బ్రహ్మమను పదము బ్బహ్ అనెడి పదమునుండి వచ్చినది. బ్బహ్ అనగా పెరుగుట, విస్తరించుట, వ్యాపించుట. బృహత్ అనగా పెద్దది. గొప్పది. ఎత్తైనదని, స్థూలమైనదని కూడా చెప్పవచ్చును. పురుష అన్నపదముప్రియ అను మాటనుండి వచ్చినది. ప్రిఅనగా నింపుట. పూర్తిచేయుట అని కూడను అనవచ్చును. పుర్ అనగా నగరము. ఆస్థానమున దేహమును పోల్చుకొనవచ్చును. దేహమనే అనవచ్చును. వీటిని నింపువాడు కావున పురుషుడనబడును. ఆత్మ అను పదము ఆప్ అనెడి మూలమునుండి వచ్చింది, ఆప్ అనగా పొందుట ఆక్రమించుట అని. కాన, ఆత్మను తెలుసుకున్న వానికి సర్వమును లభించును.
(జ్ఞావాపు 271)
ఎంతకాలము రోత బ్రతుకు. మానవత్వమనేది ఈనాడు నూతనంగా ఏర్పడినది కాదు. ఎన్నో జన్మల నుండివచ్చుచున్నది. పాతదే అయితే ఎల్లకాలమూ యీ మానవత్వాన్ని పాతగా, రోతగా, భావించి అనుభవిస్తూ వుంటే, తన స్వస్వరూపాన్ని అనుభవించేదెప్పుడు? కనుకనే సర్వం బ్రహ్మమయం అనే స్వరూపాన్ని మనం నిరూపించాలి. మన సమాజములోనే సర్వ స్వరూపమైన ఈశ్వరత్వాన్ని ఆవిర్భవింప చేసుకోవాలి. "ఈశా వాస్యమిదం సర్వం" ఈ సర్వమును ఈశ్వరుడే. సర్వము బ్రహ్మమయమే - బ్రహ్మమునకు వేరైన పదార్థమొక్కటియు లేదు సర్వము బ్రహ్మరూపముగా యున్నప్పుడు మనము వెదుకుట ఎక్కడ? తాను చిక్కుట ఎక్కడ? విశ్వమంతయు, ప్రాణవిభుని మందిరమైన వీధి స్థానము ఎక్కడ యున్నది? వీధి లేనప్పుడు వీధి వాకిలి చింత ఎందుకు? విశ్వ విభుడే హృదయేశ్వరుడు. .
(సా.పు 474/475)
బ్రహ్మము స్వప్రకాశము, స్వప్రతిష్టము. మరి కొందరు పరాశక్తియే ఆనందమయాత్మ అనియు దానినే పరాకాశమనియు పేర్కొనిరి. ఇవన్నియూ వారివారి భావసూచనలే. బ్రహ్మకు బ్రహ్మనే ఆధారము బ్రహ్మమునకు మూలభేదము లేనందున, ఆనందమయాత్మగా బ్రహ్మనే నిర్దేశించవచ్చు. ధర్మము కంటే ధర్మ స్వభావము వేరు కాదు కదా! ఆత్మకంటే బ్రహ్మ వేరు కాదు. ఆనందాత్మ పరమాత్మయే కాని జీవాత్మ కాదు. ఇందులో జీవ పరమాత్మల అభేద ప్రసక్తే లేదనియు ఆనందము ఆప్రేయము, ఆనంద మయమనగా ఆనందమే అనియు అర్థము.
(సూ.వా.పు 47)
అన్నము తన స్వరూపాన్ని ధరించి దేహమంతా వ్యాపించి పుష్టిని, సంతుష్టిని చేకూర్చుతుంది. కనుకనే "అన్నము బ్రహ్మ" అన్నారు. పుష్టివంతమైన దేహాన్ని సద్వినియోగపరుచుకునే మనస్సును ప్రసాదించమని భగవంతుణ్ణి ప్రార్థించేవారు ప్రాచీన మహర్షులు. ఈనాడు అనేకమంది బ్రహ్మను చూడాలని ఆశిస్తున్నారు. కానీ, భ్రమలో మునిగిపోతున్నారు. అనేకత్వంలోని ఏకత్వమేబ్రహ్మ: ఏకత్వాన్ని అనేకత్వంగా భావించడమే భ్రమ. ఈనాటి మానవుడు అనేకత్వంలోని ఏకత్వాన్ని గుర్తించే దృష్టిని కోల్పోయినాడు: ఏకత్వాన్ని అనేకత్వంగా విభజించటంలో గొప్ప మేధావి గా తయారవుతున్నాడు. అనేకత్యంలోని ఏకత్వాన్ని గుర్తించటానికి ప్రయత్నించటమే మానవుడు చేయవలసిన సాధన. వేద శాస్త్రములను, ఉపనిషత్తులను, బ్రహ్మసూత్రములను పఠించినంత మాత్రమున బ్రహ్మతత్త్యాన్ని గుర్తించడానికి వీలుకాదు. వాటిని ఆచరణలో పెట్టాలి.
(స. సా...మే99పు.128)
బ్రహ్మమే సర్వ శరీరములందు సర్వ భూతములందూ, నేను నేను అను రూపమున నివసించుచున్నది. ప్రతి శరీరము, నేను వస్తువునే ఆశ్రయించుకొని యున్నది. ఆ శరీరములందు కూడా ఒక్కొక్క అంకము ఒక్కొక్క కార్యమునందు ప్రాధాన్యత వహించియుండును; ఉపయోగపడుచుండును ఒక్కొక్క ఇంద్రియము ఒక్కొక్క విషయమును గుర్తిడుచుండియూ, ఈ సర్వ ఇంద్రియములకు సంబంధించియూ వాటన్నిటికి అతీతమయి. నేను అనునది ప్రకాశించుచుండును. ఈ నేనను వక్తి ఈ సర్వాంగములలో సర్వేంద్రియములలో చేరకున్న అవి అన్నియునూ జడములైపోవును!..
"నేను అనుశక్తి సర్వేంద్రియములలో చేరినపుడే ఆయా ఇంద్రియములు వాటి వాటి పనులను చేయగలవు. ఇట్టి శక్తినే ఆధ్యాత్మం అని అందురు. బావా! ఇది అందరికి అంత సులభముగా తెలియనట్టిది కాదు. తెలిసికొన వీలులేదు. వివేకదృష్టిలో విచారణ సలుపు వారలకే కొంతవరకు అర్థమగును, విషయము తెలియును.
(గీ.పు.126)
శాస్త్రములందు, సచ్చిదానంద స్వరూపుడు బ్రహ్మ అని వున్నదికదా! ఇది కేవలము వేదాంత పరిభాషయొక్క అర్థము. ఇక సంస్కృత భాషలోని అర్థము. అస్తి భాతి ప్రియం అని అందురు.ఈ రెండూ ఒకటియేనా? అని విచారించిన రెండూ ఒక పదార్ధమే. ఒకస్థితి యొక్క నామములే, స్వభావము కానీ, పదార్థము కానీ వేరుకాదు. సత్ అనగా యెల్లప్పుడు వుండునది. దానినేసంస్కృతమున, అస్తి అని అందురు. చిత్ అనగా అన్నింటిని తెలిసికొను శక్తి: దీనిని సంస్కృతమున, భాతి అని అందురు. ఇక ఆనందమనగా నిరంతర సుఖాపేక్ష దీనిని సంస్కృతమున ప్రియం అని అందురు. ఈ మూడున ప్రతి మానవుని యందుండును, పశుపక్షులయందు సహితము గోచరమగుచున్నది. ఎటులన, సత్ అను మొదటి దానిని విచారించిన తెలియును.
(గీ.పు. 126/127)
ఆత్మ తత్త్వమెరుగ ఆనందమబ్బు
తత్త్య మెరుగకున్న తామసుడగు
బ్రహ్మమెరిగినంత బ్రహ్మమే యగునయా
సత్యమైన బాట సాయిమాట
(సా॥పు 432/453)
సూక్షమైనట్టి అణువున సూక్ష్మమగుచు
మేటి వస్తువునందు మేటి యగుచు
అంతటను సర్వసాక్షియై అలరునట్టి
ఆత్మయే బ్రహ్మ! బ్రహ్మయే ఆత్మ:
(సా॥పు.399)
బ్రహ్మత్వం పొందటానికిఅహంతత్వం పోవాలి.
(సా॥పు.522)
ఏకార్యము చేయటానికి పూనుకున్నా అక్కడ ఒక ప్రశ్నను వేసుకోవాలి. ఆత్మస్వరూపుడైన బ్రహ్మనునేను. ఈ కాయములో నివసిస్తున్నాను. కనుక ఆత్మ స్వరూపుడైననేను బ్రహ్మ స్వరూపుడైన నేను ఈ కాయముతో ఈ కర్మలు ఆచరించవచ్చునా ఆచరించకూడదా? అని విచారణ చేసుకోవాలి. ఈ కర్మచేయతగినదా చేయ తగనిదా? అనే విషయమును విచారించుకోవాలి. అప్పుడే యీ దేహము సద్వినియోగము గావించుకున్నవాడ వవుతావు.
(బృత్ర.పు.14)
లేనిదిది యని చెప్పంగ గలరు గాని
బ్రహ్మ మిదియని చెప్పంగ ఏవరితరము
నిత్య సత్యము జ్ఞానoబు బ్రహ్మమతనె
వాక్కున కు అలవి కానిది వసుధ యందు
(భగవాన్ దివ్యోప న్యాసము 23 -11 -1981)
భాను తేజము కంటె భాసిల్లు చుండును
మంచు తెలుపు కంటె మించియుండు
ఆకాశమును కంటె అతి సూక్ష్మమైయుండు
సర్వ జీవులయందు బర్వియుండు
పరమాత్మ లేనిది పరమాణువును లేదు
అంతట నిండి తానమరియుండు
పరమాత్మ చైతన్యము భవ్యప్రభావమై
సర్వ జీవులయందు ఇమిడియుండు
బ్రహ్మయే మీరు మీలోన బ్రహ్మయుండు
ఇంత కంటెను వేరెద్ది ఎఱుక పరతు?
సాధు సద్గుణ గణ్యలౌ సభ్యులారా!
(సత్యసారం--పద్య రూపం పు37)