జన్మాద్యస్యయతః - ఉత్పత్తి, స్థితి, ప్రళయములు - అనగా దృశ్య కల్పితమైన ఈ జగత్తంతయూ ఎక్కడ పుట్టుచున్నదో, యెవరివలన కలుగుచున్నదో, ఎవనివలన రక్షింపబడుచున్నదో, కడకు ఎవరి యందు చేరుచున్నదో అనగా లయమగుచున్నదో అదే బ్రహ్మమని తెలియవలెను. ఈ జగత్తును ఒక విధమైన క్రమ పద్ధతిలో నియమించువారు ఒకరుండవలెను కదా! ఈ మూడింటికి నియతి, జ్ఞానము, అకృతి (అనగా అజ్ఞానము) అవసరము. అస్య - ఈ కనిపించుచున్న ప్రపంచమునకు. జన్మాది-ఉత్పత్తి, స్థితి. ప్రళయములు. యతః ఎవరి వలన కలుగుచున్నదో అది బ్రహ్మము.
జగత్స్వభావమును గూర్చి మనము అధికముగా తెలుసుకొనవచ్చును. అయితే చూచినది మానవనేత్రమే కదా! భౌతికశాస్త్రము సాధించిన వన్నియూ మానవుని మనస్సు యొక్క ఫలితములే కదా! భౌతికశాస్త్రము వున్న విషయములను వర్ణించి వివరించును. అయితే ఈ వివరములు యెంతకాలము నిలిచియుండును? ఇవి మాటిమాటికి మారుచునే యుండును. ఎన్ని మారినా మారని తత్వము ఒకటి యున్నది. దానిని ఆధారముగా చేసుకొనే ఈ మారు వస్తువులు అధేయముగా ఉన్నవి. ఆ ఆధారమైన, ఆచరమైన, సత్యమైన పరతత్వమే బ్రహ్మము. ప్రపంచమునకు ఒక ఉత్తమ ఆదర్శము కలదు. అదే బ్రహ్మము.
ఈ ప్రపంచో త్పత్తికి, స్వభావము నియతి, ఆకస్మిము, కాలము, కారణమని భావిస్తారు. వీటి యొక్క సంయోగములు జగత్కారణములు కాజాలవు. కారణమేమన ఇవన్నియూ జడములు. జీవుడు కూడా సుఖ దుఃఖములకూ, వృద్ధి క్షీణములకూ, జనన మరణములకూ లొంగియుండును. కనుక జీవుడు పరతంత్రుడే. కావున జగత్ ఉత్పత్తికి కారణము కాదు. సూత్రము మనలను ప్రామాణిక ఆధారముల చెంతకు తీసుకొని పోవుచున్నది. జగదస్తిత్వమునకు, స్వభావమునకు, క్రమతకు, పరిపూర్ణతకు కారణభూ తమైన ఒక మహత్తరమైన ప్రమాణము వలన నిరూపించుచున్నది. వస్తువులు యెట్లు కలుగునో భౌతిక శాస్త్రము వివరించవచ్చును. అయితే అవి ఎందుకు అట్లు కలుగుచున్నవో భౌతిక శాస్త్రము తెలుపలేదు. అయితే ప్రతికార్యమునకు కారణము కలదు. అణువుగాని, అభావముగాని, జీవుడుగాని, ప్రపంచమునకు కారణము కాదు. సత్తు విషయావిషయ భేదముల నతిక్రమించి వున్నది. అయితే బ్రహ్మమును గురించి చెప్పినపుడు మనము వ్యావహారిక శబ్దములను ఉపయోగించవలసి యుండును. సృష్టికర్తగా, లోకపాలకునిగా భావించినపుడు బ్రహ్మము దైవము అని చెప్పుచున్నాము.
విశ్వము వైపునుండీ మనము కార్యకారణవిచారణ చేయునపుడు, కారణవస్తువు దైవము అని భావించు చున్నాము. కార్యవస్తువు జగత్తుని నిరూపించుచున్నాము. విషయా విషయ భేదములను అతిక్రమించినప్పుడు శుద్ధ చైతన్యమనే బ్రహ్మమునే స్వరూపలక్షణముగను, తటస్థ లక్షణముగాను ద్వివిధ లక్షణములుగాను భావించుచున్నాము. ఏల యన మాయా సంబంధము వలననే బ్రహ్మము జగత్తు యొక్క ఉత్పత్తి, స్థితి ప్రళయాదులకు కారణమని చెప్పబడుచున్నది. మరికొందరు మాయ, బ్రహ్మము ఇరువురూ కలసి జగత్కారణమని అందురు. మరికొందరు మాయ ఒక్కటే జగత్కారణమని యందురు.
ఇంకా జగత్తు విష్ణువునుండి యుద్భవించినది, అతనియందే ఉన్నది; జగత్తు యొక్క ఉత్పత్తి, స్థితి, లయములకు విష్ణువే కర్త అని అందురు.
లోకమునందు ప్రతి వస్తువునందును అయిదు లక్షణములు కలవు. అవి అస్తి భాతి, ప్రియం, రూపము, నామము. ఒక వస్తువు “ఉన్నది" అనునది అస్తి అనే శబ్ద లక్షణము. ఆ వస్తువు ఉన్నట్లు మనకు కన్పింపచేయునది ప్రకాశము. కనుక ఆ ప్రకాశింపజేయు శక్తి భాతి అను శబ్దలక్షణము. ప్రతి పదార్థము. మనయొక్క వినియోగమునుబట్టి, మనము ఆ వస్తువును ప్రియముగా చూతుము. అట్టి ప్రియమే మూడవ లక్షణమైన ప్రీతిగా చెప్పబడుచున్నది. మిగిలిన రూప నామములున్నవి. అవి మార్పు చెందే మాయారూపములు. ఉండినట్లుండి మార్పు చెందును. మార్పు చెందినట్లు తోచి తిరిగి స్వరూపమును ధరించును. దీనినే మాయ అని యందురు. ఇవి కేవలము అధేయములు మాత్రమే. నామరూపములు అనేకము. వాటిలో అస్తి భాతి ప్రియ నామరూపములలో గోచరించు భగవంతుడే ఏకము. అదే సర్వవస్తువులకూ ఆధారము. మణులలో దారము చేరినట్లు మణులు అనేకము, దారము ఏకము.
సమస్త జీవకోటికి ఆధారము, శాశ్వతము అయినది పరబ్రహ్మమే. భగవంతుని స్వరూపము నామరూపమున కంటే భిన్నమైనది కాదనియు, అదియే బ్రహ్మమనియు, సో..హం అని భావించుటలో, పరమాత్ముని స్వరూప లక్షణము ద్వారా తెలుసుకొనుటయే బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి" అని శ్రుతి. ఇదియే స్వరూప లక్షణము. ప్రపంచ ఉత్పత్తికి బ్రహ్మయే కారణము. నీటిలో పుట్టిన నీటిబుడగ నీటియందే ఉండి నీటియందే లయమగుచున్నది. ఈ దృశ్యగోచరమగు సమస్తము నీటిబుడగల వంటివి. అయితే నీరు బ్రహ్మము. బ్రహ్మమను నీరు నుండే నీటిబుడగలు పుట్టుచున్నవి కాదా? నీటి యందే నిలిచియున్న వికదా? తిరిగి నీటిలోనే చేరిపోవుచున్నవి. ఉత్పత్తి స్థితి లయములకు నీరే ఆధారము. నీరు ఏకము. బుడగలు అనేకము. నీరు సత్యము, బుడగలు మిథ్యము. నీరు ఆధారము, బుడగలు ఆధేయము.
మొదటి సూత్రము బ్రహ్మమును నిర్దేశించుచున్నది. రెండవ సూత్రము ఆ బ్రహ్మమనే మరొక రూపమున నిర్దేశించుచున్నది. మొదటిది సత్యము, జ్ఞానము స్వాతంత్ర్యము, బ్రహ్మయే సృష్టి ముఖము. సృజనాత్మకుడగు భగవంతుని ఏకాభివ్యక్తమగు జగత్తునకే దృష్టిని పరిమితము చేయరాదు. జన్మాద్యస్యయత: దృశ్యకల్పితమైన చరాచర ప్రపంచమంతయు అదృశ్య కల్పింతమైన చరాచర ప్రపంచమంతయు ఎవరివలన ఉదయించుచున్నదో, దేని ఆధారము వలన అభ్యుదయము పొందుచున్నదో అనగా రక్షింపబడుచున్నదో చివరకు దేనిలో లయమగుచున్నదో అదే బ్రహ్మయని తెలుసుకొనవలెను.
తైత్తిరీయోపనిషత్తులో యతోవా ఇమాని భూతాని జాయంతే, యేన జాతాని జీవంతి, యత్ర్పయంత్యభిసంవిశంతి తద్విజిజ్ఞాసస్య, దద్బ్రహ్మేతి అన్నారు.
అనగా దేని నుండి సమస్త భూతములు పుట్టుచున్నవో వృద్ధి చెందుచున్నవో చివరకు దేనియందు లయమందు చున్నవో అది బ్రహ్మము అని.
ప్రపంచములో ఏ వస్తువును కాని నిర్మింపవలెనన్న కర్త ఉండియే తీరవలెను. కర్త లేని నిర్మాణము కలుగబోదు. అయితే మనకు కనిపించే అనంత నిర్మాణములో సూర్యచంద్రాదులు నక్షత్ర మండలాలు వాటి కాంతులు కాల గతులు ఇవన్నియు కర్త లేకుండా ఎట్లు వ్యవహరించుచున్నవి? ఇవి సామాన్య శక్తులకు సాధ్యమగునవా? సృష్టింపబడిన సృష్టికే మానవాతీతమైన అద్భుత శక్తులుండగా ఇక సృష్టించిన కర్త ఇంకెంతటి శక్తి మయుడో విజ్ఞలైన వారు విచారించవచ్చును. సృష్టియొక్క చిత్రము అతి విచిత్రమైనది. ఒక దానికి మరొక దానికి పోలిక లేదు. ఒకరికి మరొకరికి పోలిక లేదు.
ఇది ఒక అనంత మహిమాన్వితుడైన భగవంతుని లీల తప్ప అన్యము కాదని ఎట్టివానికైనా తెలియక పోదు. సృష్టిని బట్టి సృష్టికర్త ఎంతటివాడో సులభంగా ఊహించవచ్చును. సృష్టిని అర్థం చేసికొనలేనివారు సృష్టి కర్తను అర్థము చేసికొనలేరు. సృష్టి యనగా బ్రహ్మేచ్చకు ప్రకటనే, అంతా ఈశ్వర సంకల్పమే.
(సూ.వాపు.13/21)
“జన్మాద్యస్యయత: అనే సూత్రములో ఆకాశాది సంపూర్ణ జగత్తు యొక్క కారణరూపము బ్రహ్మయని చెప్పబడినది ". సమస్త జగత్తు యొక్క కారణ రూపము బ్రహ్మమే. ప్రాణ శబ్ధము పరబ్రహ్మ యందే వర్తించును.
(సూ.వా.పు.54)