాదు. విద్యార్థి యొక్క ఔన్యత్యమును, అభివృద్ధిని ఆశించి తన కర్తవ్యమును గుర్తించి వర్తించడమే అధ్యాపకుని పని. మానవత్వాన్ని వికసింపచేసుకొని సామాజిక సేవయందు గాని. దివ్యత్వమునందుగానీ మార్గదర్శకుడైనవాడు విద్యార్థి.
(వి.వా.పు.82)
(చూ|| నాసందేశము)