సాధన

సాధన అనగా జపం, ధ్యానం చేయటం కాదు. ఏ పని చేసినా దైవసేవగా భావించడమే నిజమైన సాధన. Every work is God s work. God is everywhere. దీనిని పురస్కరించుకొనియే భగవద్గీత చెప్పింది.

 

సర్వతః పాణిపాదం తత్సర్వతోక్షి శిరోముఖం

సర్వతః శ్రుతిమల్లోకే సర్వమానృత్య తిష్టతి

 

"నేనీ పని చేస్తున్నట్లు ఎవ్వరికీ తెలియదు" అనుకుంటావు. చాల పొరపాటు భగవంతుడు చూస్తూనే ఉన్నాడు. కన్నుల్లో వెలుగు ఉన్నట్లుగా భగవంతుడు నీలోనే ఉన్నాడు. సర్వమునకు భగవంతుడు ఆధారం. భగవత్సంకల్పము లేనిదే గడ్డిపోచ కూడా కదలదు. పిపీలికాది బ్రహ్మపర్యంతం తాను వ్యాపించుయున్నాడు. కాని, ఈ సత్యాన్ని గుర్తించుకోలేక కొంతమంది. తాము గొప్ప వివేక వంతులమని, ఎన్నో ఘనకార్యాలు చేస్తున్నామని అహంకారపడుతుంటారు. చేయించేది, అనుభవించేది, ఆనందించేది అంతా ఆ భగవంతుడే అని గుర్తించండి. మీకు కష్టం వచ్చినా, నష్టం వచ్చినా మీ మంచికే అనిభావించండి. అప్పుడు అంతా మీకు మంచియే జరుగుతుంది. వైద్యుడు మలేరియా జ్వరం వచ్చినవానికి చేదుగా ఉండే క్వినైన్ మందు ఇస్తాడు. ఆ చేదు మందునుత్రాగినప్పుడే వచ్చిన జ్వరం నివారణవుతుంది. అదేరీతిగా, మీకు కష్టం వచ్చినా, నష్టం వచ్చినా మీ ఆరోగ్య" నివారణకే అని గుర్తించండి. ప్రతి కార్యమునకు ఒక కారణం ఉంటుంది. భగవంతుడు కారణం లేని కార్యం ఏదీ చేయడు. కార్యకారణ సంబంధాన్ని గుర్తించుకోలేక మానవుడు "దేవుడు నన్ను బాధపెడుతున్నాడు" అని భావిస్తాడు. దేవుడు ఎవ్వరిని బాధ పెట్టడు. చేసేది తానే, అనుభవించేదీతానే. ఈ సత్యాన్ని మానవుడు గుర్తించాలి.

(స.సా.పి.2000 పు.54/55)

 

జ్ఞానము మానవుడు సాధించవలెనన్న రెండు మార్గములు కలవు. ఒకటి బహిరంగ సాధన, రెండవది అంతరంగ సాధన, అనగా నిష్కామ కర్మ; ఆంతరంగ సాధన, అనగా ధ్యాన సమాధులు, ఇట్టి స్థితికి ఆత్మసంయమమని కూడనూ అందురు. వేదాంత పరిభాషలో దీనినే నిథిధ్యాసనమని పిలుతురు. దీనిని పొందవలెనన్న శ్రవణ మన నాదులు ఆధారము వాటి ద్వారానే ధ్యానము సాధించవలెను. కానీ శ్రవణ మననాదులు లేక ధ్యానసిద్ధి కలుగదు.

(గీ.పు.122)

 

ఉపనిషత్తులో ఉన్నట్లు, "యమేవ వృణుతే తేన లభ్యః" అనగా ఇది భగవంతుడు ఏర్పాటు చేసినవారికే లభ్య మగును. దీనిలో సాధకులకు సంశయము గలుగవచ్చును. భగవంతుడు ఏర్పాటు చేసిన వారలకే కలుగునట్లయిన మీరుచేయ సాధన యొక్క ఉపయోగమేమి? అని, ఐతే ఇందులో ఒక స్వతంత్రత ఉండును. భక్తితో పరమాత్ముని తలంచు వాడు ఎట్టి ప్రారబ్థ సంచితములనైనా దాటగలడు. తన అనుగ్రహమునకు పాత్రుడై పొందలేని ఆనందమును గూడ పొందవచ్చును. సాధనవల్ల ప్రయోజనమేమి అను అనుమానమే అనవసరము. సాధన నిష్ప్రయోజనమేనాటికీ కాదు. ఎవ్వరికీ కాదు,దానిని దృఢము చేసికొనవలెను. నిశ్చల భక్తి గల మనుజునకు దైవానుగ్రహము కలుగుటలో ఆశ్చర్యమేమీలేదు. దీనికి గ జేంద్రుని కథయే ఆధారము

(ప్ర.వా.పు.10)

 

అద్భుతమైన దర్శనాలు, దృశ్యాలు అన్నీ స్వామి నీకు అనుగ్రహించిన వరాలని నువ్వు అనవచ్చును. కాని అది తప్పు. నేను ఎల్లప్పుడూ చెప్పేదేమంటే సాధన ముందు సంకల్పము తరువాత..

 

తీవ్రమైన సాధనద్వారా భగవదనుగ్రహం పొంది భగవత్సంకల్పంచే తమ బాధలను పోగొట్టు కొనగలమనే సత్యాన్ని చాలా మంది గ్రహించలేరు.

(శ్రీస. స..పు.151)

 

దీపాలు వెలిగించుకొనేందుకు విద్యుదుత్పాదక కేంద్రం నుండి విద్యుత్తును మీ ఇంటికి తెచ్చుకోవాలంటే ఒక క్రమ పద్ధతి ప్రకారంగా మధ్య దూరం ఉండేటట్లుగా స్తంభాలుపాతి కేబుల్స్ సహాయంతో మీ ఇంటిని విద్యుదుత్పాదక కేంద్రంతో కలపాలి. అదే విధంగా భగవంతుని అనుగ్రహం మీరు సంపాదించాలంటే ఒక క్రమ పద్ధతిలో నిర్ణీత సమయాల్లో సాధన చేయండి. స్మరణ అనే కేబుల్ సహాయంతో మిమ్మల్ని మీరు భగవంతునితో కలుపుకొండి."

(లోపు.125)

 

సాధనలో ఆచరణశుద్ధి, అనుష్టానశుద్ది ముఖ్యమైనవి. హనుమంతుడు రామసేవాబలముతో, రామనామ బలములో పెద్ద కొండను మోయగల్గినాడు. కాని, ఈనాడు అరవై సంవత్సరములు అఖండముగా సుందర కాండ పారాయణ చేసినవారు ఒక చిన్న కుండను కూడామోయలేకపోతున్నారు. అనగా, వారిలో ఏ చిన్న కష్టనష్టములనైనా సహించుకునే శక్తి లేదు. హనుమంతుడు దృఢమైన నమ్మకంతో భగవదాజ్ఞను శిరసావహించినాడు కనుకనే, అతనికి అది సాధ్యమైంది. మనస్సు శ్రీరామ నామ స్మరణార్థము, దేహము శ్రీరామ సేవార్థము అనిమనోదేహములను అర్పించవలయును. మర్కటములై పుట్టి భగవత్కింకరులుగా సేవ చేసి సాక్షాత్కార సౌభాగ్యములను పొందినవారు వానరులు. అయితే, నరులు వానరులకన్న తక్కువ కాదే! మరి భగవచ్చింతనలో భగవదారాధనలో నరులు తమ జీవితము నెందుకు వినియోగం చేయరు?

(స. సా.డి.2000పు.వెనుకపుట)

 

ప్రతి పనియందును చితైకాగ్రత (శ్రద్ధ) అత్యవసరము. వ్యవహారిక విషయములకును, పారమార్థికమునకును కావలసిన సద్గుణములు వేరు వేరనుకొనుట సరికాదు. వ్యవహారమును పరిశుద్ధ పరచుటే పారమార్థము. అందులోని సఫలత విఫలత ఏకాగ్రతమీద ఆధారపడియుండును. ఈ ఏకాగ్రత కూడనూ సాధనే; అనగా జపధ్యానములు. ఆ సాధనలో రెండు మార్గములున్నవి. 1. శూన్యావస్థ 2 అనేకాగ్రత. శూన్యావస్థ అనగా నిద్ర, లేక తమోగుణము అంటారు. అనేకాగ్రత అనగా రజోగుణము, కన్నులు విప్పి సృష్టియందున్న దృశ్యముపై మరల్చుట. అట్లుకాక, ఈ రెండు దృశ్యములనూ వదలి, అనగా పూర్తిగా కన్నులు తెరచుకొనుట, పూర్తిగా కన్నులు మూసుకొనుట, రెండనూ లేక, అర్ధ నిమాలిత నేత్రుడై ముక్కు కొనను దృష్టి నిల్పిన సత్యగుణ స్వభావుడు కాగలడు. అట్లున్న చితైకాగ్రత సులభముగా ఏర్పడును. అయితే, ముక్కు కొసన దృష్టి నిల్పినంత మాత్రమున సత్వగుణుడు కాడు. ప్రారంభమున అట్లు నిల్పి. దృష్టిని స్మరించు నామరూపుని పై మరల్చుటయే ధ్యానము.

(ధ్యా వా.పు.50)

 

సాధనలు చేసి ఫలమేమి శమములేక

యోగములు పూని ఫలమేమి,ఓర్పు లేక

జపములొనరించి, ఫలమేమి శాంతిలేక

చవిటి భూమి దున్నిన సరణి కాదె

(సా.పు.312)

 

ఇంద్రియ నిగ్రహమే విద్యార్థుల ప్రథమ ఆదర్శము. విషయ సంబంధమైన భోగభాగ్యములు శాశ్వతములు కావు. ఇవి ఆల్ప సుఖమును, అనంతదు:ఖమును అందించును. ఇంద్రియములకంటె ఇంద్రియార్థములుబలమైనవి. అవియే శబ్ద స్పర్శరూప రస గంధములు. ఇంద్రియము లన్నింటిలోను ప్రధానమైనది. వాక్కు వాక్కును జయించిన అన్ని ఇంద్రియములను జయించి నట్లే. తినుట, మాటాడుట ఈ రెండు నోటితో పనులు. వీటినే ఆహారవిహారములని పిలుస్తుంటారు. ఈ రెండింటిని ఏ మానవుడు జయించునో అట్టె మానవుని తత్వము దివ్యతత్వము నందు లీనమవుతుంది. అప్పటి నుండి మాటలు స్తంభించి మనస్సు మాటాడుటకు ప్రయత్నిస్తుంది. మనస్సు యొక్క నోరును మూయించే నిమిత్తమై బుద్ధిని మేల్కొలుపవలసి వస్తుంది. క్రమముగా బుద్ధికి బుద్ధి చెప్పి ఆబుద్ధిని ఆత్మవైపు మరల్చుటకు కృషి చేయాలి. వాక్కు మనస్సునందు మనస్సు బుద్ధియందు, బుద్ధి ఆత్మ సన్నిధిని చేర్చే ఉపాయమే సాధన...

(బృత్ర.పు.54/55)

 

మనోనాశనం నిమిత్తమై ఆచరించే సాధనలే ఆత్మా న్వేషణకు సరియైన సాధనలు.

(బృత్రపు,126)

 

 

 

వెంట వచ్చే ధనం’

సాధన అంటే జపధ్యానాదులూ, దండకములూ, పఠించడం కాదు. సేవయే నిజమైన సాధన. మీ సంసారాలను విసర్జించమనిగాని, ఉద్యోగాలను, ఆస్తిపాస్తులను వదలిపెట్టమనిగాని నేను చెప్పడం లేదు. దినమునకు ఇరవై నాల్గు గంటలలో ఒక్క అరగంట సేవచేయడానికి ఎందుకు సాధ్యం కాదు? ప్రభుత్వంకోసం, వారిచ్చే డబ్బుకోసం ఎనిమిది గంటలు ఎంతో కష్టపడిందింత పనిచేస్తున్నారు. అయితే, భగవదనుగ్రహానికి ఇంత, అంత అని హద్దు లేదు.

 

మీరు చేసినదానికంతా మీ పేరున ఒక పెద్ద నిధి ఏర్పడుతుంది. వ్యాపారంద్వారా, ఉద్యోగం ద్వారా ధనం సంపాదించుకొంటున్నట్లుగానే మీరు న్యాయంగా జీవిస్తూ సేవాకార్యంలో నిమగ్నమైనప్పుడు దానికి మించిన దైవానుగ్రహ ధనం మీకు ప్రాప్తిస్తుంది. ఇట్టి అనుగ్రహ ధనమును మీరు సంపాదించుకోవాలిగాని, తుచ్చమైన భోగభాగ్యములు ఎంత సంపాదించుకొని ఏమి ప్రయోజనం?! భోగములన్నీ రోగములు. సేవలన్నీ యోగములు. -- శ్రీ సత్యసాయి (సనాతన సారథి, మే 2021 పు40)

 

సాధన అనగా రాం, రాం, రాం...” అని జపం చేయడం కాదు. కృష్ణ కృష్ణ...” అని భజన చేయడం కాదు. మొట్టమొదట ఇంద్రియాలను అరికట్టుకోవాలి. వాటిని సక్రమమైన మార్గంలో ప్రవేశపెట్టాలి. అదియే నిజమైన సాధన. అప్పుడే ఆత్మజ్ఞానము ప్రాప్తిస్తుంది. పతంజలి యోగః చిత్తవృత్తి నిరోధః అన్నాడు. దీనిని మించినది లేదు. - బాబా (స.సా. డి.2021పు.36)


About Us

Sri Tumuluru Krishna Murty and his late wife, Smt. Tumuluru Prabha are ardent devotees of Bhagavan Sri Sathya Sai Baba

Read More

Reach Me

Sri Tumuluru Krishna Murty

E-mail : hello@srisathyasaidigest.com

Subscribe For Contemplate Massage