నారాయణ బోధ నమ్మియుండిన చాలు
సామ వేదము చదివి నట్టె
నారాయణునివాక్కు నమ్మి యుండిన చాలు
ఇల యజర్వేదము నుడివినట్లే
నారాయణుని వాక్కు నమ్మి సేవించిన చాలు
పుడమి ఋగ్వేదము నుడివినట్లే
నారాయణుని బోధ నమ్మి యుండిన చాలు
సకల శాస్త్రంబులు చదివినట్లే
వాదమేల యధర్వణ వేదమిదియె
తుచ్చ భావాలు మదిలోన తొలిగించి
నిశ్చలముగ బుద్ది నిలుపుకున్న
ఇంతకన్న శివరాత్రి వేరొకటి కలదే
(భ.ప్ర.పు.19)
వేదము సనాతన శాస్త్రము, శాస్త్రమనగా అజ్ఞాత జ్ఞాపకము; అనగా, లోకసిద్ధము కాని అతీంద్రియములైన అర్థముల దర్శింప జేయుటకు ప్రవృత్తమైనది, పురుష బుద్ధికి గోచరముకానిదగుటచే, “పరమంవ్యోమ, పరమం పదమ్, అక్షరమ్, తత్, సత్" అని యీరీతిగా ఋగాది శ్రుతులన్నియు తెలిపెను.
ఒక వేదమును తెలియజేయుటకై అనేక పదములార్బవించెను. వేదశబ్దము మొదట సర్వజ్ఞుడగు పరమేశ్వరునకు వాచకమగుచు, (వేత్త తీతి వేదః) తరువాత తత్స్వరూపనిరూపణాపరమై (వేదయతీతి వేదః) సర్వజ్ఞ కల్పమగుఋగాది శబ్దరాశికినీ వాచకమైనది. తరువాత తదనుగుణముగ ప్రవృత్తములయ్యెడి, ధర్మ, అర్థ, కామములకు నుపలక్షకమగుచున్నది. మొదట (సర్వ ద్రష్ట) యగు పరమేశ్వరుని బోధించుచు, తరువాత ఆ పరమేశ్వరుని దర్శింపజేసెడి (దర్శనాత్) ఈ వేదము, ఋషి శబ్దరాశికి కూడా వాచకమై వరలినది. తరువాత ఋషులు దైవ వేదములను ఆరాధించి తదను గ్రహముచే ద్రష్టలయి వెలసి, ప్రసిద్ధములైరి.
దీనిని పురస్కరించుకొని పరమేశ్వరునకు "మహర్షి" అని కూడా నామము ప్రసిద్ధమైనది. బ్రహ్మసూత్రమున మహర్షి: ముఖ్యర్థి: శివ:" అని కూడా సహస్రనామములు కలవు. పరమేశ్వరుని దర్శింపచేయునదగుట చేత, వేదమునకు ఋషి అనియు నామము సార్థకము. బ్రహ్మ అని వేదమునకు నామము. అందుచే బ్రహ్మను పొందుటకై చేయు ఫలత్యాగ కర్మలకు, బ్రహ్మయజ్ఞమని, ఋషియజ్ఞమని కూడా చెప్పుతూ వచ్చిరి. శుద్ధ, శుభ, సాత్విక, నిస్స్వార్థ కర్మలన్నియూ యజ్ఞములే..
(స.వా.పు. 167/168)
(చూ: అద్వైత దర్శనము, బ్రహ్మ,భూషణం, వేదములు, విద్య)