సాధకుడు కడు జాగ్రత్తగా ఉండవలెను. ఇంద్రియముల తిరుగుబాటు ఎప్పుడైనను రావచ్చును. మముక్షుత్వము గానీ, యోగముగానీ వచ్చిననూ మరలిపోవుచుండును. అందుకనే ప్రపంచ ధోరణియందుండు వారితో, ఆ సంబంధమైన వస్తువులతో కలియుట ఎక్కువ పోరపాటు. ఎల్లప్పుడూ సత్యాన్వేషణయందే మునిగియుండ వలెను. కోరికలను వృద్ధిపొందించుకొనుట, కాలమును వృధా పుచ్చుట చేయరాదు. ఒక సుఖము మరొక సుఖమును కోరును; అట్లు కోరుట వలన మనస్సు విడిచిన వాంఛలను మరల పొందుటకు సమయమునకు వేచియుండును. సాధకుడు మనస్సును నిగ్రహమందుంచు కొనుటకు పట్టుదలతో యుండవలెను. ఇంద్రియ భోగములనుండి మనస్సును పట్టుపట్టి త్రిప్పవలెను. ప్రార్థనలు కూడా తిరుగచూ ప్రార్థించరాదు. ఒకే స్థలమందు కూర్చొని ప్రార్థించవలెను. అట్టి వానికి ఆత్మయేబలము. ఆత్మయే ధనము.
(జావా.పు.12)
ఇప్పుడు సాధకులు చేయవలసినదేమన, మొదటిది, వివేకము పెంపొందించుకొనవలెను. అనగా, నిత్య అనిత్య విషయమును పరిశీలించుట, అందులో, ఏది యోగ్యమైన దానిని అనుభవింప ప్రయత్నించుట. రెండవది యోగ్యమైన సత్యమైన దానిని అనుభవింప ప్రయత్నించుట. మూడవది, అట్టి ప్రయత్నములలో ఎన్ని అవాంతరములు వచ్చినా చలించక, యోగ్యమైనదని తెలిసి కొన్నదానిని వదల కుండుట. ఈ మూడు విషయములనే నిజతపస్సు అని కూడ అందురు. ఆ తపస్సులోనే నిజశాంతి, సంతోషము ఉద్భవించును. ఇప్పుడు లోకమున, పిపీలికాది బ్రహ్మపర్యంతము నిమిష నిమిషమునకు ఏదో ఒక విధమైన మార్పు చెందుతూనే యున్నవి. మార్పు చెందనివస్తువుకానీ, మార్పుచెందని జీవికాని లేనేలేదు. సృష్టి యావత్తూ మార్పు చెందునదే. ఐతే అట్టి మార్పులో రెండు విధములైన మార్పులు కలవు. బహిర్ముఖమైన మార్పులు ప్రతిజీవికి తెలియును; తెలిసికొనుటకు వీలగును. ఐతే అంతర్ముఖమార్పు తెలియదు; తెలిసికొనుట సులభముకాదు. అందుకనే తెలిసికొని సాధ్యమైన బహిర్ముఖ కర్మలలో మొదట క్రమశిక్షణలను ప్రారంభించి క్రమక్రమముగా అంతర్ముఖముగా ఆచరించవలెను. ఇందులో ఏదైనము మనస్పూర్తిగా ఎవరికివారు సాక్షిగా చేయవలెను. కాని ఇతరుల మెప్పుకొఱకు, ఇతరులను మోసపుచ్చుట కొఱకు, ఇతను చాలా గొప్ప భక్తుడు అని అనుకొనవలెనను ఉద్దేశ్యముతో చేయూడదు. అది ఆత్మద్రోహముగా మారును. భగవంతుడు భావప్రియుడేకాని బాహ్య ప్రియుడుకాడు. బాహ్యములో కూడ భావమును చేర్చిననే శాంతి అనుభవమునకు అవకాశము చిక్కును. మనోవాక్కాయ కర్మలందుకూడ శాంతిని చవిచూడవలెను. ఈ నాల్గింటియందు ఏకముగా అనుభవించినపుడే, పరిపూర్ణ శాంతి, అనగా, మనో వలయము, మనోవలయమునే శాంతి అనియు, యోగ మనియూ అందురు.
(ప్ర.వా.పు.8/9)
సాధకుడు పట్టినపట్టు విడువక ఎన్ని కష్టములైనను, ఎన్ని బాధలనైనను సహించుకొని సర్వోత్కృష్టమైన బ్రహ్మమును దర్శించవలెను. అట్టి కష్టములను, బాధలను భరించుకొను శక్తిని ప్రసాదించునదే శాంతిసూత్రము. శాంతి మూలముననే భక్తివికశించును. భక్తివలన జ్ఞానము బలపడును. శాంతజ్ఞానమే మనిషికి ఆలంకారము. అదే యదార్ధమునుచూపు ఏకైక మార్గము, సంపూర్ణత, సంపూర్ణత అనగా చావులేని జీవితము, లేక పావన జీవితము సంపాదించుటే. నేను ఎవడిని అను విచారణ ఆత్మసాక్షాత్కారమునకు లేక బ్రహ్మజ్ఞానమునకు దారితీయును. కాన మానవుడైనవాడు అట్టి ప్రాప్తినిపొందగోరువాడు భగవంతుని ప్రేమను, భగవత్ స్థానమును నమ్మి, కాంతితో భయము, ఆత్రముల నిర్భంధన లేకుండా ఉండవలెను. ఇట్టి విచక్షణగల మనిషి ఎల్లప్పుడు శ్రద్ధ కలిగి ఉంటాడు. చేసిన తప్పిదములకు పశ్చాత్తాపపడుతాడు. తనను క్షమించమని దేవుణ్ణి వేడుకొంటాడు. ఇట్టి గుణముల ప్రసాదించునట్టిదే ప్రవిత్రశాంతి. అంతియేగాక భగవంతుడు ఎక్కడపడితే అక్కడే ఉన్నాడను భావము మూలముగా మానవుడు భయము లేనివాడుగా వుండగలుగు శక్తిని ప్రసాదించి, శాంతి సుఖములను అనుభవింపవేయును. ఇట్టి పవిత్ర శాంతికి పరమ శత్రువైన కోపమును జయించవలెను. కోపము చిత్తవికారము యొక్క పంటఫలము. కోపము మనసును తన బానిసగా చేస్తుంది. దీనినీ అర్థము చేసుకొనకుండచేయును. సర్వవిషయములు అర్థము చేసుకొనవలెనన్నను. సర్వేశ్వరభక్తి బలపరుచుకొన వలెనన్నను, నీవు శాశ్వత పరమానందమును అనుభవించ వలెనన్నను, శాంతి భక్తియే సర్వోత్కృష్టము. అద్యంతములు లేని శాంతి యొక్క దూతలు కావలెను. దాని మూలమున ప్రపంచమందుండు ప్రాణులకు శాంతివెలుగును చూపండి. అట్టి ఉత్తమోత్తమమైన ఆదర్శజీవితమును గడపండి. ఎవడు ఎల్లవేళలా తృప్తిగా ఆనందముగా ఉండునో వాడు శాంతిని పొందగలడు.
(ప్ర.వా. పు.10/11)
సాధకుడైన ప్రతిమానవుడు ఇట్టివారి బాధలను, గుణములను ఆధారముగా తీసుకొన్న ఎట్టి విసుగు విరక్తి కోపము రానేరదు. భక్తులు భగవత్ శక్తి సామర్థ్యములు సహజములు అని వర్ణించినను, పరిహసించును మారునవి కావు. సాధకుని భావములు సాధనమువలన సాధించునవి. అట్టివాటికి అప్పుడప్పుడు మార్పులు కలుగుచుండును. కనుక అట్టిమార్పు కలుగునపుడెల్లను పై సాధకభక్తులు ఎన్ని ఇక్కట్లకు గురియగుచుండినదియు, వాటిని ఏ మూలమున జయించుచుండినదియు స్వానుభవ మూలమున తెలిసికొని నడచుకొనవీలగునట్లు చేయును. కాన, అప్పుడప్పుడు పై సాధకులు ఎట్టిబాధలనైనను జయించి ఎట్టకేలకు గట్టు చేరిన మార్గమునుస్మరణకు తెచ్చుకొనిన , శాంతి అభివృద్ధి కాగలదు. అట్టి శాంతియే వారల తరింపజేసిన ముఖ్యఆయుధము. ఆ ఆయుధముల మూలముననే కోప, తాప, అసూయ, అహంకార, విసుగు, నిరక్తి, ఇట్టి దుర్మారులను జయించిరి, వారిబారినుండి తప్పించుకొనిరి. కాన సాధకులైన మానవులారా ! శాంతి ఆయుధమును సర్వేశ్వర అనుగ్రహముతో సాధించండి. ఆందుకై సాధన సల్పండి. ఎన్ని కష్టములైనను, ఎంతటి బాధలైనను స్మరణమూలమున సాధించండి. పవిత్రతను ప్రధానముగా కోరండి. భీష్ముడు చూడు, అంపశయ్యపై యుండియు, శారీర మానసిక బాధలు భరింపరాని వైనప్పటికిని ఉత్తమకాలము వచ్చునంతవరకు ఓపికతో కాచుకొనెకాని, "బాధలు భరింపలేను, ఏకాలమైననుసరే త్వరలో నన్ను తీసుకొనిపొ "మ్మని పరమాత్మను కోరెనా? లేదు. ఎంతటి బాధలకైనను, ఎన్నిదినములైనను భరింతును. ఉత్తమకాలము వచ్చునంత వరకు ఉంచుము. ఉత్తమకాలము రాగానే నీలో చేర్చుకొమ్మని ప్రార్థించెను. అందుకనే భీష్మునకు శాంతిభక్తులలో అగ్రగణ్యుడను సార్థక నామము స్థిరముగా నిలిచెను. ఎట్టివారికైనను శాంతి అవసరము. అది వున్నప్పుడే అన్నియూ ఉండును. ఆది లేదా ఏదియూ లేదు. ఇది మానవుని స్వభావమైనప్పటికిని కామక్రోధములే దీనిని కప్పిపుచ్చునవి. వాటిని తీసివేసిన, ఇది తనంతటతానే ప్రకాశించును.
(ప్ర.వా.పు.12/13)
సాధకునకు కలుగు ఆపజయములు, లోపములు, తప్పులు మొదలగువాటి విషయమై దీర్ఘముగా ఆలోచించరాదు. ఆట్లు ఆలోచించిన, శాంతివల్ల సాధించిన ఇచ్ఛాశక్తి బలహీనమగును. లోపములను యథాప్రకారముగా వదలివేయవలెను. ఇచ్చాశక్తి నిర్మలమై బలమైన తరువాత, ఆ లోపములు జ్ఞాపకమునకు రానియకచేయును. అట్లు వచ్చినది, ఎక్కడ వచ్చినది అను యోచన ప్రారంభమైన, దానితోపాటు మరి కొన్ని తప్పులు చేయుదురు. అది తప్పు అని తెలిసిన తరువాత, దాని పుట్టు పూర్వోత్తరములయోచించ పనెమున్నది?కావలసిన, అనుభవించ వలసిన మంచివాటిని యోచించినను కాలము ఒక సత్ చింతగా నుండును. అవసరము లేనిదానిని ఎట్లుపోయిన మనకేమి? దాని చింతనే వద్దు ఇట్టి. కుశలబుద్దిని పెంపొందించు కొనుట సాధకునికి ఎంతయో ఉపకారము.
(ప్ర.వా.పు.15/16)
ఈనాటి సాధకులకు Part-Time devotion వుంది. Full - time devotion లేదు. ఫలితము కూడా అటులే వుంటుంది.
(భ.ప్ర.పు.1)
సత్ శీలమే సంపద. సదాచారమే ధనము. ఆత్మజ్ఞానమే ఐశ్వర్యము ఈ మూడు సాధకునకు అత్యవసరము. లౌకికసంబంధమైన సంపద, ధనము, ఐశ్వర్యము జీవిత కాలమందే కోల్పోతారు. తదనంతరము వాటికి అతనికియెట్టి సంబంధము వుండదు. బ్రతికినప్పుడే దరిద్రదేవత తాండవమాడి యనేక బాధలకు గురియైన సంపదలు కోల్పోతువుంటారు. ఐశ్వర్యాన్ని వీడుతుంటారు. ఇట్టి సంపదలు, ధనము, ఐశ్వర్యములకు జీవిత తదనంతరము అతనిలో యేమాత్రము సంబంధముండదు. కానీ సత్ శీలము, సదాచారము, జ్ఞానము జీవితపర్యంతమే కాకుండా మోక్షాపర్యంతము అతని వెంటనే వుండి అతన్ని సాయుజ్యంలో చేరుస్తాయి. మానవుని యొక్క కీర్తి, రూపసౌందర్యములతో లేదు; ధవకనక వస్తు వాహనాదు లతో రాదు. ఇది శీలముతో మాత్రమే ప్రాప్తిస్తుంది. కనుక మానవుడు సత్ శీలుడై సదాచారుడై ఆత్మజ్ఞానమునకు అన్వేషణ సలపటానికి ప్రయత్నించాలని ప్రబోధించింది గీత.
(శ్రీ.గీ.పూ.67)
సాధకుడు, స్వల్ప విషయములందు కూడా త్వరగా కోపించకూడదు. అట్లుండిన ధ్యానమందు ఎంతమాత్రము వృద్ధికలుగదు. అతడు సౌమ్యముతో కూడిన ప్రేమభావముఅలవరచుకొనవలెను. అప్పుడు చెడు అలవాట్లు తప్పిపోవును.చెడు అలవాట్లు అభ్యసించుటకు కోపమే ప్రథమ పీఠము. ఆది ఉండిన ఏ నిమిషమందైనా, ఎట్టిదానియందైనా, ఏవిధమైన చెడ్డలనయినా చేయవచ్చును. కాన, మొదట దానిని, రూపు మాపవలెను. క్రమేణా ప్రయత్నించవలెను. సాధకులకు తన తప్పులు ఎవరైనా బయట పెట్టిన, అప్పుడు ఓపికతో దానిని సర్దుకొనుటకు ప్రయత్నించి, తన తప్పును తెలిపినవారికి కృతజ్ఞతగా ఉండవలెను. కానీ తెలిపిరికదా అని వారిపై కోపించరాదు. అప్పుడు మంచికి ద్వేషి అయినట్లగును. మంచిని ద్వేషము చేసిన అలవడునవే చెడుగా ఉండును. కావ మంచిని ప్రేమించి, చెద్దను వదలవలెను. వాటిపై ననూ ద్వేషించరాదు. అట్టివాడు ఆధ్యాత్మిక జ్ఞానము నందునూ, ధ్యానమునందునూ వృద్ధి పొందగలడు.
(ధా.పు. 90)
(చూ॥ అవసరం,స్థై ర్యము)