స్వామి దివ్య స్వరూపాన్ని దర్శించటం ద్వారా అవతారాన్ని గుర్తించటమే దర్శనం. స్వామి దివ్యత్వాన్ని స్పృశించటం ద్వారా వారి దివ్యత్వాన్ని అందుకోగలగటం స్పర్శనం. స్వామిబోధనలను సరిగా అర్థం చేసుకుని జీర్ణం చేసుకోవటం సంభాషణం. ఇవన్నీ మానవజాతిని అధోగతి నుండి కాపాడటానికి ఉపయోగించే సాధనలు.
(శ్రీ.స. స.పు.257)
నాదర్శనంవల్ల మీరు పొందు లాభమును ఎన్నటికీ చులకనగా చూడకండి. ఇది మీకు పూర్వపుణ్యమువలన అబ్బిన వరప్రసాదము. నా దర్శనార్థము దేవలోకములోని దేవతలు కూడా ఆతురతతో వేచియుందురు. అంతటి మహా దర్శనభాగ్యము మీకు సుళువుగా దినదినమూ అబ్బుతూ వున్నది. ఇది జన్మాంతర పుణ్య విశేషము మరువకండి: సరియైన సమయ మాసన్నమైనప్పుడు నా దర్శన భాగ్యము వలన మీకు యిచ్చిన దీవెనలు ఫలించును.
(ప్రే.జో.పు.171/172)
నా దర్శనం లభించిన తదుపరి మీరంతా ఏకాంత ప్రదేశమునకేగి అక్కడ నిశ్చల నీరవమైన మౌనం పాటిస్తూ - నా దీవెనలను పరిపూర్ణంగా పొందండి. నేను మీ ముందుగా నడచి వెళ్ళినప్పుడు నా లోని శక్తి మీ పైన ప్రసరించును. వెంటనే, మీరు ఇతరులతో సంభాషించుటకు ప్రారంభించిన ఆ శక్తి మీచే ఉపయోగింపబడక తిరిగి నన్ను చేరును. నా దృష్టి దేనిపైన ప్రసరించునో, అది చైతన్యవంతమై దివ్యమైన పరివర్తన పొందుచుండుము. నాదర్శనభాగ్యమును ఎన్నటికీ తక్కువ అంచానా వేయవద్దు. “నేను మీ మధ్య నడయాడుట" అనే కార్యము దేవతలు కూడా సదా ఆకాంక్షించునట్టి అపూర్వమైన అవకాశము. ఇట్టి అవకాశమును మీరు ప్రతి నిత్యం పొందుతున్నారు. అందులకై సదా కృతజ్ఞులై ఉండవలె. నిర్దిష్ట సమయమాసన్నమై నప్పుడు, నానుండి మీరందుకొంటున్న దీవనలు తమ విలువలను వ్యక్తం చేయగలవు. కాని, ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి. మీలో - ఎవ్వరికి ఎంత తక్కువగా ఇవ్వబడునో, వారి నుండి అంత ఎక్కువగా స్వీకరింపబడును.
(స.సా.జ.. 93 వెనుక పేజీ)