"తస్మై నమః కర్మణే”
ఎవరికి నమస్కారము చేసినా, చెయ్యకపోయినా, తాము చేసే కర్మలకు మాత్రము నమస్కారము చేయాలి. మానవుని జీవితమంతా కర్మ మీదనే ఆధారపడి యున్నది.
కర్మమున పుట్టు జీవుడు
కర్మమునే వృద్ధి పొంది
కర్మమున చనున్
కర్మయే మనకు దైవము
కర్మయే సుఖ దుఃఖములకు కారణమిలన్
(సా|| పు. 357)
పువ్వులేక కాయ పుట్టదు చెట్టున |
కాయలేక ఫలము కలుగబోదు.
కర్మనిష్ఠలేక కలుగదు భక్తియు |
భక్తి లేక జ్ఞాన ఫలము లేదు .
(పా॥ పు. 368)
కర్మ మార్గంబు, విడరాని కాలినడక
భక్తి మార్గంబు, సులువైన బండి త్రోవ
జ్ఞాన మన, విమాన ప్రయాణ మరయ
యోగమన వార్థిపై చను ఓడ కాదే...
(సా॥ పు. 447)
జగత్తు బ్రహ్మమయం బ్రహ్మమయమైన జగత్తు కర్మమయం సృష్టియే పెద్ద కర్మ. మానవుడనగా జీవశక్తి, ఉపాధి శరీరం. మానవుడు సృష్టిలో భాగం. కనుక మానవుడే కర్మ, శరీరమే కర్మమయం. కర్మానుసారంగా శరీరము ప్రాప్తించుచున్నది. కావున మానవ శరీరమునకు, సమస్త సృష్టికి కర్మయే ఆధారము కర్మతత్త్వాన్ని గుర్తించడానికీ, కర్మలాచరించాలి. కర్మలాచరించడానికి కూడా కర్మలను సమగ్రంగా అర్థముచేసుకోవలసి యుంటుంది.
(సా॥ పు. 132)
కర్మ మూడు విధములు కలవు. కాని మరికొంతమంది నాలుగు విధములని అందురు. దుష్కర్మ, సత్కర్మ, మిశ్రమ కర్మ, నాలుగవది ఙ్ణానకర్మ.
భగవంతుడన్నను. పాపమన్నము భయములేక, మంచిచెడ్డల తారతమ్యము యించుకైనను తెలుసుకొనక, అరిషడ్వర్గములకు వశుడై సంసారమోహ నిమగ్నుడై, ఈషణత్రయము లనుభవించుచు, పశుప్రాయుడై, వివేక వైరాగ్య విచక్షణలను మనసున స్మరించక, దయ, ధర్మ, సత్య శాంతి ప్రేమలు లేక చేయునట్టి యే కర్మలయినను దుష్కర్మలే.
భగవంతుడన్నను, పాపకార్యములన్నను భీతి కలవాడై, సత్య, ధర్మ, దయా, శాంతి ప్రేమలతో యెట్టి కర్మలు చేసినను అవి సత్కర్మలగును.
ఇవి చాలా విచిత్ర స్వరూపములు దాల్చియుండును. పరోపకార కార్యములను చేయుచు, దైవభీతి, పాపభీతి వుండియు, వాటికి విరుద్ధమైనదుష్కర్మలు,దుర్మార్గములు,దురాలోచనలు చేయుచునే వుందురు. కొంతమంది పేరు ప్రతిష్టల కొరకు దాన ధర్మములు చేయుచుందురు. పరోపకారమైన సత్రములు, చలివేంద్రము లేర్పరచుచు, అచ్చట పని చేయువారలకు కూలి సైతము సరిగా నివ్వక బాధపెట్టుచుందురు. పేరుకొరకు ప్రాకులాడుచుందురు. ధర్మము ధర్మమని భిక్షగాండ్లకు తనకు పనికి రాని పదార్థములనో, చెల్లని కాసులనో యిచ్చుచుందురు. అనగా యే కర్మను చేసినను తన స్వార్థమును ఆశించి చేయు యెట్టి మంచి కర్మలయినను అని మిశ్రమ కర్మలే..
జనన మరణాది వస్తువాహన బంధు బలగాది సుఖ దుఃఖాది ద్వంద్వములను బాగుగా తెలిసికొని వాటి నుండి దూరమగు మార్గమును శాస్త్ర గ్రంథములవలనను, పెద్దల బోధలవలననూ అనుభవజ్ఞల ననుసరించుచూ, సత్య ధర్మ శాంతి ప్రేమలచే మెలగుచు సర్వేశుని సాయుజ్యమును కోరి యే కర్మలు ఆచరించినను అవి జ్ఞానకర్మలే అగును.
(ప్ర. వా, పు. 16/17)
కర్మలు మూడు విధములు, భూత, వర్తమాన, భవిష్యత్కర్మలు, వర్తమానము నందలి కర్మ కొనసాగును. దీనిని, వాహనమును వెంబడించు ధూళితో పోల్చవచ్చును. వాహనము ఆగినప్పుడే ధూళి దానిపై బడును. ఇక్కడ ఒక సందేహము రావచ్చును. వాహనము, ధూళి నుండి తప్పించుకొనుటకై నిరంతరము ముందుకు సాగిపోతూనే ఉండుట సాధ్యము కాదు. కాని, వాహనము ఎప్పుడూ, ధూళి, ధూసరితమైన మార్గములోనే ప్రయాణించవలసిన అగత్యము లేదు. దుమ్ము ధూళి లేని నున్నటి రాజ మార్గమును చేరవచ్చును. రాజ మార్గము భగవదనుగ్రహము వంటిది. అనుగ్రహము వలన కలుగు ప్రయోజనమునకు, భక్తివలన కలుగు ప్రయోజనమునకు భేదము కలదు. నొప్పితో బాధపడు రోగికి మత్తు మందు నిచ్చి నొప్పిని తగ్గించవచ్చును. కాని అనుగ్రహము శస్త్రచికిత్స చేసి నొప్పిని పూర్తిగా నివారించుట వంటిది.
భగవదనుగ్రహము కర్మము పూర్తిగా తుడిచివేయును. ఈ విషయములో ఎటువంటి పొరపాటు భావనకు లోనుకావద్దు. ఒక మందుపై 1968వ సంవత్సరము వరకు వాడవచ్చు అని వ్రాసి ఉందను కుందాము. ఆ మందును 1973లో వాడిన దాని ప్రభావమేమీ ఉండదు. శరీరము ఆ మందు సీసా వంటిది. కర్మ ఆ సీసాలోని మందు వంటిది. భగవంతుడు ఆ మందుకు ఒక తేదీని నిర్ణయించును. కావున దాని ప్రభావమేమీ ఉండదు.
(ప. పు.208/209)
మానవుని యొక్క జన్మకు అతని మంచి చెడ్డ కర్మలే మూలకారణమైనట్లుగా, నారాయణుడు మానవుడుగా అవతరించుటకును, అతని మంచి చెడ్డ కర్మలే మూలకారణము. కాని, అందులో కొంత వ్యత్యాసము కన్పించును. మానవుడు చేసిన కర్మలు, అతనికి మాత్రమే వర్తిస్తుంటాయి. అవతారలక్షణము అట్టిది కాదు. దుష్టులు చేసిన దుష్కర్మ, సజ్జనులు చేసిన సత్కర్మ, ఈ రెండుకూడను, అవతారములకు మూలకారణమవుతవి. ఇది నరసింహావతారము నందు మనకు చక్కగా గుర్తుకు వస్తుంది. ప్రహ్లాదుడు చేసిన సత్కర్మ, హిరణ్యకశిపుడు చేసిన దుష్కర్మ ఈరెండు కర్మలూ నారాయణుడు నరసింహరూపము ధరించుటకు కారణమైనవి. అదే విధముగనే, ప్రతి అవతారమునకు, ఏవో ఇట్టి కారణములు లేకుండా కార్యము జరిగేటువంటిది కాదు. రామావతారము నకు కూడను, అనేక కారణములుంటున్నాయి. పూర్వము దేవాసురులకు యుద్ధము పెరుగుచున్న సమయములో, అసురులు భృగుమహర్షి భార్యను ఆశ్రయింపగా, ఆమె వారికి కొంత సహాయపడింది. వారిని ఆమె ఆదుకోటంచేత, వారికి కొంతవరకును అపాయం తగ్గింది. ఈ విషయము నారాయణునకు తెలిసినతక్షణమే. నారాయణుడు భృగుమహర్షి యొక్క భార్య శిరస్సు ఖండించాడు. వెంటనే, భృగువు భార్యా వియోగము భరించలేక "మానవావతారముతో భూలోకమునకు దిగివచ్చినపుడు, నీవు కూడను, భార్యా వియోగమును అనుభవింతువు గాక" అని నారాయణునికి శాపమిచ్చాడు. ఇందులో ఉన్నటువంటి అంతరార్థమేమనగా, ప్రతికర్మకు కూడను రియాక్షను(Reaction), రిఫ్లెక్షము (Reflection), రీసౌండ్ (Resound) అనగా ప్రతీకారము,ప్రతిఫలము,ప్రతిధ్వనిఏర్పడుతూనే ఉంటుంటవి.నారాయణుడైనప్పటికీనరావతారంలో వచ్చినప్పుడు తాను కూడను, తనయొక్క కర్మల ప్రతిఫలాన్ని లోకానికి ఆదర్శవంతంగా అనుభవిస్తూ వస్తుంటాడు
(ఆ. పు.60/61)
కర్మలు మూడు విధములు-కర్మ, అకర్మ, వికర్మ అని...వికర్మ సూక్ష్మమైనది. సూక్ష్మమై, సాత్వికమై, ఆత్మ సందర్శన నిమిత్తమై సర్వసంగపరిత్యాగమును చేయునది. ఇది ఏది చూచినా, ఏది పలికినా, ఏది అనుభవించినా ఈశ్వరత్వముగానే అనుభవించును. అకర్మ అనునది దానికి పూర్తిగా విరుద్ధమైనది. అంతర్ కర్మలను గాని, బహిర్ కర్మలను గాని ఏమాత్రము చేయక తమోగుణములో స్తంభించి ఉంటుంది. ఇది తన స్వార్థము తప్ప అన్యము ఏ మాత్రము ఆశించదు. ఇక కర్మ అనేది రజోగుణ సంబంధమైనది. ఇది స్థూలమై, స్వార్థమును తరింప జేసుకునే నిమిత్తమై కర్మలను ఆచరిస్తుంటుంది. ఈ కర్మలను చేసేవారు తమ మనోవృత్తుల నిమిత్తమై కర్మల నాచరిస్తుంటారు. ఈ కర్మ క్రమేణ ఉన్నత స్థాయిలోనికి పోయి విశ్వకర్మలలోనికి, చేర్చుటకు వీలుగా ఉంటుంది.
కర్మ, అకర్మ, వికర్మలను ఆధారముగా చేసికొని మానవత్వమును మూడు విధములుగా విభజించారు. అవి పశుమానవత్వము మానవమానవత్వము. దైవ మానవత్వము. స్వార్ధమును తప్ప అన్యమే మాత్రము విచారించనిది పశుమానవత్వము. ఇందులో భక్తి ప్రపత్తులే మాత్రము లేవు. వీరు పరోపకార కార్యములందు పాల్గొన్నరు. పరుల బాధలు, కష్టములు, చింతనలు వీరు ఏ మాత్రము తలంచరు. కన్నబిడ్డలను గాని కట్టుకున్న వారి కష్టములు గాని వీరు గుర్తింపరు. తన కడుపే కైలాసముగా వర్తించే తత్వము పశు మానవత్వము. ఇక మానవత్వము; తన సుఖమును, తనవారి సుఖమును, కొంత పరివార సుఖమును హద్దులో ఉంచుకొని జీవించే తత్వము మానవత్వము. ఇది అంత విశాలమైనది కాదు. అయితే ఇది క్రమక్రమేణ విశాలము కావడానికి ఆవకావము ఉంటుంది.
(శ్రీ భ.ఉ.పు.9/10)
జగత్తులో మానవుడనుభవించే సమస్త దుఃఖములకు ఆపదలకు, తాను చేయు పనులే కారణము. మానవుడు తాను సుఖపడుతున్నానని,విచారపడుతున్నానని,కష్టపడుతున్నానని భావిస్తుంటాడు. దీనికంతా ఎవరో కారకులు అని విశ్వసిస్తుంటాడు. ఇది చాలా పొరపాటు. మనకర్మలే దీనికి కర్త. మనము నమ్మినను నమ్మకపోయినను,కర్మలు ఫలితమును అనుభవించక తప్పదు. ఇది ప్రకృతి నిలయము. వేడి, చలి, నిప్పు, వర్షము, వీటిని నమ్మినను నమ్మకపోయినను, వాటి ప్రభావము మనపై ప్రసరిస్తుంది. అదే విధముగనే మనము చేసిన కర్మల ఫలితము మనపై ప్రసరించక తప్పదు.
ఇది చేతు, అదిచేతు, ఇంకెన్నియో
చేతు ననుచు ఊహలు అల్లి అలిసిపోకు
ఏ విత్తులను నాటి యిచ్చోట నుంటిరో
ఆ ఫలములే మీకు అందుచుండు
విత్తనం బొకటైన వేరయిన ఫలములు
సమకూరుటెట్లది సాధ్యమగును?
ఎన్ని చేసిన అవి యన్నిఎంచి ఎంచి
మంచియైన,చెడుగైన త్రుంచకుండ
బ్రహ్మ మీకిచ్చి పంపును బరువుమాల
కర్మలన్నియు చేర్చిన కంఠమాల
వేసుకుందురు మీరు విషయమిచ్చు విత్తులు
ఆశింతురు నేడు ఆతి రుచ్య ఫలములు
కాసిన కడు చేదు కాయలు తినలేక
దోషము నా పైన ద్రోసి వాదింతురు.
కనుక మనము కర్మలను సక్రమ మార్గములో ప్రవేశపెట్టాలి. కర్మలకు హస్తములు మాత్రమే కాదు, శరీరమంతా ప్రధానము. ఏది చేసినా ఏది చూచినా, ఏది విన్నా త్రికరణ శుద్ధితో చేయాలి. అనగా మనోవాక్కాయ పరిశుద్ధితో, త్రికరణ శుద్ధితో పలకాలి. వినాలి, ఆనందించాలి.
సమాజము యొక్క ప్రవేశము చేతను, సత్పురుషుల సందర్శనము చేతను, సత్కార్యముల ప్రభావము చేతను, మనము విశాలముగా మారుటకు వీలుంటుంది. కనుక ఈ మానవత్వమనేది దైవమానవత్వములో ప్రవేశించుటకు ఎంతైనా అవకాశము ఉంటుంది. “సతతం యోగినః" సర్వమూ భగవంతుని స్వరూపమే; సర్వత్ర భగవంతుడు ఉన్నాడు. ఏది చేసినా, ఏది చూపినా, సర్వమూ, దైవత్వముగా భావించుటే దైవమానవత్వము. అట్టి కర్మలు చేయువారే దైవమానవులు; తమకు సంభవించిన దుఃఖమునకు, లేక అపకారమునకు, కీడునకు, నష్టమునకు విచారించక, సంతోష శాంతములతో, ఇవి అన్నియూ తాము పూర్వము చేసుకున్న కర్మల ఫలితమేగాని, వేరుకాదని తలచి, అట్లు అపకారము చేసినవారిని కూడా, ఆప్యాయతతో చూచుచూ, తనకు చెడ్డచేసిన వారికి, తిరిగి చెడ్డచేయకుండా, ఓర్పుతో సహనముతో ఉండువారు.
(శ్రీభ..పు.10/11)
కర్మ చేతను జ్ఞానo బు కలుగుగాని
ఙ్గాని యొనరించు కర్మ అజ్ఞాని కొరకే
పూజ్యులరసిన మార్గంబు పూసిరేని
ఆత్మఙ్ఞానము యలవడు అవనిలోన
(శ్రీవాణి సె2022 పు29)
కర్మము చేయ నరునకు కలదు హక్కు
కర్మ ఫలమీయ ధాతకు కలదు హక్కు
అడుగ ఫలముల ఏరికి హక్కులేదు
ఇంతకన్నను వేరెద్ది ఎఱుక పరతు
(శ్రీవాణి సె2022 పు29)
సత్కర్మయే జన్మధర్మము సాయి సేవా ఝరి "ఈ జీవిత కుసుమము ఎన్నడో ఒకనాడు వాడి నేలబడక తప్పదు. ఈ సత్యమును గ్రహించి అట్టి తరుణమును విచారముతో కృంగి కృశించుచు ఎదుర్కొనుట కంటె, సత్కర్మలచే సంతోషము నినుమడించు కొనుటయే సర్వశ్రేష్ఠము, కర్తవ్యమూ కూడ. అపురూపశక్తులన్నియు నా పరమేశ్వరునివే. సత్కర్మయే ఈ జన్మధర్మమని నేను పలుమార్లు చెప్పియున్నాను. తిరిగి తిరిగి జన్మలకు స్వాగతము పల్కకుము. అయినను అనివార్యమగుచో జీవితము ధన్యము చేసుకొను తెరగున ప్రవర్తించుము. అందరునూ నాదృష్టిని నటకులే. ఈనాటక రంగమున సుకౌశలముగ పాత్రోచిత కర్మనెవరు నిర్వహించుదురో వారికి జగన్నాటక సూత్రధారియగు జగదీశ్వరుని కటాక్షము, శాశ్వతానంద ప్రాప్తియు తథ్యము."- బాబా
(సాయి సేవా ఝరి నాల్గగ కవరు పేజి నవంబర్ 2011)