"నామహిమలను నా దివ్యతత్వమును ఓర్వలేని వారెందరో వున్నారు. వారు నాచర్యలకు గారడి, కనికట్లు, హస్త లాఘవము అని పేర్లు పెట్టుదురు. వారి మాటలవలెనే వారి భావములూ, అనుభవమూ పరిమితమైనవి. ఇట్టి ప్రచారములతో నాకు కళంకము ఆపాదించగలరని వారి భ్రము, నా దివ్యశక్తి యొక్క మహావైభవమును గ్రహించుట అట్టి అల్పజ్ఞులకు, సంకుచిత హృదయులకు అనుభవహీనులకు సాధ్యము కాదు. ఇది సర్వశక్తి సమన్వితమైన దైవ శక్తి. సమస్త శక్తులూ నా అరచేతిలో వున్నవి. నా శరీరము తదితర శరీరములవలెనే తాత్కాలికమైనది; నా శక్తి ప్రభావములు శాశ్వతము, సర్వవ్యాప్తము, నిర్వికల్పము.
(స.శి.సు. త్ర.పు,64)
మహిమలు గారడీలతో, సిద్దులతో వీటికి సంబంధం లేదు.యోగసిద్ధులు సాధన ద్వారా ప్రతివారికి అలవడగలవు. కాని ప్రజలను రక్షించటానికి, వ్యాధులను నివారించటానికి, జనులకు అభయ మివ్వటానికి నేను సృష్టించే వస్తువులు నా దివ్యత్వం నుంచి ఆవిర్భవిస్తున్నది. ఈ అవతారపురుషునికే సాధ్యమయినవి. వీటికి శిక్షణలూ, నిబంధనలూ, అభివృద్ధి ప్రణాళికలూ లేవు. అవి విశ్వవ్యాప్త మయిన సృజన శక్తి నుంచి ఆవిర్భవిస్తున్నది.
మీరు కొన్ని అదృశ్య శక్తులను ప్రయోగించి వస్తువులను ఒకచోట నుంచి మరొకచోటికి తెప్పిస్తున్నారని కొంద రంటున్నారు. నిజమేనా? అదృశ్య శక్తులను ప్రయోగించ వలసిన అవసరం నాకు లేదు. నా దివ్య సంకల్పం ద్వారా వస్తువులను సృష్టించగలను. అన్నీ నేనే. అంతటా నేనే. నేను సర్వ జ్ఞుడను, సర్వవ్యాప్తిని సర్వశక్తి సమన్వితుడను. కాబట్టి నేను ఏది సంకల్పిస్తే అది ఆ క్షణమే జరుగుతుంది. మనదేశంలోనూ, విదేశములలోనూ భక్తులెందరో బాబా తమ హృదయాందరంలో మసలుతున్నట్లు అంతరంగంలో మెరిసే దైవం మీరే నని ప్రశంసించారు. ఈ స్థితి వారికి ఎలా లభించింది?
నా అనుగ్రహం వల్లనూ, వారి భక్తివల్లనూ ఇటువంటి అనుభూతి కలుగుతుంది. మనందరిలో ఒకే దివ్యత్వం వున్నదని నేను పదే పదే చెబుతున్నాను. అందరిలో చిన్న వెలుగు రేఖగా మెరిసే దివ్యత్యమే నాలో సంపూర్ణ జ్యోతిగ భాసిస్తున్నది. అందరిలో వున్న దివ్యత్వ స్ఫూర్తిని దివ్య మహాజ్వాలగా ప్రకాశింప చేయటమేనా ఉద్యమ లక్ష్యము. అనుగ్రహమును అందుకొనే భక్తులు, తమలో తదనుగుణమైన భక్తి శ్రద్ధలను పెంపు చేసుకోవాలి. తమ హృదయాంతరాళాలలో నిత్యమూ బాబా మసలుతున్నట్లుభావించుకొనే వారు ఇటువంటి స్థాయికి ఎదిగిన వారు. వారు నా సన్నిధికి వచ్చి నన్ను సందర్శించి నా సంభాషణ ఆలకించి నా ప్రేమను భక్తితో స్వీకరించి నా దివ్యత్వములో విలీనమవుతున్నారు.
సంశయగ్రస్తులకు నేను ఒక ఉదాహరణ ఇస్తున్నాను. ముత్యాలు ఏరదలచినవారు సముద్రంలో దిగి లోతునకు పోవాలి. ఒడ్డున నిలబడి సముద్రంలో మాత్యాలు ఉన్నవనే కబుర్లు కల్లలు అనకూడదు. అవతార మూర్తిప్రేమానుగ్రహములను పొందగోరిన వారు సాయిబాబా దివ్యత్వమును అవగాహన చేసికొని ఆతత్వంలోమునిగిపోవాలి. అప్పుడే నాలో వారు కలసి పోగలరు. అప్పుడే వారు తమ హృదయాంతరాళములో నా శక్తిని అనుభవించగలరు.
(స.ప్ర.పు.19/21)
(చూ॥ అవతారములు, దివ్య ప్రకటనలు)