మానవజీవితమునకు సంయమమే మాణిక్యము. సంయమము అంటే నిగ్రహము. ఆధ్యాత్మిక మార్గమందు సంయమమే ప్రధమ సోపానము. మానవుడుగా ప్రకాశించుటకు ఆశించు వారందరూ, సంయమము నభ్యసించుట, అత్యవసరము. క్రూరస్వభావము కొందరు మానవులకు సహజమైననూ, దానిని మార్చుకొనుట కవకాశము వున్నది. పెద్దల దర్శనము వలన, వారి సంభాషణమును హృదయమందు చేర్చుకొనుట వలన, మనస్సులోని దుర్భావములను నివారించుటకు వీలున్నది. దీనివలనే మానవజన్మము ఉత్కృష్టమైనది.
నిర్మల హృదయమే భగవంతుని నివాసస్థలము, దయ గలిగిన హృదయమే దైవమందిరం. బాహ్యసౌందర్యము కేవలం క్షణికమైనది. భగవంతుణ్ణి పూజించుటకు పురుగులు లేని పుష్పములనే ఏరి పెట్టుకోవాలి. హృదయ పుష్పమును ప్రేమజలములో కడిగి, కామక్రోధలోభాలు అనే పురుగుల సంపర్కము లేకుండా, అర్పితభావముతో భగవంతుని కియ్యాలి. భగవంతుడు సర్వవ్యాపి. నమస్కారము చేసే చోటంతా భగవంతుని పాదములు లేకపోలేదు. ఏమి చేసినా సర్వాంతర్యామి అయిన అతనికి అర్పితమే. ఈ భావమే సరైన సాధన. భగవంతుని కొరకు తపించేదే తపస్సు, అది లేకపోతే, తమస్సు సంయమ బుద్ధితో ఆ భగవద్దర్శనమునకై ఆవేదవపడాలి, అదేనిజ సాధన.
(ఆ. ప్ర.పు.15/16)
(చూ॥ దమము)